
ఎయిర్‌టెల్ ఏపీ సర్కిల్ సీఈవో వెంకటేశ్ విజయ్ రాఘవన్
• వేగవంతమైన ‘వి–ఫైబర్’ ఇంటర్నెట్
• భాగ్యనగరితోసహా ఏడు నగరాల్లో
• కొత్త కస్టమర్లకు మూడు నెలలు ఫ్రీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం వార్‌లో పోటీపడుతున్న దిగ్గజ కంపెనీ ఎయిర్‌టెల్ మరో అడుగు ముందుకేసింది. వి–ఫైబర్ పేరుతో వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్ సేవలను హైదరాబాద్‌లో ప్రారంభించింది. దీని ప్రత్యేకత ఏమంటే 100 ఎంబీపీఎస్ వరకు వేగాన్ని కస్టమర్లు ఎంజాయ్ చేయవచ్చు. ఇప్పటి వరకు 40 ఎంబీపీఎస్ వేగం వరకే కంపెనీ సేవలు అందించింది. పాత కస్టమర్లు ఎటువంటి అదనపు భారం లేకుండానే కొత్త టెక్నాలజీకి అప్‌గ్రేడ్ అవొచ్చు.
మోడెమ్‌ను మార్చుకుంటే సరిపోతుంది. కొత్తగా వైర్లు వేయడం, తవ్వకాల అవసరం లేదు. యూరప్‌లో నంబర్–1 ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ టెక్నాలజీ అయిన వెక్టోరైజేషన్ ఆధారంగా వి–ఫైబర్ పనిచేస్తుందని భారతీ ఎయిర్‌టెల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్ సీఈవో వెంకటేశ్ విజయ్ రాఘవన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. భారత్‌లో ప్రస్తుతం ఎయిర్‌టెల్ మాత్రమే ఈ పరిజ్ఞానాన్ని పరిచయం చేసిందని చెప్పారు. 1 జీబీ స్పీడ్ అందించే సామర్థ్యం సైతం కంపెనీకి ఉందని పేర్కొన్నారు. మార్కెట్ సిద్ధం కాగానే అందుబాటులోకి తెస్తామన్నారు.
అపరిమిత కాల్స్ సైతం..
కొత్తగా వి–ఫైబర్ కనెక్షన్ తీసుకుంటే మూడు నెలల పాటు సేవలు ఉచితం. వి–ఫైబర్ ప్లాన్స్ రూ.650 నుంచి ప్రారంభం. బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లందరూ ఏ టెలికం కంపెనీ వినియోగదార్లకైనా దేశవ్యాప్తంగా వాయిస్ కాల్స్ అపరిమితంగా చేసుకోవచ్చు. వినియోగదారు ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ మొబైల్ లేదా డిజిటల్ టీవీ (డీటీహెచ్) సైతం వాడినట్టయితే మై హోమ్ రివార్డ్స్ ప్రోగ్రాం కింద అదనపు డేటా పొందవచ్చు. ఉదాహరణకు కస్టమర్ కుటుంబంలో రెండు పోస్ట్‌పెయిడ్ మొబైల్, ఒక డిజిటల్ టీవీ కనెక్షన్ ఉంటే 15 జీబీ డేటా అదనం. ఎయిర్‌టెల్ వెబ్‌సైట్ లేదా టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి కొత్త సేవలు పొందవచ్చు. వి–ఫైబర్‌కు అప్‌గ్రేడ్ అయ్యాక సర్వీసు నచ్చకపోతే నెల రోజుల్లోగా కస్టమర్ చెల్లించిన యాక్టివేషన్ చార్జీల మొత్తాన్ని కంపెనీ రిఫండ్ చేస్తుంది. ప్రాజెక్ట్ లీప్‌లో భాగంగా నెట్‌వర్క్‌ను పటిష్టం చేసే కార్యక్రమమిదని కంపెనీ తెలిపింది.
హైదరాబాద్‌సహా ఏడు నగరాల్లో వి–ఫైబర్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‌లో అన్ని కంపెనీలకు కలిపి సుమారు 6 లక్షల బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో ఎయిర్‌టెల్ వాటా 20 శాతం దాకా ఉంది.