భారత మార్కెట్లోకి ఎజ్సాఫ్ట్వేర్ గ్రూప్
హైదరాబాద్‌లో కార్యాలయం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హెడ్జ్ ఫండ్స్, ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలు మొదలైన వాటికి టెక్నాలజీ సేవలు అందించే ఎజ్ సాఫ్ట్‌వేర్ గ్రూప్ తాజాగా భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. హైదరాబాద్‌లో తమ కార్యాలయం ప్రారంభించింది. ఇందులో ప్రస్తుతం 60 మంది ఉద్యోగులు ఉన్నట్లు సంస్థ సీఈవో పీట్ సినిస్‌గలి సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. త్వరలో సిబ్బంది సంఖ్యను 150కి, ఆ తర్వాత మూడేళ్లలో మొత్తం 500కు పెంచుకోనున్నట్లు ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా తమకు 12 కార్యాలయాలు, 1,000 పైచిలుకు సిబ్బంది, 2,000 పైగా క్లయింట్లు ఉన్నారని పీట్ వివరించారు.
తమ క్లయింట్లలో సింహభాగం గ్లోబల్ హెడ్జ్ ఫండ్స్ ఉన్నాయని పేర్కొన్నారు. సుమారు 75 శాతం కస్టమర్లు అమెరికాలోను, పదిహేను శాతం మంది యూరప్‌లోనూ ఉన్నట్లు చెప్పారు. హైదరాబాద్ కార్యాలయంలో ప్రాథమికంగా సాఫ్ట్‌వేర్ అభివృద్ధితో ప్రారంభించి త్వరలో క్లయింట్ సర్వీసులు మొదలైనవి అందించనున్నట్లు పీట్ పేర్కొన్నారు. ప్రస్తుతం తమకు బోస్టన్, లండన్, హాంకాంగ్‌లలో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కార్యకలాపాలు ఉన్నట్లు ఆయన వివరించారు.