అమెరికాలో ఐదుగురు ‘భారతీయ’ సంపన్నులు
ఫోర్బ్స్ టాప్-400 జాబితాలో చోటు
న్యూయార్క్: అమెరికాలోని సంపన్నుల్లో భారత సంతతికి చెందిన ఐదుగురికి చోటు లభించింది. ఫోర్బ్స్ సంస్థ అమెరికా వ్యాప్తంగా మొదటి 400 మంది సంపన్నులతో ఈ ఏడాదికి గాను ‘రిచెస్ట్ పీపుల్ ఇన్ అమెరికా - 2016’ పేరుతో ఓ జాబి తాను రూపొందించి విడుదల చేసింది. మొదటి స్థానాన్ని మైక్రోసాఫ్ట్ సంస్థ అధినేత బిల్‌గేట్స్ సొంతం చేసుకున్నారు. ఆయన నెట్‌వర్త్ 81 బిలియన్ డాలర్లు. బిల్‌గేట్స్ మొదటి స్థానాన్ని నిలబెట్టుకోవడం వరుసగా ఇది 23వ సంవత్సరం.
జాబితాలో భారత సంతతి వారు వీరే
సింఫనీ టెక్నాలజీ కంపెనీ వ్యవస్థాపకుడు రొమేష్ వాద్వానీ (69) మూడు బిలియన్ డాలర్ల (రూ.20,100 కోట్లు) నెట్‌వర్త్‌తో జాబితాలో 222వ స్థానంలో నిలిచారు. ఐఐటీ ముంబై, కార్నెగీ మెలన్ యూనివర్సిటీల్లో చదివిన వాద్వానీ భారత్‌లో కొత్త కంపెనీల ఏర్పాటుకు బిలియన్ డాలర్ల నిధుల సాయం అందించనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.
సింటెల్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు నీర్జా దేశాయ్ (64) ఈ జాబితాలో 274వ స్థానంలో ఉన్నారు. నెట్‌వర్త్ 2.5 బిలియన్ డాలర్లు(రూ.16,750 కోట్లు). 1980లో మిచిగాన్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో సింటెల్ కంపెనీని స్థాపించిన దేశాయ్ నేడు 950 మిలియన్ డాలర్ల ఆదాయంతో ప్రపంచ వ్యాప్తంగా 24వేల మందికి ఉపాధి కల్పిస్తున్నట్టు ఫోర్బ్స్ ప్రశంసించింది. రాకేష్ గంగ్వాల్(63) 2.2 బిలియన డాలర్ల (రూ.14,740 కోట్లు) నెట్‌వర్త్‌తో 321వ స్థానంలో ఉన్నారు. ఐఐటీ పూర్వ విద్యార్థి అయిన గంగ్వాల్ దేశంలో బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్ సహ వ్యవస్థాపకుడు.
వ్యాపారవేత్త జాన్ కపూర్(73) జాబితో 335వ స్థానంలో నిలవగా ఆయన నెట్‌వర్త్ 2.1 బిలియన్ డాలర్లు(రూ.14,070 కోట్లు). అకోర్న్, ఇన్సిస్ టెక్నాలజీస్ అనే ఔషధ కంపెనీలకు చైర్మన్‌గా ఉన్నారు. సిలికాన్ వ్యాలీ ఏంజెల్ ఇన్వెస్టర్ కవితార్క్ రామ్ శ్రీరామ్(9) 1.9 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్ (రూ.12,730 కోట్లు)తో 361 స్థానాన్ని దక్కించుకున్నారు.