
‘సేవల’ జోరుతో లాభాలు
సేవల రంగం కార్యకలాపాలు గత నెలలో పెరగడంతో బుధవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది
♦ 151 పాయింట్ల లాభంతో 28,223కు సెన్సెక్స్
♦ 51 పాయింట్ల లాభంతో 8,568కు నిఫ్టీ
సేవల రంగం కార్యకలాపాలు గత నెలలో పెరగడంతో బుధవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. దీనికి సానుకూల అంతర్జాతీయ సంకేతాలు తోడవడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 151 పాయింట్ల లాభంతో 28,223 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 51పాయింట్ల లాభంతో 8,568 పాయింట్ల వద్ద ముగిశాయి. కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చాయి. ఐటీ, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, వాహన షేర్లు లాభపడ్డాయి. రియల్టీ షేర్లు రికవరీ బాట పట్టాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ త్వరలోనే వడ్డీరేట్లను పెంచుతుందన్న వార్తలతో డాలర్ బలపడింది. దీనికి అంచనాలను మించిన కాగ్నిజంట్ ఆర్థిక ఫలితాలు తోడవడంతో ఐటీ షేర్లు పెరిగాయి.
వరుసగా రెండు నెలలుగా క్షీణిస్తూ వస్తోన్న సేవల రంగం జూలైలో వృద్ధి బాట పట్టిందని నికాయ్ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ వెల్లడించింది. ఇది స్టాక్‌మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపించింది.
ఐటీ షేర్లు రయ్..
కాగ్నిజంట్ ఏప్రిల్-జూన్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడం, పూర్తి ఏడాదికి భవిష్యత్ ఆర్జన అంచనాలను పెంచడం, డాలర్ బలపడడం వంటి కారణాల వల్ల ఐటీ షేర్లు లాభపడ్డాయి. మ్యాగీ నూడుల్స్ సురక్షిత ప్రమాణాలకనుగుణంగానే ఉన్నాయని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆమోదిత గోవా, మైసూర్ ల్యాబొరేటరీలు వెల్లడించాయన్న వార్తలతో నెస్లే ఇండియా దాదాపు 8 శాతం ఎగసింది. అయితే తాము నెస్లే మ్యాగీకి ఎలాంటి క్లీన్‌చిట్ ఇవ్వలేదని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఐ ఆ తర్వాత వెల్లడించింది. ఫాక్స్‌కాన్‌తో జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయనున్నదన్న వార్తలతో అదాని ఎంటర్‌ప్రైజెస్ ఎగసింది.
30లో 20 షేర్లకు లాభాలే...
30 సెన్సెక్స్ షేర్లలో 20 షేర్లు లాభాల్లోనే ముగిశాయి. 1,803 షేర్లు లాభాల్లో, 1.152 షేర్లు నష్టాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.4,501 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో రూ.20,417 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.1,57,966 కోట్లుగా నమోదైంది.