ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలోకి చైనా వైరస్
ప్రమాదంలో కోటి ఫోన్లు.. భారత్‌లో 13 లక్షలు
న్యూఢిల్లీ: చైనా నేరగాళ్లు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లపై పడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా కోటి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలోకి హమ్మింగ్‌బ్యాడ్ మాల్‌వేర్ (హాని తలపెట్టే సాఫ్ట్‌వేర్)ను జొప్పించారు. ఇంగ్‌మాబ్ పేరుతో ఉన్న నేరగాళ్ల ముఠా ఈ పనికి పాల్పడినట్టు సైబర్ భద్రతా సంస్థ చెక్ పాయింట్ వెల్లడించింది. ఈ మాల్వేర్ ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్లను తెరవెనుక ఆపరేట్ చేస్తూ మోసపూరితంగా నెలకు రూ.2 కోట్లకుపైగా ప్రకటనల ఆదాయాన్ని గడిస్తున్నారని తెలిపింది. ఒక్కసారి ఈ మాల్వేర్ ఫోన్‌లోకి ప్రవేశిస్తే నియంత్రణ చైనా ముఠా చేతికి వెళ్లిపోతుంది. కానీ, ఆ విషయం యూజర్‌కు తెలియదు. అంతేకాదు, ఈ మాల్వేర్ అదనంగా మోసపూరిత యాప్‌లను కూడా ఇన్‌స్టాల్ చేస్తోందని చెక్‌పాయింట్ హెచ్చరించింది.
యాడ్ కంపెనీ ముసుగులో అక్రమ పనులు
నిజానికి ఇంగ్‌మాబ్ చైనాలో ఓ ప్రకటనల విశ్లేషణ కంపెనీని నిర్వహిస్తుండగా... ఇందులో 25 మంది ఉద్యోగులు మొత్తం నాలుగు విభాగాల్లో పనిచేస్తున్నారు. అయితే, దీనికి సంబంధించిన ఉద్యోగులను, టెక్నాలజీని హమ్మింగ్‌బ్యాడ్ పేరుతో హానికారక కాంపోనెంట్స్‌ను అభివృద్ధి చేసేందుకు వినియోగిస్తున్నట్టు చెక్‌పాయింట్ వెల్లడించింది. తమ నియంత్రణలోకి వచ్చిన స్మార్ట్‌ఫోన్ల ద్వారా వ్యాపార, ప్రభుత్వ ఏజెన్సీలపై చైనా గ్యాంగ్ దాడులకు పాల్పడుతోందని, ఇతర నేరగాళ్లకు సైతం ఈ అనుసంధానాన్ని బ్లాక్ మార్కెట్లో అడ్డంగా విక్రయిస్తోందని చెక్‌పాయింట్ సంస్థ వెల్లడించింది.
ఇంగ్‌మాబ్ నియంత్రణలోకి వెళ్లిన కోటి ఫోన్లలో డేటా ప్రమాదంలో పడినట్టేనని పేర్కొంది. ఈ మాల్వేర్ బారిన పడిన కోటిఫోన్లలో చైనాలో 16 లక్షలు, భారత్‌లో 13.5 లక్షలు, ఫిలిప్పీన్స్‌లో 5.20లక్షలు, మిగిలినవి అమెరికా, పాకిస్తాన్, ఉక్రెయిన్, రొమేనియా, అల్జీరియా దేశాల్లో ఉన్నాయి. ఈ గ్రూపు చేతుల్లోకి వెళ్లిన ఫోన్లలో 50% కిట్‌క్యాట వెర్షన్‌తో నడిచేవి కాగా, 40 శాతం జెల్లీబీన్ వెర్షన్‌తో ఉన్నవి. ఒక్క శాతం మాత్రమే తాజా వెర్షన్ మార్ష్‌మాలో వినియోగిస్తున్నవి. కోటి మంది మొబైల్ యూజర్లలో 85 మంది ఇప్పటికే గ్రూప్‌నకు చెందిన హానికారక యాప్స్‌ను కూడా డౌన్‌లోడు చేసుకున్నారు.