కాకర్ల వద్ద పాదయాత్రలో జన సందోహం, (ఇన్‌సెట్‌లో) నాగలి పట్టి నడుస్తున్న సుబ్బారెడ్డి
‘‘రాష్ట్రంలో ఎక్కడా లేని కరువు ప్రకాశం జిల్లాలో ఉంది. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కాకపోవడం వల్ల పశ్చిమ ప్రకాశం ఎడారిగా మారింది. ఈ కరువు తీరాలంటే అది ఒక్క వెలుగొండతోనే సాధ్యం. ప్రాజక్టు పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సుముఖంగా లేడు. రాజన్న ముద్దుబిడ్డ జగన్ ముఖ్యమంత్రి అయితే ఏడాదిలోనే ప్రాజక్టు పూర్తి చేస్తారు. దీంతో కరువు రక్కసిని జిల్లా నుంచి శాశ్వతంగా పారద్రోలుదాం.’’ అని మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రజా పాదయాత్రలో ప్రజలకు పిలుపునిచ్చారు.
కంభం, అర్థవీడు(నెల్లూరు): మూడు జిల్లాల ప్రజలకు తాగు, సాగు నీరందించే వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి తమ భూములను, గృహాలను త్యాగం చేసిన నిర్వాసితులకు న్యాయం చేస్తామని మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు. ముంపు గ్రామాల ప్రజలకు ఆర్‌ఆర్ ప్యాకేజీ అమలు చేయాల్సి ఉన్నా టీడీపీ సర్కారు పట్టించుకోవడం లేదని మండి పడ్డారు. వైఎస్సార్ సిపి అధికారంలోకి రాగానే ముందుగా నిర్వాసితులకు ఆర్‌ఆర్ ప్యాకేజి అమలు చేసి ఆ తర్వాతే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వెలిగొండ ప్రాజెక్టు సాధన కోసం ఈనెల 15న కనిగిరి నుంచి ప్రారంభమైన ప్రజాపాదయాత్ర మంగళవారం 7వ రోజు గిద్దలూరు, మార్కాపురం నియోజకవర్గాల్లో సాగింది. వైవీకి మద్దతు పలికేందుకు ఊరూ వాడా తరలి వచ్చింది.
కాకర్లతో జన జాతర..
అర్థవీడు మండలంలోని కాకర్లకు పాదయాత్రగా వచ్చిన వైవీ వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా కాకర్ల గ్యాప్ వద్ద ఏర్పాటు చేసిన వైఎస్సార్ పార్కులోని రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని గ్రహించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జిల్లాకు అత్యంత అవసరమైన, ప్రజల దాహార్తి తీర్చే, రైతులకు సాగు నీరందించేందుకు వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించారన్నారు. ఆయన అకాల మరణంతో వెలిగొండ ప్రాజెక్టు పాలకుల నిర్లక్ష్యానికి మరుగున పడిందన్నారు. జిల్లాపై టీడీపీ వివక్ష చూపుతోందని, ప్రజలపై ఇంతటి నిర్లక్ష్యం మంచిది కాదని పాలకులకు హితవు పలికారు. ముందుగా కాకర్ల రైతులు వైవీకి ప్రత్యేకంగా తయారు చేయించిన నాగళ్లతో స్వాగతం పలికారు. వాటిన భుజాలపై పెట్టుకుని పాదయాత్రలో పాల్గొన్నారు. వేలాది తరలి వచ్చిన అభిమానులతో యాత్ర పొడవునా జన జాతరను తలపించింది.
మహనీయుల పోరాట ఫలం వెలిగొండ..
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ వెలిగొండ కోసం పీవీ సుబ్బయ్య, కందుల ఓబుల్‌రెడ్డి, పిడతల రంగారెడ్డి, పూల వెంకటసుబ్బయ్య వంటి మహానుభావులు చేసిన పోరాటాలు, వారి కలలను సాకారం చేసేందుకు వైఎస్సార్ రూ.3500 కోట్లతో వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించి రూ. 3500 కోట్లు నిధులు విడుదల చేసి 70 శాతం పనులు పూర్తి చేశారన్నారు. జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే వెలిగొండ ప్రాజెక్టు పూర్తవుతుందని, వైఎస్సార్ సీపీకి అండగా నిలబడి జగన్‌ను సీఎం చేసుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున మాట్లాడుతూ జిల్లా ప్రజల సంక్షేమం కోసం వైవీ సుబ్బారెడ్డి చేస్తున్న పోరాటం హర్షనీయమన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం హోదా అవసరమని భావించిన వైవీ తన ఎంపీ పదవిని త్యాగం చేశారని గుర్తుచేశారు. ఇంతటి నాయకుడు జిల్లాలో ఉండటం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే రైతులు అభివృద్ధి చెందుతారని, పంటలు సమృద్ధిగా పండుతాయని తద్వారా దళిత, బడుగు బలహీన వర్గాలకు ఉపాధి దొరుకుతుందన్నారు.
నవరత్నాలతో సర్వతోముఖాభివృద్ధి..
వైస్సార్‌సీపీ అధినేత జగన్ పెట్టిన నవరత్నాలతోనే ప్రజలు లక్షాధికారులు అవుతారని, ప్రతి ఇంటికి ఈ పథకం వర్తిస్తుందని ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి చెప్పారు. సాయంత్రం మార్కాపురం మండలంలోకి పాదయాత్రగా ప్రవేశించిన వైవీకి పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి చేసింది ఏమి లేదని, ఎవరి కాలంలో అభివృద్ధి జరిగిందో గమినించి ఓట్లు వేయాలని ప్రజలకు సూచించారు. మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు వస్తే ఉద్యోగాలు వస్తాయని ప్రజలు అనుకున్నారని, కాని కొడుక్కు మంత్రి పదవి దక్కించుకోవడం తప్ప రాష్ట్రానికి చేసింది ఏమిలేదని గుర్తు చేశారు.
వీహెచ్‌ఆర్ సంస్థల అధినేత వెన్నా హనుమారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తు ఉండాలంటే వైస్సార్ సీపీకి ఓట్లు వేయాలని కోరారు. పాదయాత్రలో కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు పిడతల సాయికల్పనారెడ్డి, యాళ్ళూరి వెంకటరెడ్డి, నాయకులు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, ఉడుముల కోటిరెడ్డి, కేవీ రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, వరికూటి అమృతపాణి, మందటి మహేష్‌రెడ్డి, కృష్ణా జిల్లానేత జోగి రమేష్, ఒంగోలు డేవిడ్, డా.రంగారెడ్డి, యేలం వెంకటేశ్వర్లు, పిడతల అభిషేక్‌రెడ్డి, చెన్నువిజయ, పఠాన్ సుభాన్‌ఖాన్, కామూరి అమూల్య శ్రీనివాసరెడ్డి, వెంకటరాజు, లాయర్ శ్రీనివాసులరెడ్డి, పఠాన్ జఫ్రుల్లాఖాన్, బొల్లా బాలిరెడ్డి, బోయిళ్ళ జనార్దన్ రెడ్డి, చక్కెర బాలనాగిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment