న్యూఢిల్లీ : ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో ఊరట లభించిన కార్తీ చిదంబరానికి, ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసులో కూడా మరో ఊరట లభించింది. ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసులో ఏప్రిల్ 16 వరకు ఆయనను అరెస్ట్ చేయకుండా.. స్పెషల్ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. స్పెషల్ సీబీఐ జడ్జి ఓపీ సైని, షరత్తులతో కూడిన ఈ ముందస్తు బెయిల్‌ను మంజూరు చేశారు. ఈ కేసులో ఎప్పుడు సమన్లు జారీచేస్తే అప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముందు హాజరు కావాలని జడ్జి తెలిపారు. కార్తీ చిదంబరం ముందస్తు బెయిల్ ఫిర్యాదులపై మూడు వారాల్లోగా స్పందించాలని సీబీఐ, ఈడీని కోర్టు ఆదేశించింది.
తదుపరి విచారణను ఏప్రిల్ 16కు వాయిదా వేసింది. 2006లో ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ ఒప్పందానికి విదేశీ పెట్టుబడుల ప్రమోషన్ బోర్డు అనుమతి ఇవ్వడానికి సంబంధించి జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఈ కేసు నమోదైంది. ఎఫ్‌ఐపీబీ అనుమతి కోసం కార్తీ చిదంబరం రూ.26 లక్షలను పుచ్చుకున్నట్టు ఈడీ ఆరోపిస్తోంది. నేడు గంట పాటు జరిగిన ఈ విచారణలో కార్తీ తరుఫున వాదించిన కపిల్ సిబాల్... ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసులో కార్తీకి వ్యతిరేకంగా ఎలాంటి ఆరోపణలు నమోదు కాలేదని పేర్కొన్నారు. ఎఫ్‌ఐపీబీ అధికారులు ఆయనకు తెలుసన్న రుజువులేమీ లేవన్నారు. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో నిన్ననే(శుక్రవారమే) కార్తీకి బెయిల్ మంజూరైంది.
Comments
Please login to add a commentAdd a comment