సాక్షి, ముంబై : తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కంపెనీలో తన ప్రస్థానాన్ని మొదలు పెట్టిన ముఖేష్ అంబానీ పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ, ఆపిల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన కొత్త ఐఫోన్లను భారత్‌లో ప్రవేశపెట్టబోతున్నారు. ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ స్మార్ట్‌ఫోన్లను శుక్రవారం మధ్యాహ్నం నావి ముంబైలోని టెల్కో ప్రధాన కార్యాలయంలో ఆకాశ్ అంబానీ ఆవిష్కరించనున్నట్టు తెలిసింది. ఈ కొత్త టెల్కో జియోతో, రిలయన్స్ రిటైల్‌తో ఆపిల్ భాగస్వామ్యం ఏర్పరుచుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొత్త ఐఫోన్లను ఆకాశ్ అంబానీ ఆవిష్కరిస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
నెలకు 799 జియో కనెక్షన్‌తో ఈ కొత్త ఐఫోన్లను కొనుగోలుచేసిన వారికి, బైబ్యాక్ గ్యారెంటీ అందుబాటులో ఉంటుంది. అంటే ఒక సంవత్సరం తర్వాత తిరిగి ఇస్తే.. వీటి అసలు కొనుగోలు ధరలో 70 శాతం తిరిగి ఇవ్వనున్నట్టు రిలయన్స్ డిజిటల్ వెల్లడించింది. అయితే కస్టమర్లు కచ్చితంగా జియో కనెక్షన్‌ను వాడాల్సి ఉంటుంది. నెలకు రూ.799తో రీఛార్జ్ చేయించుకోవాల్సిందే. ఈ కొత్త ఐఫోన్ ప్లాన్ కింద నెలకు 90జీబీ డేటాను జియో ఆఫర్ చేయనుంది. ప్రీపెయిడ్, పోస్టు పెయిడ్ కస్టమర్లందరికీ ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండింట్లోనూ ఆపిల్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. రిలయన్స్ డిజిటల్, అమెజాన్ రెండు ఐఫోన్లను అధికారికంగా విక్రయిస్తున్నాయి.
ఈ కొత్త ఐఫోన్లను కొనుగోలు చేసేందుకు జియో తన కస్టమర్లకు తన వెబ్‌సైట్‌లోనూ, జియో స్టోర్‌లోనూ ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించింది. సెప్టెంబర్ 22 -29వ తేదీల మధ్య రిలయన్స్ డిజిటల్ ద్వారా ఈ స్మార్ట్ఫోన్‌లను ప్రీ బుకింగ్ చేస్తే రూ.10వేల క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను జియో ప్రకటించింది. సెప్టెంబర్ 29 లాంచింగ్ సందర్భంగా ఈ క్యాష్‌బ్యాక్ అందిస్తుంది. అయితే ఈ ఆఫర్ కేవలం సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసిన వినియోగదారులకు మాత్రమే లభ్యం.