1800 మంది ఇన్ఫీ ఉద్యోగులకు భారీగా వేతనం
1800 మంది ఇన్ఫీ ఉద్యోగులకు భారీగా వేతనం
Published Thu, Jun 15 2017 3:17 PM | Last Updated on Tue, Sep 5 2017 1:42 PM
బెంగళూరు : దేశీయం రెండో టెక్ దిగ్గజంగా పేరున్న ఇన్ఫోసిస్ విదేశీ ఉద్యోగులకు భారీగా వేతనాలు చెల్లిస్తోంది. అంతర్జాతీయ కేంద్రాల్లో పనిచేస్తున్న 1800 మందికి పైగా ఉద్యోగులు కోటికి పైగా వేతనాలు ఆర్జిస్తున్నట్టు తెలిసింది. వీరిలో 150 మందిని కంపెనీ గత ఆర్థిక సంవత్సరమే నియమించుకుంది. అభివృద్ధి చెందిన మార్కెట్లలో వర్క్ ఫోర్స్ ను మరింత విస్తరిస్తున్న క్రమంలో ఈ వ్యయాల కంపెనీకి మరింత సవాళ్లు కానున్నాయని రిపోర్టులు వస్తున్నాయి.
అయితే 2017 ఆర్థికసంవత్సరంలో కేవలం 50 మంది భారతీయ ఉద్యోగులకు మాత్రమే కోటిపైగా వేతనాలు చెల్లించింది. ఈ సంఖ్య 2015 ఆర్థిక సంవత్సరంలో 113-117 మధ్యలో ఉండేది. భారత్ లో ఇన్ఫోసిస్ కు 1,51,956 మంది ఉద్యోగులున్నారు. అంతర్జాతీయంగా మాత్రం 48,400 మందే ఉన్నారు. కానీ విదేశీ ఉద్యోగులకు మాత్రమే ఇన్ఫోసిస్ ఎక్కువగా వేతనాలు ఇస్తోంది. ఇప్పటికే 1800 మందికి పైగా విదేశీ ఇన్ఫీ ఉద్యోగులు కోటీశ్వరులయ్యారు. ఏళ్ల తరబడి అనుభవం, విదేశ కరెన్సీలో వేతనాలు ఇవ్వడంతో వీరి వేతనాలు ఇంత భారీగా ఉన్నాయని తెలిసింది. 2016లో నియమించుకున్న మాదిరిగానే అంతర్జాతీయ కేంద్రాల్లో 2017లోనూ ఉద్యోగ నియామకాలు చేపట్టిందని, ఈ రెండేళ్లలో కూడా సగటు వేతనాలు స్థిరంగా ఉన్నాయని ఇన్ఫోసిస్ పేర్కొంది. ఇటీవల ప్రకటించిన అమెరికా నియామక వ్యూహాలతో ఈ పెంపు ప్రభావం ఉందని, ఇప్పటికే వీటితో మార్జిన్ గైడెన్స్ ను తగ్గించినట్టు కంపెనీ తెలిపింది.
గతనెలలోనే ఇన్ఫోసిస్ అమెరికాలో 10వేల మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్టు ప్రకటించింది. అతిపెద్ద మార్కెట్ అయిన అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత రక్షణాత్మక విధానాలు విపరీతంగా పెరగడం, మరోవైపు ఆటోమేషన్ ప్రభావంతో గ్లోబల్ గా రిక్రూట్ మెంట్లను ఇన్ఫోసిస్ పెంచుతోంది. అయితే ఒక్క ఇన్ఫోసిస్ మాత్రమే కాక ఆన్ షోర్ నియామకాల వ్యయాలను దేశీయ ఐటీ ఇండస్ట్రి మొత్తం తీవ్రంగా ఎదుర్కొంటోంది. వీసా నిబంధనలు కఠినతరమవుతుండటంతో వ్యయాలు పెరుగుతున్నాయి. అంతేకాక ట్రంప్ విధానాలతో వీసాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ స్థానికంగా ఉద్యోగ నియామకాలను పెంచుతున్నాయి.
Advertisement
Advertisement