
ఆర్థిక వ్యవస్థకు‘నోటు’పాట్లు!
దేశంలో పెద్ద నోట్ల రద్దు వ్యవహారం దేశ ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలికంగా ప్రయోజనం చేకూర్చే సంగతి ఎలా ఉన్నా, తక్షణం మాత్రం దీనివల్ల ప్రతికూలతలే ...
పెద్ద నోట్ల రద్దుపై వివిధ సంస్థల నివేదికలు
• బ్యాంకుల రుణ వితరణ రూ.61,000 కోట్లు డౌన్: ఆర్‌బీఐ
• వృద్ధి అంచనాలకు ఏడీబీ కోత...
• బ్యాంక్ ఆఫ్ అమెరికాదీ అదే అభిప్రాయం
• రాష్ట్రాల ఆదాయాలు తగ్గుతాయంటున్న ఇక్రా
న్యూఢిల్లీ: దేశంలో పెద్ద నోట్ల రద్దు వ్యవహారం దేశ ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలికంగా ప్రయోజనం చేకూర్చే సంగతి ఎలా ఉన్నా, తక్షణం మాత్రం దీనివల్ల ప్రతికూలతలే ఎదురవుతున్నట్లు తాజాగా వివిధ సంస్థలు ఇచ్చిన నివేదికలు వెల్లడిస్తున్నాయి. నవంబర్ 8న రూ.500, రూ.1,000 నోట్ల రద్దు తరువాత పక్షం రోజుల్లో అంటే నవంబర్ 25నాటికి బ్యాంకుల నుంచి రూ.61,000 కోట్ల మేర రుణ వితరణ (0.8 శాతం) పడిపోయినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తాజా గణాంకాలు పేర్కొన్నాయి. అలాగే కేంద్రం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల వినియోగం తగ్గి, వివిధ రాష్ట్రాల ఆదాయాలు పడిపోతాయని రేటింగ్ సంస్థ ఇక్రా పేర్కొనగా, భారత్ వృద్ధి రేటు అంచనాలకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ), అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ– బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిలించ్ కోత పెట్టాయి. వివరాలు....
రుణ వృద్ధి 6.6 శాతానికి పరిమితం: ఆర్‌బీఐ
నవంబర్ 25వ తేదీనాటికి బ్యాంకుల మొత్తం రుణపరిమాణం కేవలం 6.6 శాతం వృద్ధిచెంది రూ.72.92 లక్షల కోట్లుగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ రుణ వృద్ధి రేటు 9.3 శాతంగా ఉంది. నవంబర్ 11తో ముగిసిన పక్షంలో సైతం బ్యాంకింగ్ రుణ వితరణ రూ.59,000 కోట్లు తగ్గింది. అంటే నోట్ల రద్దు జరగ్గానే రుణ వితరణపై ప్రభావం చూపినట్లు ఈ డేటా వెల్లడిస్తుంది. ఆ తర్వాత పక్షం రోజుల్లో ఈ వితరణ మరింత పడిపోయింది. సానుకూలత అంశాన్ని చూస్తే... కొన్ని డిఫాల్ట్ అకౌంట్లను కూడా కలుపుకొని రుణ గ్రహీతలు దాదాపు రూ.66,000 కోట్ల పునఃచెల్లింపులు ఈ పక్షంలో జరిపారు. ఇక నవంబర్ 25తో ముగిసిన పక్షం రోజుల్లో డిపాజిట్ల వృద్ధీ భారీగా పెరిగింది. రద్దయిన నోట్లను ప్రజలు డిపాజిట్ చేయాల్సిరావడంతో ఈ వృద్ధి సాధ్యపడింది.
వృద్ధి 7 శాతమే: ఏడీబీ
పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 7 శాతంగానే ఉంటుందని ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) పేర్కొంది. ఇంతక్రితం ఈ అంచనా 7.4 శాతంగా ఉంది. ఆసియన్ డెవలప్‌మెంట్ అవుట్‌లుక్‌లో ఈ అంశాలను వివరిస్తూ ఆర్థిక వ్యవస్థపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం స్వల్పకాలమేననీ వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధి 7.8 శాతానికి చేరుతుందనీ వివరించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాను 7.6 శాతం నుంచి 7.1 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే.
ఉత్పత్తిపై ప్రతికూలత: బీఓఎఫ్‌ఏ
నవంబర్– డిసెంబర్ నెలల్లో డిమాండ్, ఉత్పత్తిపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం తీవ్రంగా ఉంటుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిలించ్ (బీఓఎఫ్‌ఏ–ఎంఎల్) తన తాజా విశ్లేషణా పత్రంలో పేర్కొంది. ఈ ప్రభావం వల్ల మూడవ త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) వృద్ధి రేటు కేవలం 5.5 నుంచి 6 శాతం శ్రేణిలోనే నమోదవుతుందని విశ్లేషించింది. ప్రత్యేకించి నవంబర్–డిసెంబర్ నెలల్లో వృద్ధి 0.3 శాతం నుంచి 0.5 శాతం మేర ప్రభావం చూపే వీలుందని పేర్కొంది. కాగా ఫిబ్రవరి 8 పాలసీ సందర్భంగా ఆర్‌బీఐ పావుశాతం రెపో కోత ఉంటుందని అంచనావేసింది.
రాష్ట్రాల ఆదాయాలకు గండి: ఇక్రా
నోట్ల రద్దు వినియోగంపై ప్రతికూలత చూపనుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జయంత రాయ్ పేర్కొన్నారు. రియల్టీసహా వాణిజ్యం, రిటైల్(లిక్కర్ సహా), రవాణా, టూరిజం, రత్నాలు–ఆభరణాల వంటి రంగాలు ఇబ్బందులను ఎదుర్కొనాల్సి రావచ్చని అన్నారు. ఇది రాష్ట్రాల బడ్జెట్ ఆదాయ అంచనాలను తగ్గిస్తుందని విశ్లేషించారు. ఈ నేపథ్యంలో ద్రవ్యలోటును తగ్గించుకోడానికి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యయాలను తగ్గించుకుంటాయనీ. ఆర్‌బీఐ నుంచి స్పెషల్ డ్రాయింగ్ సౌలభ్యతను పొందే వీలుందనీ అభిప్రాయపడ్డారు.