రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లుపై కాంగ్రెస్ చూపుతున్న అత్యుత్సాహానికి నిరసనగా వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో శుక్రవారం చేపట్టిన బంద్ విజయవంతమైంది. ఒంగోలు నగరంలో విద్య, వాణిజ్య సముదాయాల మద్దతు లభించింది. ఉదయం 4.30 గంటలకే పార్టీ శ్రేణులు ఆర్టీసీ గ్యారేజీ గేటు ముందు బైఠాయించాయి. బస్సులు బయటకు తెచ్చేందుకు ప్రయత్నించిన పోలీసులు, నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
కొందరు నాయకులను అరెస్టు చేసిన అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. పార్టీ జిల్లా కార్యాలయం నుంచి భారీ ఎత్తున బైక్ ర్యాలీ చేపట్టి సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలను మూసివేయించారు. మంగమూరు రోడ్డు వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు.
జిల్లా అధికార ప్రతినిధులు నరాల రమణారెడ్డి, కొఠారి రామచంద్రరావు, వాణిజ్య విభాగం జిల్లా కన్వీనర్ వేమూరి సూర్యనారాయణ, గ్రామీణ ఉపాధి, పరిశ్రమల విభాగం జిల్లా కన్వీనర్ బొగ్గుల శ్రీనివాసరెడ్డి, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ కఠారి శంకర్, వాణిజ్య విభాగం జిల్లా కన్వీనర్ డీఎస్ క్రాంతికుమార్, మహిళా విభాగం జిల్లా కన్వీనర్ పోకల అనూరాధ, నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, సింగరాజు వెంకట్రావు, మహిళా విభాగం నగర కన్వీనర్ కే సుశీల, ప్రచార విభాగం నగర కన్వీనర్ డీ ప్రసాద్‌నాయుడు, వైఎస్‌ఆర్‌టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గోవర్థన్‌రెడ్డి, నగర అధికార ప్రతినిధి రొండా అంజిరెడ్డి, మహిళా విభాగం నగర కన్వీనర్ కావూరి సుశీల, యువజన విభాగం నగర కన్వీనర్ నెరుసుల రాము తదితర నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌వి కపట నాటకాలు..
అద్దంకిలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఏఎంసీ చైర్మన్ పులికం కోటిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణమూర్తి తదితర నాయకులు రాస్తారోకో నిర్వహించి బంద్ విజయవంతమయ్యేలా కృషి చేశారు. మేదరమెట్ల-నార్కెట్‌పల్లి రాష్ట్రీయ రహదారిపై బైఠాయించారు. పార్లమెంటులో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే కాంగ్రెస్ కపట నాటకాలు ఆడుతోందని దుయ్యబట్టారు. వైఎస్‌ఆర్ కాంగ్రె స్ ఎప్పటికీ సమైక్యాంధ్రకే కట్టుబడి ఉందని తెలిపారు.
ఇక సహించం..
ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెస్ అధిష్టానం సీమాంధ్ర ప్రజలతో చెలగాటం ఆడుతోందని.. ఆ పార్టీని ఇక క్షమించమంటూ వైఎస్‌ఆర్ సీపీ కనిగిరి నియోజకవర్గ సమన్వయ కర్తలు ముక్కు కాశిరెడ్డి, కాటం అరుణమ్మ ధ్వజమెత్తారు. పార్టీ ఆధ్వర్యంలో కనిగిరిలో దుకాణాలు, పాఠశాలలను మూసివేయించారు. అనంతరం భారీ ర్యాలీ చేపట్టారు. పార్లమెంట్‌లో సీమాంధ్ర ఎంపీలపై దాడిని ఖండించారు. స్థానిక చర్చి సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర విభజన జరిగితే లక్షలాది మంది సీమాంధ్రుల భవిత ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర దుస్థితికి కారణంగా నిలుస్తున్న కాంగ్రెస్, టీడీపీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
ప్రజాస్వామ్యం ఖూనీ అయింది
పార్లమెంట్‌లో రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ దర్శి పట్టణం లో చేపట్టిన బంద్ విజయవంతమైంది. వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో దుకాణాలు, కార్యాలయాలు మూయించారు. పొదిలి, కురిచేడు, అద్దంకి రోడ్లపై పార్టీ జెండాలతో భారీర్యాలీ నిర్వహించారు.కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గడియార స్తంభం సెంటర్‌లో మానవహారంగా నుంచున్నారు. మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి మాట్లాడుతూ పట్టపగలే పార్లమెంటులో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందన్నారు.
రాహుల్ గాంధీ కోసమే..
గిద్దలూరులో చేపట్టిన బంద్ విజయవంతమైంది. జిల్లా అధికార ప్రతినిధి సూరా స్వామిరంగారెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అష్టకష్టాలూ పడుతోందని దుయ్యబట్టారు. తెలంగాణ ఏర్పాటు తిరోగమనానికి సూచనని చెప్పారు. పార్లమెంటు సభ్యులకు ముందుగా సమాచారం ఇవ్వకుండానే అత్యంత ప్రతిష్టాత్మకమైన రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటులో ఎలా ప్రవేశపెడతారని ప్రశ్నించారు. అనంతరం ప్రధాన రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు.
సోనియా డెరైక్షన్.. కిరణ్ యాక్షన్
కిరణ్ ఇప్పటికైనా నిజాయితీగా పనిచేసి సమైక్యాంధ్ర కోసం పాటు పడాలని మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త వెన్నా హనుమారెడ్డి గుంటూరు, నెల్లూరు జిల్లాల రైతు విభాగం కో ఆర్డినేటర్ ఉడుముల కోటిరెడ్డిలు అన్నారు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఇచ్చిన బంద్ పిలుపు మేరకు శుక్రవారం వేకువ జామున 4 గంటల నుంచి ఉదయం 6.30 గంటల వరకు మార్కాపురం డిపో వద్ద బైఠాయించారు. తెలంగాణ బిల్లు తెలివిగా ఢిల్లీకి పంపి విభజనకు మార్గాన్ని సుగమం చేసిన ముఖ్యమంత్రి పంథాను తప్పుబట్టారు. అనంతరం పోలీసులు వారిని స్టేషన్‌కు తరలించారు.
సోనియా.. హిట్లర్‌లా వ్యవహరిస్తున్నారు
కందుకూరులో వైఎస్‌ఆర్ పార్టీ కార్యాలయం నుంచి పోస్టాఫీసు సెంటర్ వరకు నాయకులు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం మానవహారం చేపట్టి సోనియాగాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లా స్టీరింగ్ సభ్యులు కొల్లూరి కొండయ్య, సయ్యద్ గౌస్‌మోహిద్దీన్, మాజీ మున్సిపల్ చైర్మన్ బూర్సు మాలకొండయ్యలు మాట్లాడుతూ రాష్ట్ర విభజన విషయంలో సోనియాగాంధీ తీరు హిట్లర్‌ను తలపిస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
తేనె తుట్టె లాంటి రాష్ట్ర విభజన అంశాన్ని లేవనెత్తి ప్రజల్లో అలజడికి కారణమైన కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని వైఎస్‌ఆర్‌సీపీ పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త గొట్టిపాటి భరత్ డిమాండ్ చేశారు. టీ-బిల్లుకు నిరసనగా పర్చూరు బొమ్మల సెంటర్ వద్ద బైఠాయించారు. కార్యకర్తలు, నాయకులతో కలిసి బంద్ చేపట్టారు. ముందుగా వైఎస్, అంబేద్కర్, రంగా విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేశారు. యర్రగొండపాలెంలో డేవిడ్ రాజు ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు.
అమావాస్య‘చంద్రుడు’
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు పోరాడని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీమాంధ్రుల పాలిట అమావాస్య చంద్రుడిలా మారాడని సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్తలు వరికూటి అమృతపాణి, అంగలకుర్తి రవిలు ఆరోపించారు. సీమాంధ్ర ఎంపీలపై జరిగిన దాడికి నిరనగా వైఎస్‌ఆర్‌సీపీ పిలుపు మేరకు సంతనూతలపాడులో బంద్ చేపట్టారు. విద్యాసంస్థలు, దుకాణాలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మూతబడ్డాయి. బైక్ ర్యాలీ నిర్వహించి బస్టాండ్ సెంటర్‌లో రాస్తారోకో చేశారు. విభజన జరిగితే అన్ని వర్గాల ప్రజలకు తిప్పలు తప్పవని హెచ్చరించారు.
తెలుగు ప్రజలంటే లెక్కలేదు
చీరాలలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు ఉదయం నుంచే ఆర్టీసీ బస్సుల రాకపోకలను నిలిపివేశారు. దుకాణాలు, పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలను మూయించారు. సమన్వయకర్త అవ్వారు ముసలయ్య, నాయకుడు యడం బాలాజీ మాట్లాడుతూ కేంద్రం దృష్టిలో తెలుగు ప్రజలంటే లెక్కలేదని మండిపడ్డారు. సోనియాగాంధీ డెరైక్షన్‌లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విభజన బిల్లుకు అండగా ఉన్నారన్నారు.
టీ బిల్లుకు నిరసనగా వైఎస్‌ఆర్‌సీపీ చేపట్టిన బంద్ విజయవంతం
Published Sat, Feb 15 2014 2:03 AM | Last Updated on Fri, Nov 9 2018 5:41 PM
Advertisement
Advertisement