గృహ రుణాలపై తగ్గేది తక్కువే..!
• ఎంసీఎల్‌ఆర్‌ను తగ్గించి.. స్ప్రెడ్‌ను పెంచిన బ్యాంకులు
• దీంతో రుణాలపై తగ్గే వడ్డీ అరకొరే
సాక్షి, బిజినెస్ విభాగం
గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గిస్తున్నట్లు ప్రధాన బ్యాంకులైన ఎస్‌బీఐ, ఐసీఐసీఐ ప్రకటించాయి. ఇం దుకు అనుగుణంగా ఎంసీఎల్‌ఆర్‌ను (మార్చినల్ కాస్ట్ ఆఫ్ పండింగ్ రేటు) 0.9% తగ్గిస్తున్నట్లు ఎస్‌బీఐ... 0.7% తగ్గిస్తున్నట్లు ఐసీఐసీఐ ప్రకటించాయి. మరి ఆ మేరకు వడ్డీ రేట్లు తగ్గాయా అంటే... అలాంటిదేమీ లేదు. వాస్తవంగా గృహ రుణంపడ్డీ రెండు బ్యాంకులూ తగ్గిస్తున్న వడ్డీ రేటు 0.5 శాతమే!!. అదీ కథ.
లాభాలు పెంచుకోవడానికే...
ఆర్‌బీఐ రేట్లు తగ్గిస్తే... ఆ తగ్గుదలను వినియోగదారులకు పూర్తిగా బదిలీ చేయకుండా, ఎన్‌పీఏలు పెరిగాయని, తమ నిధుల వ్యయం ఎక్కువని కుంటిసాకులు చెపుతూ వచ్చిన బ్యాంకులు తాజాగా మరో నాటకానికి తెరలేపాయి. ఆర్‌బీఐ రేట్ల తగ్గుదలను, నిధుల వ్యయం తగ్గుదలను బ్యాంకులు పూర్తిగా బదిలీ చేయటానికి మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్‌ఆర్) విధానాన్ని 2016 ఏప్రిల్ నుంచి ప్రవేశపెట్టింది. ఈ విధానం ప్రకారం బ్యాంకులకయ్యే నిధుల సమీకరణ వ్యయంతో కొంత స్ప్రెడ్ (లాభం) కలుపుకొని రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయించాలి. ఇందుకు అనుగుణంగా వివిధ బ్యాంకులు గృహ రుణాలపై వాటి ఎంసీఎల్‌ఆర్‌పై 0.25–0.60 శాతం స్ప్రెడ్ కలుపుకొని గృహ రుణ వడ్డీ రేట్లను నిర్ణయిస్తున్నాయి. అన్ని బ్యాంకులకంటే చౌకగా రుణాలిస్తామని ప్రచారం చేసుకునే ఎస్‌బీఐ, ఐసీఐసీఐ ఇప్పటివరకూ వాటి ఎంసీఎల్‌ఆర్‌పై 25 శాతం స్ప్రెడ్ వేసుకుని గృహ రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయిస్తూ వచ్చాయి. తాజాగా ఇవి వాటి స్ప్రెడ్‌ను బాగా పెంచేశాయి.
ఎస్‌బీఐ స్ప్రెడ్‌ను 0.65 శాతానికి పెంచేయటంతో గృహ రుణంపై వడ్డీ రేటును 0.5 శాతం తగ్గించినా 9.15 శాతం నుంచి 8.65 శాతానికి మాత్రమే దిగుతోంది. ఎంసీఎల్‌ఆర్ 0.9 తగ్గడం వల్ల ఎంసీఎల్‌ఆర్ రేటు మాత్రం 8 శాతానికి దిగుతుంది. దీనికి పాత స్ప్రెడ్‌ను అమలుచేస్తే ఎస్‌బీఐ గృహ రుణ వడ్డీ రేటు 8.25 శాతానికి తగ్గాలి. ఐసీఐసీఐ బ్యాంక్ గృహ రుణంపై వడ్డీ రేటు 9.15 శాతం నుంచి 8.45 శాతానికి తగ్గాల్సి వుండగా, ఈ బ్యాంకు కూడా తన స్ప్రెడ్‌ను 0.45 శాతానికి పెంచుకోవడంతో గృహ రుణంపై రేటు 8.65 శాతానికి మాత్రమే తగ్గుతోంది. తద్వారా 0.7 శాతం ఎంసీఎల్‌ఆర్ తగ్గింపు గృహ రుణ వినియోగదారులకు చేరడం లేదు. పెద్ద నోట్ల రద్దు పుణ్యమా అని బ్యాంకుల్లోకి కుప్పతెప్పలుగా వచ్చిపడిన డిపాజిట్ల ప్రయోజనాన్ని ప్రజలకు మళ్లించకుండా, బ్యాంకులు వాటి లాభాల్ని పెంచుకోవడానికే స్ప్రెడ్‌ను పెంచుతున్నాయనేది విశ్లేషకుల మాట.