ఇక యాక్ట్ ఫైబర్ వైఫై జోన్లు | ACT Fibernet eyeing national broadband pie | Sakshi
Sakshi News home page

ఇక యాక్ట్ ఫైబర్ వైఫై జోన్లు

Published Tue, Feb 17 2015 2:41 AM | Last Updated on Sat, Sep 2 2017 9:26 PM

ఇక యాక్ట్ ఫైబర్ వైఫై జోన్లు

ఇక యాక్ట్ ఫైబర్ వైఫై జోన్లు

డిసెంబర్‌కల్లా హైదరాబాద్ అంతటా
- ఏప్రిల్ నుంచి వైజాగ్‌లో ఇంటర్నెట్ సేవలు
- 3-5 ఏళ్లలో మరో రూ. 2,000 కోట్ల పెట్టుబడి
- ఇక నుంచి యాక్ట్ ఫైబర్‌నెట్‌గా పేరు: బీమ్ టెలీ

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బీమ్ టెలీ పేరిట బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్‌నెట్ సేవలందిస్తున్న బీమ్ ఫైబర్ పేరు మారింది. యాక్ట్ ఫైబర్‌నెట్‌గా పేరు మార్చుకున్న ఈ సంస్థ... వైఫై జోన్లను ఏర్పాటు చేస్తోంది. పైలట్ ప్రాజెక్టు కింద హైదరాబాద్ ఇనార్బిట్ మాల్‌లో తొలిసారిగా వైఫై జోన్‌ను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం అనుమతిస్తే డిసెంబర్‌కల్లా హైదరాబాద్‌లో ఈ జోన్లను అందుబాటులోకి తేనుంది.

వినియోగదార్లకు ఎలాంటి ఆటంకం లేకుండా ఈ జోన్ల ద్వారా నాణ్యమైన ఇంటర్నెట్‌ను అందిస్తామని యాక్ట్ (అట్రియా కన్వర్జెన్స్ టెక్నాలజీస్) ఎండీ సి.ఎస్.సుందర్ రాజు చెప్పారు. అత్యాధునిక టెక్నాలజీ వినియోగిస్తామని, తమ సేవలతో దేశంలో సంచలనం సృష్టిస్తామని తెలిపారు. సోమవారమిక్కడ సంస్థ సీఈఓ బాల మల్లాది, ఇండియా వా ల్యూ ఫండ్ పార్ట్‌నర్ ప్రమోద్ కోబ్రతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. టెక్నాలజీపై భారీగా వెచ్చిస్తున్నామని, దేశంలో అత్యంత వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్‌ను అందిస్తున్నామని తెలియజేశారు.
 
ఏటా ఒక నగరం..
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న బీమ్‌ను బెంగళూరు కంపెనీ యాక్ట్ గ్రూప్ ప్రమోట్ చేస్తోంది. యాక్ట్‌లో మెజారిటీ వాటా ఇండియా వాల్యూ ఫండ్‌కు (ఐవీఎఫ్) ఉంది. బెంగళూరు, చెన్నై, విజయవాడ, నెల్లూరు, ఏలూరులో యాక్ట్ పేరుతో, హైదరాబాద్‌లో బీమ్ బ్రాండ్‌తో బ్రాడ్‌బ్యాండ్ రంగంలో ఉంది. ఇక నుంచి దేశవ్యాప్తంగా యాక్ట్ ఫైబర్‌నెట్‌గా సేవలందించనుంది. ఏప్రిల్‌లో వైజాగ్‌లో ప్రవేశించటంతో పాటు సంస్థ ఏటా ఒక ప్రధాన నగరంలో అడుగు పెట్టనున్నట్లు గ్రూప్ సీఈవో బాల మల్లాది చెప్పారు.

ఇప్పటికే రూ.1,000 కోట్లు వ్యయం చేశామని, 3-5 ఏళ్లలో రూ.2,000 కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పారు. మూడేళ్లుగా పరిశ్రమ వృద్ధి 3 శాతమైతే, యాక్ట్ 43 శాతం వృద్ధి నమోదు చేసిందని ప్రమోద్ కోబ్ర తెలిపారు. దక్షిణాదికే బ్రాండ్ పరిమితమైనప్పటికీ, వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్‌లో భారత్‌లో బీఎస్‌ఎన్‌ఎల్, భారతి ఎయిర్‌టెల్, ఎంటీఎన్‌ఎల్ తర్వాతి స్థానం యాక్ట్‌దేనని ఆయన చెప్పారు.
 
100 ఎంబీపీఎస్ స్పీడ్..
రిటైల్ కస్టమర్ల కోసం ఇన్‌క్రెడిబుల్ 100 ఎంబీపీఎస్ స్పీడ్ ప్యాక్‌ను యాక్ట్ ఫైబర్‌నెట్ ప్రకటించింది. నెలవారీ చార్జీ రూ.2,799తో 200 జీబీ డేటా ఉచితంగా అందిస్తారు. అలాగే కంపెనీల కోసం 1 టీబీ డేటా లిమిట్‌తో 250 ఎంబీపీఎస్ స్పీడ్ ప్యాక్‌ను ప్రవేశపెట్టింది. నెలవారీ చార్జీ రూ.4 వేల నుంచి ప్రారంభమవుతుంది. ఈ స్పీడ్‌తో ప్యాక్‌లు రావడం భారత్‌లో తొలిసారి. కాగా, యాక్ట్ గ్రూప్‌కు 6.5 లక్షల బ్రాడ్‌బ్యాండ్ కనెక్షనుండగా వీటిలో హెదరాబాద్‌లో 4.5 లక్షలున్నాయి. నెలకు 20 వేల కొత్త కనెక్షన్లు వస్తున్నాయి. కనెక్షన్లను ఈ ఏడాదిలో 10 లక్షలకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement