బీజింగ్: అమెరికా ఆధారిత మోస్ట్ పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. తాజా నివేదికల ప్రకారం ఆన్‌లైన్ మెసేజ్ సర్వీస్‌లపై కఠిన చట్టాల నేపథ్యంలో.. చైనాలో వాట్సాప్ సేవలను బ్లాక్ చేసింది. గత కొన్ని నెలలుగా పాక్షికంగా (ఫోటోలు, వీడియోలు) సేవలపై ఆంక్షలను విధించిన ప్రభుత్వం తాజాగా టెక్ట్స్ మెసేజ్‌లను కూడా పూర్తిగా బ్లాక్ చేసింది. సెన్సార్షిప్, నిఘా, ట్రాఫిక్ మానిప్యులేషన్‌ను గుర్తించే ఒక అంతర్జాతీయ పరిశీలనా నెట్‌వర్క్ ఓపెన్ అబ్జర్వేటరీ ఆఫ్ నెట్వర్క్ ఇంటర్ఫెరెన్స్ (OONI) ఈ విషయాన్ని వెల్లడించింది. సెప్టెంబరు 23 నుంచి వాట్సాప్ యాక్సెస్‌ను తిరస్కరించడం ప్రారంభించిందని సోమవారం రాత్రి సూచించింది.
ట్విట్టర్ లో కూడా ఈమేరకు పబ్లిక్ నివేదికలు అందుతున్నాయి. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ యాజమాన్యంలోని వాట్సాప్ సెప్టెంబరు 19 నుంచే అందుబాటులో లేదని ట్విట్టర్‌లో ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే తాజా పరిణామాలపై వాట్సాప్‌పై ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రభుత్వం ఇంటర్నెట్ కమ్యూనికేషన్లను పర్యవేక్షించాలని కోరుకుంటోందని ఎనలిస్టులు చెబుతున్నారు.
కాగా గత కొన్ని నెలల్లో, చైనాలో అనేక వాట్సాప్‌కు అనేక అంతరాయాలు తరచూ ఏర్పడుతున్నాయి. అలాగే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ , గూగుల్ లాంటి అనేక ఇంటర్నెట్ కంపెనీలకు యాక్సెస్‌ను ఇప్పటికే బ్లాక్ చేసింది. అయితే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్లు (VPN) ,లేదా సెక్యూర్డ్ సంస్థల ద్వారా ఈ సేవలను పొందుతున్నారు. ఇటీవల ఈ వీపీఎన్ సేవలపై కూడా చైనా ఆంక్షలు విధిస్తోంది. ర్యాండ్ కార్పోరేషన్ ఇంటర్నేషనల్ డిఫెన్స్ రీసెర్చ్ విశ్లేషకుడు , సీనియర్ టిమోథీ హీత్ ప్రకారం, వాట్స్అప్ బలమైన ఎన్క్రిప్షన్ (సెన్సార్‌షిప్‌ను తప్పించుకునేందుకు ఇంటర్నెట్ ట్రాఫిక్‌ను దాచిపెట్టే) ను ఉపయోగించడం చైనా ప్రభుత్వానికి ఇష్టం లేదు. అలాగే చైనాలోని పాపులర్ మెసేజింగ్ యాప్ వి చాట్ తమ విధానాలు ప్రభుత్వం నిబంధనలకు లోబడి ఉంటాయని యూజర్లకు జారీ చేసిన ఒక నోటిఫికేషన్‌లో వెల్లడించింది.