
స్టార్ అలయెన్స్‌లో ఎయిరిండియా
ఎయిరిండియా ఏడేళ్ల ఎదురుచూపులు ఫలించాయి. అంతర్జాతీయ విమానయాన సంస్థల కూటమి ‘స్టార్ అలయెన్స్’లో భాగస్వామి అయింది.
దేశీయ విమానయాన సంస్థకు పెరగనున్న ప్రయాణికులు, ఆదాయం
- ఎయిరిండియాకు అందుబాటులోకి
- అలయెన్స్ గ్లోబల్ నెట్‌వర్క్
- కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు వెల్లడి
న్యూఢిల్లీ: ఎయిరిండియా ఏడేళ్ల ఎదురుచూపులు ఫలించాయి. అంతర్జాతీయ విమానయాన సంస్థల కూటమి ‘స్టార్ అలయెన్స్’లో భాగస్వామి అయింది. సోమవారం లండన్‌లో ఏర్పాటు చేసిన స్టార్ అలయెన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశం ఎయిరిండియాను చేర్చుకోవడానికి అనుకూలంగా ఓటు వేసింది. ప్రపంచంలోని అతిపెద్ద కూటమి స్టార్ అలయెన్స్‌లో భాగస్వామి అయినందుకు సంతోషంగా ఉందని పౌర విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు మంగళవారం న్యూఢిల్లీలో మీడియాకు తెలిపారు.
అలయెన్స్‌లో చేరడం వల్ల ఎయిరిండియా ఆదాయం 4-5% పెరగవచ్చని చెప్పారు.
యునెటైడ్ (అమెరికా), సింగపూర్ ఎయిర్‌లైన్స్, లుఫ్తాన్సా, ఎయిర్ చైనా, ఎయిర్ కెనడా, స్విస్, ఆస్ట్రియన్, ఆల్ నిప్పన్ ఎయిర్‌వేస్ వంటి ప్రసిద్ధి చెందిన 27 సంస్థలకు స్టార్ అలయెన్స్‌లో సభ్యత్వం ఉంది.
ఎయిరిండియా 28వ భాగస్వామ్య సంస్థ అవుతుంది. స్టార్ అలయెన్స్‌లో చేరిన తొలి భారతీయ విమానయాన కంపెనీగా ఎయిరిండియా ఆవిర్భవించనుంది. స్టార్ అలయెన్స్ గ్లోబల్ నెట్‌వర్క్‌కు అనుగుణంగా ఎయిరిండియా గత 6 నెలలుగా విమాన రాకపోకల వేళలు, టికెట్ బుకింగ్ అంశాల్లో మార్పులు చేస్తోంది.
ఎన్నో లాభాలు...
- భారత్ - అమెరికాల మధ్య ప్రయాణించే వారిలో ప్రస్తుతం 13 శాతం మంది ఎయిరిండియా విమానాల్లో వెళ్తున్నారు. స్టార్ అలయెన్స్‌లో సభ్యత్వం కారణంగా ఈ సంఖ్య ఒక్క ఏడాదిలోనే 20 శాతానికి పెరగనుంది.
- అమెరికా వెళ్లే ప్రయాణికులకు మరిన్ని నగరాలు సులువుగా అందుబాటులోకి రానున్నాయి. స్టార్ అలయెన్స్‌లో సభ్యత్వమున్న ఇతర ఎయిర్‌లైన్స్‌లోనూ వారు ప్రయాణించవచ్చు.
- స్టార్ అలయెన్స్ సభ్యత్వ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా 195 దేశాల్లోని 1,328 ఎయిర్‌పోర్టులకు నిత్యం 21,980 విమాన సర్వీసులను నడుపుతున్నాయి. ఈ సంస్థలకు మొత్తం 4,338 సొంత విమానాలుండగా ఏటా 64 కోట్ల ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి.
- సభ్యత్వం ఫలితంగా అలయెన్స్ నెట్‌వర్క్ అంతా ఎయిరిండియాకు అందుబాటులోకి రానుంది.
- తనవంతుగా, ఎయిరిండియా భారత్‌లోని అన్ని ఎయిర్‌పోర్టులకు స్టార్ అలయెన్స్‌కు కనెక్టివిటీ కల్పించనుంది. అలయెన్స్‌లో సభ్యత్వమున్న ఇతర ఎయిర్‌లైన్స్‌లో ఇండియాకు వచ్చిన వారు ఎయిరిండియా విమానాల్లో భారతీయ నగరాలకు చేరుకోవచ్చు.
- ఎయిరిండియా ప్రయాణికులు వేరే దేశంలో ప్రధాన నగరంలో దిగాకసులభంగా ఇతర ఎయిర్‌లైన్స్‌లో వారి గమ్య నగరాలకు వెళ్లవచ్చు.