మా ఉద్యోగాలను కాపాడండి!
సాక్షి, న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేయడంతో ఉద్యోగుల్లో ఆందోళన మరింత పెరిగింది. తమ ఉద్యోగాలను రక్షించాలని కోరుతూ ఎయిర్ ఇండియా ఉద్యోగులు శుక్రవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. ప్రైవేటీకరణకు బదుకులుగా సంస్థను యథాతథంగా నడపడానికి అనుమతించాలని ఎయిర్ ఇండియా ఉద్యోగుల సంఘం (ఎఐయుఇ) విజ్ఞప్తి చేసింది.
ఎయిర్ ఇండియాలో ప్రభుత్వ పెట్టుబడులను ఉపసంహరించుకునే వ్యూహంలో భాగంగా ఏర్పాటు చేసిన కేంద్ర క్యాబినెట్ మంత్రుల బృందంలో రవాణా మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎయిర్ ఇండియాకు చెందిన నాన్-టెక్నికల్ సిబ్బంది కేంద్రమంత్రికి ఒక మొమోరాండం సమర్పించారు. సంస్థ అప్పులను ప్రభుత‍్వం మాఫీ చేసి, ప్రైవేటీకరణ యోచనను మానుకోవాలని, లేని పక్షంలో తమ ఉద్యోగాలకు భద్రత కల్పించాలని వేడుకున్నారు. ఉద్యోగుల పదవీ విరమణ తర్వాత శాశ్వత ఉద్యోగుల భవితవ్యం, ఉద్యోగ భద్రత, వైద్య, ప్రావిడెంట్ ఫండ్, గ్యారేజీలు, సిబ్బంది రవాణా, క్యాంటీన్‌లాంటి సంక్షేమ సౌకర్యాలు తదితర డిమాండ్లతో కూడిన లేఖను ఆయనకి సమర్పించారు. అలాగే తమ పాత బకాయిలను పూర్తిగా చెల్లించాలని కోరారు.
కాగా రూ.50వేల కోట్ల రుణ భారంలో కూరుకుపోయిన జాతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో ప్రభుత్వ వాటా విక్రయానికి కేంద్రం నిర్ణయించింది. ఇందుకు ఇద్దరు ఆర్థిక సలహాదారులు, ఒక న్యాయ సలహాదారు నియామకానికి సంబంధించి బిడ్లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే.