ఎయిర్‌టెల్ చేతికి ‘టికోనా’
♦ 4జీ వ్యాపారం కొనుగోలు
♦ డీల్ విలువ రూ.1,600 కోట్లు
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్... ఇంటర్నెట్ సంస్థ టికోనా నెట్‌వర్క్స్‌కు చెందిన 4జీ వ్యాపారాన్ని రూ.1,600 కోట్లకు కొనుగోలు చేస్తోంది. ఈ కొనుగోలులో భాగంగా టికోనా సంస్థకు చెందిన బ్రాడ్ బ్యాండ్ స్పెక్ట్రమ్, 5 టెలికం సర్కిళ్లలో విస్తరించి ఉన్న 350 సైట్లు తమ పరం అవుతాయని భారతీ ఎయిర్‌టెల్ తెలిపింది. టికోనా సంస్థకు గుజరాత్, తూర్పు ఉత్తర ప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, హిమాచల్ ప్రదేశ్ టెలికం సర్కిళ్లలో 2,300 మోగాహెట్జ్ బ్యాండ్‌పై 20 మెగా హెట్జ్ స్పెక్ట్రమ్ ఉంది.
టికోనా కొనుగోలుతో దేశంలో రిలయన్స్ జియో తర్వాత దేశవ్యాప్త 4జీ నెట్‌వర్క్ ఉన్న కంపెనీగా భారతీ ఎయిర్‌టెల్ అవతరిస్తుంది. టికోనా సంస్థ కొనుగోలుతో వినియోగదారులకు మరింత వేగవంతమైన వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్ సేవలందించగలమని కంపెనీ ఎండీ, సీఈఓ (ఇండియా,దక్షిణాసియా) గోపాల్ విట్టల్ చెప్పారు. ఈ డీల్ పూర్తికాగానే ఈ ఐదు సర్కిళ్లలో 4జీ సేవలందిస్తామని తెలియజేశారు.