ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకుల్లో...సగం శాఖలు మూత | After associate banks, now Bharatiya Mahila Bank to also merge with SBI | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకుల్లో...సగం శాఖలు మూత

Published Wed, Mar 22 2017 12:39 AM | Last Updated on Wed, Apr 3 2019 4:53 PM

ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకుల్లో...సగం శాఖలు మూత - Sakshi

ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకుల్లో...సగం శాఖలు మూత

మూడు బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు కూడా
విలీనమయ్యే అనుబంధ బ్యాంకులపై స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిర్ణయం
ఏప్రిల్‌ 24 నుంచి ప్రక్రియ ప్రారంభం


న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐలో విలీనం అనంతరం అనుబంధ బ్యాంకుల్లో సుమారు 47 శాతం శాఖలు మూతబడనున్నాయి. అలాగే మూడు బ్యాంకుల ప్రధాన కార్యాలయాలను కూడా మూసివేయాలని ఎస్‌బీఐ నిర్ణయించింది. ఏప్రిల్‌ 24 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. ‘అనుబంధ బ్యాంకులకు సంబంధించి అయిదు ప్రధాన కార్యాలయాల్లో రెండు మాత్రమే కొనసాగుతాయి.  మిగతా మూడు అనుబంధ బ్యాంకుల ప్రధాన కార్యాలయాలతో పాటు 27 జోనల్‌ ఆఫీసులు, 81 ప్రాంతీయ కార్యాలయాలు, 11 నెట్‌వర్క్‌ ఆఫీసులను మూసివేయడం జరుగుతుంది. ఏప్రిల్‌ 24 దాకా మాత్రమే ప్రస్తుత వ్యవస్థ కొనసాగుతుంది‘ అని ఎస్‌బీఐ ఎండీ దినేశ్‌ కుమార్‌ ఖరా తెలిపారు.

దీని వల్ల ఒకే చోట తమ గ్రూప్‌ బ్యాంకుల శాఖలు అనేకం ఉండకుండా చూసుకోవడానికి వీలవుతుందని ఆయన వివరించారు. ఏప్రిల్‌ ఒకటి తర్వాత నుంచి అయిదు అనుబంధ బ్యాంకులు చట్టబద్ధంగా రద్దైపోయినా.. విలీన ప్రక్రియ మాత్రం ఆడిటింగ్‌ మొదలైనవి పూర్తయ్యాక ఏప్రిల్‌ 24 తర్వాత ప్రారంభమవుతుందని దినేశ్‌ కుమార్‌ చెప్పారు. ‘విలీన తేదీకన్నా ఒక రోజు ముందు.. అంటే మార్చ్‌ 31న అనుబంధ బ్యాంకుల బ్యాలెన్స్‌ షీట్స్‌ ఆడిట్‌ చేయాల్సి ఉంటుంది. ఆ లెక్కలన్నీ పూర్తవడానికి 15–20 రోజులు పడుతుంది. ఆడిట్‌ పూర్తయిన తర్వాత శాఖలన్నీ కూడా ఎస్‌బీఐలో పూర్తిగా విలీనం అవుతాయి‘  అని ఆయన వివరించారు. డేటా అనుసంధానం మొదలైనవి మే ఆఖరు నాటికి పూర్తి కాగలవని పేర్కొన్నారు. మొత్తం మీద విలీనం సంబంధిత ప్రక్రియలన్నీ ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని బ్యాంకు నిర్దేశించుకున్నట్లు వివరించారు.

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ (ఎస్‌బీహెచ్‌) అయిదు అనుబంధ బ్యాంకులు.. సహా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బికానెర్‌ అండ్‌ జైపూర్‌ (ఎస్‌బీబీజే), స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ మైసూర్‌ (ఎస్‌బీఎం), స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ట్రావెన్‌కోర్‌ (ఎస్‌బీటీ), స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పాటియాలా (ఎస్‌బీపీ) ఏప్రిల్‌ 1న ఎస్‌బీఐలో విలీనం కానున్న సంగతి తెలిసిందే. 2008లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ సౌరాష్ట్ర,  2010లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండోర్‌ .. ఎస్‌బీఐలో విలీనమయ్యాయి. ఇటీవలే భారతీయ మహిళా బ్యాంక్‌ విలీన ప్రతిపాదనకు కూడా ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.

టాప్‌ 50లో ఒకటిగా ఎస్‌బీఐ..
దాదాపు రూ. 30.72 లక్షల కోట్ల అసెట్స్‌తో ఎస్‌బీఐ దేశంలోనే అతి పెద్ద బ్యాంకుగా ఉంది. అంతర్జాతీయంగా బ్యాంకుల జాబితాలో 64వ స్థానంలో (2015 డిసెంబర్‌ నాటి గణాంకాల ప్రకారం) ఉంది. అనుబంధ బ్యాంకుల విలీనం అనంతరం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అసెట్స్‌ దాదాపు రూ. 40 లక్షల కోట్లకు పెరగనున్నాయి. తద్వారా ప్రపంచంలోనే టాప్‌ 50 బ్యాంకుల్లో చోటు దక్కించుకోనున్నట్లు, 45వ స్థానంలో నిలవనున్నట్లు ఎస్‌బీఐ చీఫ్‌ ఎకానమిస్ట్‌ సౌమ్య కాంతి ఘోష్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం ఎస్‌బీఐకి 550 కార్యాలయాలు ఉండగా, అనుబంధ బ్యాంకులకు 259 ఉన్నాయి. విలీనం అనంతరం మొత్తం కార్యాలయాల సంఖ్యను 687కి పరిమితం చేయాలని.. (122 ఆఫీస్‌ల తగ్గింపు) ఎస్‌బీఐ లక్ష్యంగా పెట్టుకుంది.

కార్యాలయాల మూసివేత వల్ల ప్రభావితమయ్యే 1,107 మంది ఉద్యోగులను ఇతర విభాగాల్లోకి.. ప్రధానంగా కస్టమర్‌ ఇంటర్‌ఫేస్‌ ఆపరేషన్స్‌లోకి బదలాయించనున్నట్లు దినేశ్‌ కుమార్‌ తెలిపారు. ప్రస్తుతం ప్రతి ప్రాంతీయ కార్యాలయంలో 5–7 మంది, జోనల్‌ ఆఫీస్‌ల్లో సుమారు 20 మంది చొప్పున ఉద్యోగులు ఉన్నట్లు ఆయన చెప్పారు. ఒక్కో ప్రాంతీయ కార్యాలయం 30–40 శాఖలను పర్యవేక్షిస్తుండగా, 4–5 ప్రాంతీయ కార్యాలయాలు ఒక జోనల్‌ ఆఫీస్‌ పర్యవేక్షణలో ఉంటున్నాయని దినేశ్‌ కుమార్‌ తెలిపారు. వేరే విభాగాల్లోకి మారడానికి ఇష్టపడని ఉద్యోగులకు అనుబంధ బ్యాంకులు స్వచ్ఛంద పదవీ విరమణ స్కీమ్‌ (వీఆర్‌ఎస్‌) ఆప్షన్‌ కూడా ఇస్తున్నాయి.  

బీఎంబీ విలీనం కూడా ఏప్రిల్‌ 1నే  
న్యూఢిల్లీ: భారతీయ మహిళా బ్యాంకు (బీఎంబీ) సైతం ఏప్రిల్‌ 1 నుంచే ఎస్‌బీఐలో విలీనం అవుతోంది. ఎస్‌బీఐలో ఐదు అనుబంధ బ్యాంకులు కూడా ఇదే తేదీ నుంచి విలీనం అయిపోతున్న విషయం తెలిసిందే. బీఎంబీ విలీనం ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం మంగళవారం గజిట్‌ నోటిఫికేషన్‌లో పేర్కొంది. తాజా ఆదేశాల నేపథ్యంలో ఎస్‌బీఐ ఈ నెల 24న సెంట్రల్‌ బోర్డు ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఆమోదం తీసుకోనుంది. బీఎంబీకి దేశవ్యాప్తంగా 103 శాఖలు ఉన్నాయి. వ్యాపారం రూ.1,600 కోట్లుగా ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement