ఐదో రోజుకు జగన్ దీక్ష: ఆరోగ్య పరిస్థితిపై అధికారుల గోప్యత | YS Jagan mohan reddy hunger Strike continues on fifth day | Sakshi
Sakshi News home page

ఐదో రోజుకు జగన్ దీక్ష: ఆరోగ్య పరిస్థితిపై అధికారుల గోప్యత

Published Thu, Aug 29 2013 2:03 AM | Last Updated on Wed, Aug 8 2018 5:51 PM

అడ్డగోలు విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చంచల్‌గూడ జైల్లో చేపట్టిన నిరాహార దీక్ష గురువారంతో ఐదో రోజుకు ప్రవేశించింది.

 జగన్ ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన
 అనుమానాలకు తావిస్తున్న అధికారుల తీరు
ఆరోగ్య వివరాలను గోప్యంగా ఉంచుతున్న వైనం
 నిలకడగా ఉందని, నీరసంగా ఉన్నారని భిన్న ప్రకటనలు..
వైద్య పరీక్షల ఫలితాలే వెల్లడించని తీరు
ఆస్పత్రికి తరలిస్తే భావోద్వేగాలు పెల్లుబుకుతాయేమో..  
తాత్కాలిక డీజీతో సమీక్షలో పోలీసు ఉన్నతాధికారులు
దాంతో బలపడుతున్న ‘దీక్ష భగ్నం’ అనుమానాలు
తీవ్రంగా ఆందోళన చెందుతున్న ప్రజలు, అభిమానులు

 
 సాక్షి, హైదరాబాద్: అడ్డగోలు విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చంచల్‌గూడ జైల్లో చేపట్టిన నిరాహార దీక్ష గురువారంతో ఐదో రోజుకు ప్రవేశించింది. ఒకవైపు దీక్షకు రాష్ట్రవ్యాప్తంగా నానాటికీ మద్దతు వెల్లువెత్తుతుంటే... మరోవైపు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రజల్లోనూ, అభిమానుల్లోనూ, పార్టీ కార్యకర్తల్లోనూ ఆందోళనలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. పైగా ఈ విషయంలో జైలు అధికారుల వ్యవహార శైలి కూడా పలు అనుమానాలకు తావిస్తోంది.
 
 జగన్‌కు అన్ని పరీక్షలూ జరిపించామని, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఒకసారి, నీరసంగా ఉన్నారని మరోసారి... ఇలా రకరకాలుగా చెబుతున్న వైనం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. పైగా జగన్‌కు జరిపిన పరీక్షల వివరాలను కూడా వెల్లడించకపోవడం, వారి వివరాలు రావాల్సి ఉందని, అప్పుడే ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి సమాచారం ఇవ్వగలమని చెబుతుండటం ఆందోళనను మరింతగా పెంచుతోంది. ఈ నేపథ్యంలో జైలు వద్ద కూడా బుధవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ అభిమాన నేత దీక్షకు మద్దతు తెలిపేందుకు పలు ప్రాంతాల నుంచివెల్లువెత్తిన నేతలు, అభిమానులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
 
 ఈ నేపథ్యంలో జైలు బయట నాలుగు రోజులుగా జరుగుతున్న ప్రదర్శనలు బుధవారం మరింతగా పెరిగాయి. అయితే వారినెవరినీ కనీసం జైలు పరిసరాల సమీపానికి కూడా రానీయకుండా భారీ సంఖ్యలో నిర్బంధించి పోలీస్‌స్టేషన్లకు మరిన్ని ప్రశ్నలకు తావిస్తోంది. అంతేగాక బుధవారం జైలు పరిసర ప్రాంతాల్లో భద్రతను కనీవినీ ఎరగని రీతిలో పెంచేశారు. ఎటుచూసినా ఖాకీమయంగా మార్చేశారు! మొత్తంమీద జైలు అధికారులు ఏం చేస్తున్నారో, ఏం చేయాలని భావిస్తున్నారో తెలియడం లేదు. మరోవైపు జగన్ దీక్ష నేపథ్యంలో చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌ను, ఐజీని తాత్కాలిక డీజీ సాంబశివరావు బుధవారం తన నివాసానికి పిలిపించుకున్నారు. పరిస్థితులను సమీక్షించడంతో పాటు దీక్ష, దాని పరిణామాలపై చాలాసేపు చర్చించారని తెలుస్తోంది. జైలు ఆసుపత్రిలో ఒక స్థాయి వరకే వైద్యం సాధ్యమన్న అంశం కూడా చర్చకు వచ్చిందని చెబుతున్నారు. దాంతో దీక్షను భగ్నం చేసే దిశగా పథక రచన జరుగుతోందన్న అనుమానాలు మరింతగా పెరుగుతున్నాయి.
 
 అంతేగాక మున్ముందు పలు జిల్లాల నుంచి మద్దతుదారులు జగన్ దీక్షకు సంఘీభావంగా తరలి వచ్చేలా ఉన్నారని, అదే జరిగితే పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుందని నిఘా వర్గాలు ఇచ్చిన నివేదిక కూడా పోలీసు ఉన్నతాధికారుల మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ‘దీక్ష భగ్నం చేసినా, దాన్ని జగన్ తిరిగి కొనసాగిస్తే పరిస్థితేమిటి? అప్పుడు తలెత్తే వైద్యపరమైన ఇబ్బందులను ఎలా ఎదుర్కొనాలి?’ వంటి విషయాలపై వారు దృష్టి పెట్టారంటున్నారు. ‘‘అవసరమైతే ఉస్మానియా, గాంధీ వంటి ప్రభుత్వాసుపత్రులకు జగన్‌ను తరలించాల్సి రావచ్చు. కానీ జైలు వద్ద బందోబస్తే ఇంత కష్టంగా ఉంటే, ఇక జగన్ ఆసుపత్రికి వెళ్తే రాష్ట్రవ్యాప్తంగా భావోద్వేగాలు తీవ్రంగా ఉంటాయి’ అన్న ఆందోళన కూడా భేటీలో వ్యక్తమైందని తెలుస్తోంది. ఇవన్నీ జగన్ దీక్షను భగ్నం చేస్తారనేందుకు సంకేతాలేనంటున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం చంచల్‌గూడ జైలు వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నేతలపై పోలీసులు అమానషంగా విరుచుకుపడ్డారు. జైలు సమీపానికి కూడా రానీయకుండా ఎక్కడివారిని అక్కడే అడ్డుకుని నిర్బంధించారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement