సాక్షి, ముంబై: ప్రముఖ టెలికాం సేవల సంస్థ భారతి ఎయిర్‌టెల్‌కు చుక్కెదురైంది. సంస్థకు చెందిన పేమెంట్స్ బ్యాంకు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకు ఈకేవైసీ సౌకర్యాన్ని పునరుద్దరించడానికి యూఐడీఏఐ నిరాకరించింది. అయితే ఎయిర్‌టెల్ మొబైల్ సేవలకు మాత్రం ఈకేవైసీ సేవలు వినియోగించుకునేందుకు జనవరి 10 వరకు అనుమతినిచ్చింది. దాదాపు 55.63 లక్షల ఖాతాదారులకు రూ.138కోట్ల (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్)ను అందించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఈకేవైసీ లైసెన్స్‌పై రిజర్వ్‌బ్యాంక్ అంతిమ విచారణ, ఆడిట్ నివేదిక వచ్చేంతవరకు సస్పెన్షన్ కొనసాగుతుందని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) స‍్పష్టం చేసింది. ఆధార్ ఆధారిత ఈకేవైసీతో మొబైల్ చందాదారుల ధ్రువీకరణలు ఇకపైనా పూర్తి చేసేందుకు వీలు కానుంది. మార్చి 31 తర్వాత కొన్ని పరిమితుల మేరకు ఆధార్ ఈకేవైసీ లైసెన్స్‌ను కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. అలాగే పేమెంట్స్ బ్యాంకుకు సంబంధించి సంబంధిత ఆడిట్ నిర్వహించాల్సిందిగా ఎయిర్‌టెల్‌ను, రిజర్వ్‌బ్యాంకును యుఐడిఎఐ ఆదేశించింది. ఎయిర్‌టెల్ సిస్టమ్స్, దరఖాస్తులు, డాక్యుమెంటేషన్ తదితర అంశాలు లైసెన్సింగ్ నిబంధనలకనుగుణంగా ఉన్నవీ లేనిదీ ధృవీకరించాలని కోరింది.
టెలికం శాఖతో కలిసి తాము నిర్వహించిన ఆడిట్‌లో బయటపడిన లోపాలను కంపెనీ సవరించింది. కనుక లైసెన్స్ను పొడిగిస్తున్నామని యూఐడీఏఐ తెలిపింది. అలాగే ఆధార్ చట్టం ప్రకారం ఎయిర్‌టెల్ ప్రతి త్రైమాసికానికి రిపోర్టు ఇవ్వాల్సి ఉంటుందనీ పేర్కొంది. అటు ఈ పరిణామంపై ఎయిర్‌టెల్ ప్రతినిధి స్పందిస్తూ.. ఆధార్ ఆధారిత ఈకేవైసీ సేవలకు తమకు అనుమతి లభించినందుకు సంతోషంగా ఉందన్నారు. తమ మొబైల్ రిజర్వ్ బ్యాంకు క్లియరెన్స్ ఇచ్చేంత వరకు ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంకు ఈకేవైసీపై ఉన్న నిషేధం కొనసాగుతుందని తెలిపింది. ఎయిర్ టెల్ తన చందాదారులకు తెలియకుండానే వారి పేరిట పేమెంట్స్ బ్యాంకు ఖాతాలు ప్రారంభించడం తెలిసిందే. దీంతో ఆయా చందాదారుల గ్యాస్ సబ్సిడీలు వచ్చి ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంకు ఖాతాల్లో పడడంతో వివాదం చెలరేగింది. దీంతో ఈకేవైసీని దుర్వినియోగిం చేసిందన్న ఆరోపణలపై పేమెంట్స్ బ్యాంకుకు ఆ సేవలను యూఐడీఏఐ నిలిపివేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment