ఆమెకు అందలం
Published Sun, Mar 9 2014 3:02 AM | Last Updated on Sat, Sep 2 2017 4:29 AM
అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ...జిల్లా మహిళలకు వరుస తీపి కబుర్లు అందుతున్నాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి, ఆ రంగంలో అడుగుపెట్టబోతున్నవారికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇటు మండల పరిషత్ ఎన్నికల్లో అధిక స్థానాలు రిజర్వుకాగా, మరో వైపు కేబినేట్ మంత్రి స్థాయి హోదా ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కూడా ఎస్టీ మహిళకు రిజర్వు అయింది.
జెడ్పీ పీఠంపై ఎస్టీ మహిళ
విజయనగరం ఫోర్ట్, న్యూస్‌లైన్: జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని చేపట్టాలనుకున్న నేతల అంచనాలు తలకిందులయ్యాయి. చైర్మన్ కుర్చీపై కూర్చోవాలనుకున్న వారి ఆశలకు రిజర్వేషన్లు గండికొట్టాయి. జిల్లా చరిత్రలోనే తొలిసారిగా ఎస్టీ మహిళకు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి రిజర్వు అయింది. ఈ పీఠాన్ని అధిష్టించే ఎస్టీ మహిళ ఎవరనే దానిపై జిల్లా వ్యాప్తంగా అప్పుడే చర్చ ప్రారంభమైంది. జిల్లా పరిషత్ చరిత్రలో ఠఇంతవరకు ఎస్సీకి గాని, ఎస్టీకి గాని చైర్మన్ పదవి దక్కలేదు. ఇన్నాళ్లకు ఎస్టీకి రిజర్వు అయింది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు గెలుపు అవకాశాలు ఉన్న ఎస్టీ మహిళా నేతలను వెతుకులాడే పనిలో పడ్డారు. జిల్లా పరిషత్ చైర్మన్‌లుగా బీసీ, ఓసీ వర్గాలకు చెందిన వారే ఇన్నాళ్లు వ్యవహారించారు. ఎక్కువగా వెలమ, కాపు సామాజిక వర్గాలకు చెందిన వారే ఈ పదవిని అధిష్టించారు. దశాబ్దాల తర్వాత ఎస్టీ మహిళకు రిజర్వు అయింది.
బొత్స కుటుంబీకులకు చెక్
బొత్స కుటుంబీకులు రాజకీయంగా ఎదిగేందుకు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి చేపట్టడమేనన్న విషయం జగమెరిగిన సత్యం. పదేళ్ల పాటు బొత్స కుటుంబీకులే జిల్లా పరిషత్ చైర్మన్‌లుగా కొనసాగారు. తొలుత బొత్స సతీమణి ప్రస్తుత ఎంపీ ఝాన్సీలక్ష్మి జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేశారు. ఆ తర్వాత బొబ్బిలి ఎంపీగా ఉన్న కొండపల్లి పైడితల్లినాయుడు మృతి చెందడంతో ఆ స్థానంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఎంపీగా ఝాన్సీలక్ష్మి గెలుపొందారు. దీంతో ఆమె ఖాళీ చేసిన కుర్చీని మంత్రి బంధువు బడ్డుకొండ అప్పలనాయుడు అధిరోహించారు. 2009 ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు మధ్య బడ్డుకొండ అప్పలనాయుడుకు నెల్లిమర్ల ఎమ్మెల్యే టిక్కెట్టు రావడంతో ఆ పదవి మంత్రి బంధువు జిల్లా పరిషత్ చైర్మన్ బెల్లాన చంద్రశేఖర్‌ను వరించింది. 2011 ఆగస్టు వరకు ఈయనే జిల్లా పరిషత్ చైర్మన్‌గా వ్యవహరించారు.
10 ఏళ్లు పాటు మంత్రి బంధువులే చైర్మన్‌లుగా కొనసాగడంతో జిల్లాను తమ గుప్పెట్లో పెట్టుకుని శాసించే స్థాయికి చేరుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే జిల్లా పరిషత్ వల్లే బొత్స కుటుంబీకులు, బంధువులు ఉన్నత స్థాయికి ఎదిగారు. ఈసారికూడా మంత్రి బొత్స బంధువులు జిల్లా పరిషత్ చైర్మన్ పదవిపై కన్నేశారు. కేబినేట్ మంత్రి స్థాయి హోదా జిల్లా పరిషత్ చైర్మన్‌కు ఉండడంతో ఈ పదవిపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. అయితే వారి ఆశలు ఈసారి ఆడియాశలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఎస్టీకి రిజర్వు అవ్వడం, కాంగ్రెస్ పార్టీ దయనీయ స్థితికి చేరడంతో మంత్రి బొత్సకు, ఆయన కుటుంబీకులకు ఈసారి ఎదురుగాలి తప్పదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని అధిరోహించే మహిళ ఎవరనేది త్వరలోనే తేలనుంది.
Advertisement
Advertisement