ఐపీవోకి చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా
హాంకాంగ్: చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ పబ్లిక్ ఇష్యూ చేపట్టే సన్నాహాల్లో ఉంది. ఇందుకు వీలుగా ఆరు మర్చంట్ బ్యాంకర్లతో చర్చలు నిర్వహిస్తోంది. అమెరికా మార్కెట్లలో చేపట్టనున్న ఐపీవో ద్వారా కంపెనీ 15 బిలియన్ డాలర్ల వరకూ సమీకరించగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది జరిగితే 2012లో వచ్చిన ఫేస్‌బుక్ ఇష్యూ తరువాత అతిపెద్ద ఐపీవోగా నిలిచే అవకాశముంది. ఇష్యూ నిర్వహించేందుకు(అండర్‌రైటింగ్) సిటీగ్రూప్, డాయిష్ బ్యాంక్, గోల్డ్‌మన్ శాక్స్, మోర్గాన్ స్టాన్లీ తదితర సంస్థలతో చర్చలు నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. త్వరలో ప్రారంభంకానున్న ఈ ఇష్యూ ఊహించినదానికంటే అధిక విలువను సాధించే అవకాశమున్నదని, తద్వారా టెక్నాలజీ పరిశ్రమలో రెండో అతిపెద్ద ఇష్యూగా నిలవవచ్చునని పేర్కొన్నాయి.
ఈబే, అమెజాన్ కలిపితే...
ఈ కామర్స్ దిగ్గజాలు ఈబే, అమెజాన్.కామ్‌ల సంయుక్త బిజినెస్‌కంటే అలీబాబా వ్యాపారమే అధికంకావడం విశేషం. సంస్థలో ప్రపంచవ్యాప్తంగా 20,000 మంది పనిచేస్తున్నారు. చైనా ఈ కామర్స్ మార్కెట్లో 80% వాటా కంపెనీదే. అలీబాబాలో 37% వాటాతో సాఫ్ట్‌బ్యాంక్, 24% వాటా కలిగిన యాహూ అతిపెద్ద వాటాదారులుగా ఉన్నాయి. అలీబాబా వ్యవస్థాపకులు, కొంతమంది సీనియర్ మేనేజర్లకు కలిపి 13% వరకూ వాటా ఉంది.