షాప్‌లో అన్ని వస్తువులూ డిస్‌ప్లేలో..
చిన్న వర్తకులకు స్నాప్‌బిజ్ టెక్నాలజీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వస్తువుల ప్రదర్శన రిటైల్ రంగంలో అత్యంత కీలక అంశం. అన్ని వస్తువులూ కనపడేలా డిస్‌ప్లే ఉంటేనే అమ్మకాలు పెరుగుతాయి. చిన్న దుకాణాలకు ఇది అతిపెద్ద అడ్డంకి. స్థలాభావంతో అన్ని ప్రొడక్టులను డిస్‌ప్లే చేయలేరు. ఇటువంటి సమస్యకు చెక్ పెడుతూ రిటైల్ టెక్నాలజీ కంపెనీ స్నాప్‌బిజ్ వినూత్న పరిష్కారాన్ని తీసుకొచ్చింది. ప్రతి దుకాణంలో 24 అంగుళాల స్మార్ట్ హెచ్‌డీ ఎల్‌ఈడీ డిస్‌ప్లేను అమర్చుతారు.
బిల్లింగ్ కౌంటర్ వద్ద స్నాప్‌బిజ్ టర్బో పేరుతో కంప్యూటర్ తెర వంటి 15.6 అంగుళాల టచ్ స్క్రీన్‌ను వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ప్రింటర్, బార్‌కోడ్ స్కానర్‌ను దీనికి అనుసంధానిస్తారు. ఈ స్క్రీన్ ద్వారా ఎల్‌ఈడీ డిస్‌ప్లేను దుకాణదారు ఆపరేట్ చేయవచ్చు. షాప్‌లో ఉన్న వస్తువులతోపాటు డిస్కౌంట్లు, ప్రమోషన్ ఆఫర్లను ఎల్‌ఈడీ డిస్‌ప్లేలో ప్రదర్శించవచ్చు. 4 బిల్లులు ఒకేసారి పూర్తి చేయవచ్చు. ఇక కస్టమర్లు స్నాప్ ఆర్డర్ యాప్ ద్వారా సమీప దుకాణంలో లభించే వస్తువుల జాబితాను చూడొచ్చు. ఆర్డరు ఇవ్వొచ్చు.
వ్యాపారం పెరుగుతుంది
డిస్‌ప్లే ఆకర్షణీయంగా ఉంటే అమ్మకాలు పెరుగుతాయని స్నాప్‌బిజ్ సహ వ్యవస్థాపకులు ప్రేమ్ కుమార్ మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘ముంబై, పుణేలో 3,000 దుకాణాల్లో స్నాప్‌బిజ్ టర్బో ఏర్పాటు చేశాం. గతంతో పోలిస్తే వీరి వ్యాపారాల్లో పెరుగుదల కనిపించింది. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టాం. కిరాణా దుకాణాలను డిజిటైజ్ చేస్తాం. వర్తకులు రూ.40,000 చెల్లిస్తే చాలు. నిర్వహణ చార్జీలు లేవు. ఇంటర్నెట్ చార్జీలు మేమే భరిస్తాం. ప్రస్తుతం 25 దిగ్గజ రిటైల్ కంపెనీలు మాతో చేతులు కలిపాయి. ఈ కంపెనీల ఉత్పత్తులు ఎల్‌ఈడీ డిస్‌ప్లేలో ప్రదర్శితమవుతాయి. విక్రయాలను బట్టి కంపెనీలు వర్తకులకు ఇన్సెంటివ్ ప్రకటిస్తాయి. స్నాప్ ఆర్డర్ యాప్‌లో కంపెనీతో భాగస్వామ్యం ఉన్న ఎన్ని దుకాణాలనైనా జోడించొచ్చు. స్నాప్‌బిజ్ టర్బోకై 7 పేటెంట్లకు దరఖాస్తు చేశాం’ అని తెలిపారు.