జీఎస్‌టీ నెట్‌వర్క్ బిడ్డింగ్ రేసులో 5 సంస్థలు
బరిలో మైక్రోసాఫ్ట్, ఇన్ఫీ
♦ వచ్చే నెల బిడ్డరు ఎంపిక
♦ జీఎస్‌టీఎన్ చైర్మన్ నవీన్‌కుమార్ వెల్లడి
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా వస్తు, సేవల పన్నుల విధానం అమలుకు అవసరమైన నెట్‌వర్క్‌ను (జీఎస్‌టీఎన్) ఏర్పాటు చేసే విషయంలో అయిదు ఐటీ కంపెనీల నుంచి బిడ్లు వచ్చినట్లు జీఎస్‌టీ నెట్‌వర్క్ చైర్మన్ నవీన్‌కుమార్ తెలిపారు. మైక్రోసాఫ్ట్, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్‌మహీంద్రా ఇందులో ఉన్నాయని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు. వచ్చే నెల ఆఖరు నాటికి తుది బిడ్డరును ఎంపిక చేస్తామని కుమార్ తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి కేంద్ర ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్, ఇతరత్రా స్థానిక పన్నుల స్థానంలో జీఎస్‌టీని అమలు చేసేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
కేంద్రం, రాష్ట్రాల వద్ద ఉన్న డేటాబేస్‌లను అనుసంధానించేందుకు అవసరమైన వ్యవస్థను రూపొందించేందుకు జీఎస్‌టీఎన్‌ను ఏర్పాటు చేసింది. నెట్‌వర్క్ ఏర్పాటు చేయగలిగే కంపెనీల నుంచి ఏప్రిల్‌లో బిడ్లు ఆహ్వానించింది. జూలై 6తో బిడ్ల దాఖలుకు గడువు ముగిసింది. నెట్‌వర్క్ టెస్టింగ్ కోసం కనీసం రెండు నెలల వ్యవధి లభించే విధంగా.. జీఎస్‌టీఎన్‌లో రిజిస్ట్రేషన్ జనవరి 31 నాటికల్లా ప్రారంభం కాగలదని నవీన్ కుమార్ తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్, బిహార్ తదితర 13 రాష్ట్రాలు బ్యాక్‌ఎండ్ ఐటీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని జీఎస్‌టీఎన్‌ను కోరాయని, 17 రాష్ట్రాలు తమ సొంత నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుంటున్నాయని ఆయన చెప్పారు. కొత్త ట్రేడర్లు రిజిస్టరు చేయించుకోవాల్సి వస్తుందని, వ్యాట్.. సర్వీస్ ట్యాక్స్ మొదలైన గణాంకాల ఆధారంగా పాత ట్రేడర్లను అప్‌డేట్ చేయడం జరుగుతుందన్నారు. దేశవ్యాప్తంగా ప్రతి ట్రేడరుకూ ఒక విశిష్ట గుర్తింపు నంబరు వంటిది ఉంటుందని కుమార్ తెలిపారు.