అమెజాన్‌ ‘ఫ్యూచర్‌’ షాపింగ్‌! | Amazon Buy 9.5% stake in Future Retail | Sakshi
Sakshi News home page

అమెజాన్‌ ‘ఫ్యూచర్‌’ షాపింగ్‌!

Published Wed, Nov 7 2018 12:14 AM | Last Updated on Wed, Nov 7 2018 12:14 AM

Amazon Buy 9.5% stake in Future Retail - Sakshi

న్యూఢిల్లీ: ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ‘షాపింగ్‌’లో దూకుడు పెంచుతోంది. ఆన్‌లైన్‌ గ్రోసరీ (కిరాణా, ఆహారోత్పత్తులు ఇతరత్రా) మార్కెట్లో మరింత మార్కెట్‌ను చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. బిగ్‌బజార్, నీల్‌గిరీస్‌ బ్రాండ్‌లతో సూపర్‌మార్కెట్‌లను నిర్వహిస్తున్న ఫ్యూచర్‌ రిటైల్‌లో అమెజాన్‌ పాగా వేసేందుకు సిద్ధమైంది. 9.5 శాతం మైనారిటీ వాటాను అమెజాన్‌ కొనుగోలు చేయనున్నట్లు సమాచారం.

ఫ్యూచర్‌ రిటైల్‌ ఇప్పటికే స్టాక్‌ మార్కెట్లో లిస్టయింది. ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం ఫ్యూచర్‌ రిటైల్‌ విలువ దాదాపు రూ.25వేల కోట్లు. 9.5 శాతం వాటా కోసం అమెజాన్‌ కొంచెం అటూఇటుగా రూ.2,500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు తెలియవచ్చింది. ఫ్యూచర్‌ రిటైల్‌కు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,100కు పైగా స్టోర్లు ఉన్నాయి. చర్చలు పూర్తయ్యాయని, కొద్ది రోజుల్లోనే ఒప్పందం కుదురుతుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

‘విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్‌ (ఎఫ్‌పీఐ) మార్గంలో అమెజాన్‌ ఈ 9.5 శాతం వాటా కొనుగోలు చేయనుంది. ఫ్యూచర్‌ రిటైల్‌ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తర్వాత బహుశా ఈ నెల 14న డీల్‌ను ప్రకటించే అవకాశాలున్నాయి’ అని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఇటు ఫ్యూచర్‌ రిటైల్, అటు అమెజాన్‌ ఈ వార్తలపై నేరుగా స్పందించలేదు.

జనవరిలో బీజం...
కిశోర్‌ బియానీకి చెందిన ఫ్యూచర్‌ గ్రూప్‌లో ఫ్యూచర్‌ రిటైల్‌ ప్రధానమైన కంపెనీ. ఇది రెండేళ్ల కిందట ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చెందిన హెరిటేజ్‌ ఫుడ్స్‌ను కొనుగోలు చేసింది. ప్రస్తుతం హెరిటేజ్‌కు ఫ్యూచర్‌ రిటైల్‌లో 3.65 శాతం వాటా కూడా ఉంది. ఈ ఏడాది జనవరిలోనే ఫ్యూచర్‌ రిటైల్‌లో వాటా తీసుకోవాలని అమెజాన్‌ భావించింది. అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ను కిశోర్‌ బియానీ స్వయంగా సీటెల్‌లోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో కలిశారు కూడా.

తర్వాత ఇరు కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు పలుమార్లు సమావేశమై చర్చలు జరిపారు. ప్రస్తుతం మల్టీబ్రాండ్‌ రిటైల్‌లో 49 శాతం వరకూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) భారత్‌ అనుమతిస్తోంది. దీంతో అమెజాన్‌ ఎఫ్‌పీఐ మార్గంలో దేశీ కంపెనీల భాగస్వామ్యంతో పెట్టుబడులకు మొగ్గుచూపుతోంది. ఇప్పటికే షాపర్స్‌ స్టాప్‌లో 5 శాతం వాటాను అమెజాన్‌కు చెందిన విదేశీ ఇన్వెస్ట్‌మెంట్‌ అనుబంధ సంస్థ ఎఫ్‌పీఐ మార్గంలోనే కొనుగోలు చేసింది. ఏదైనా భారతీయ కంపెనీలో విదేశీ సంస్థలు సింగిల్‌ కంపెనీ ద్వారా 10 శాతం వాటాను ఎఫ్‌పీఐ రూట్‌లో కొనుగోలు చేయొచ్చు.

అదేవిధంగా భారతీయ కంపెనీలు 49 శాతం వరకూ వాటాను బహుళ ఎఫ్‌పీఐలకు విక్రయించుకునే అవకాశం ఉంది. ఇటీవలే ఆదిత్య బిర్లా రిటైల్‌ నుంచి  మోర్‌ సూపర్‌ మార్కెట్లను సమారా క్యాపిటల్‌తో కలిసి అమెజాన్‌ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ వాటా కూడా అమెజాన్‌ ఎఫ్‌పీఐ రూట్లోనే కొనుగోలు చేసింది. ఈ డీల్‌ విలువ దాదాపు రూ.4,200 కోట్లు. ఇక్కడ సమారా క్యాపిటల్‌ 51 శాతం, అమెజాన్‌ 49 శాతం వాటాను దక్కించుకున్నప్పటికీ... సాంకేతికంగా చూస్తే మోర్‌పై పూర్తి నియంత్రణ అమెజాన్‌ చేతికి వచ్చింది.

ఆన్‌లైన్‌కు ఆఫ్‌లైన్‌ దన్ను...
మోర్‌ కొనుగోలు ద్వారా అమెజాన్‌కు దాదాపు 500కు పైగా సూపర్‌ మార్కెట్‌ స్టోర్లు అందుబాటులోకి వచ్చాయి. ఆన్‌లైన్‌లో దూసుకెళ్తున్న అమెజాన్‌... ఆఫ్‌లైన్‌ను ఉపయోగించుకోవటానికి దీనిద్వారా మార్గం సుగమమయింది. ఫ్యూచర్‌ రిటైల్లో పెట్టుబడి కూడా ఇలాంటిదేనని రిటైల్‌ కన్సల్టెన్సీ సంస్థ వాజిర్‌ అడ్వయిజర్స్‌ వ్యవస్థాపకుడు హర్మిందర్‌ సాహ్ని వ్యాఖ్యానించారు.

ఈ వాటా కొనుగోలు ద్వారా అమెజాన్‌కు ఫ్యూచర్‌ గ్రూప్‌ భారీ ఆఫ్‌లైన్‌ నెట్‌వర్క్, గిడ్డంగులు, సరఫరా వ్యవస్థ ఇతరత్రా సదుపాయాలన్నీ అందుబాటులోకి వస్తాయని.. దీంతో ఆన్‌లైన్‌ బిజినెస్‌లో మరింత దూసుకెళ్లేందుకు వీలవుతుందని ఆయన విశ్లేషించారు. అత్యంత భారీ మార్కెట్‌ ఉన్న భారత గ్రోసరీ, ఆహారోత్పత్తుల మార్కెట్‌లో దూసుకెళ్లాలంటే ఆఫ్‌లైన్‌ కూడా కీలకం కావడంవల్లే అమెజాన్‌ ఈ దిశగా అడుగులు వేస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు.

ఇప్పటికే అమెజాన్‌ ప్యాంట్రీ, అమెజాన్‌ నౌ ద్వారా ఆన్‌లైన్‌ ఫుడ్, గ్రోసరీల్లో అమెజాన్‌ ప్రవేశించింది. భారత్‌లో 5 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించిన అమెజాన్‌ తాజాగా ఆహార రంగంలో 50 కోట్ల డాలర్ల పెట్టుబడి ప్రతిపాదనకు ప్రభుత్వ ఆమోదాన్ని కూడా పొందింది.

ఊరిస్తున్న మార్కెట్‌..
దేశంలో 95 శాతం రిటైల్‌ అమ్మకాలన్నీ ఇప్పటికీ సూపర్‌ మార్కెట్లు, కిరాణా స్టోర్ల ద్వారానే జరుగుతున్నాయి. ఇక కిశోర్‌ బియానీ ఫ్యూచర్‌ రిటైల్‌కు దేశవ్యాప్తంగా బలమైన నెట్‌వర్క్‌తో పాటు బిగ్‌బజార్‌ వంటి ప్రధానమైన బ్రాండ్‌ ఉంది. ఆహార, ఆహారేతర ఉత్పత్తులను విక్రయిస్తూ లాభాల్లో ఉన్న ఈ సంస్థలో పెట్టుబడి తమ ‘ఫ్యూచర్‌’కు కీలమని అమెజాన్‌ బలంగా విశ్వసిస్తోంది. ప్రధానంగా ఫ్యూచర్‌ రిటైల్‌కు దుస్తులు, జనరల్‌ వస్తువులు, లగేజ్, ఫుట్‌వేర్‌ విభాగాల్లో చాలా పట్టుంది.

340 నగరాల్లో మొత్తం 14.8 మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణంలో రిటైల్‌ స్టోర్లను ఫ్యూచర్‌ రిటైల్‌ నిర్వహిస్తోంది. దీనికితోడు 50 కోట్ల మేర కస్టమర్ల డేటా కూడా ఫ్యూచర్‌ గ్రూప్‌ వద్ద ఉండటం అమెజాన్‌కు కలిసొచ్చే అంశమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. భారత్‌ ఆన్‌లైన్‌ రిటైల్‌ రంగంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న విభాగాలు ఫుడ్, గ్రోసరీలేనని మోర్గాన్‌ స్టాన్లీ ఇటీవలే పేర్కొంది. 2020 నాటికి ఈ విభాగం వార్షికంగా 141 శాతం చక్రీయ వృద్ధిని నమోదు చేస్తుందని.. మార్కెట్‌ విలువ 15 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది. మొత్తం ఆన్‌లైన్‌ రిటైల్‌ అమ్మకాల్లో  ఇది 12.5 శాతమని కూడా లెక్కగట్టింది.

కాగా, మన రిటైల్‌ మార్కెట్‌ ప్రస్తుతం 672 బిలియన్‌ డాలర్లుగా ఉండగా.. 2020 నాటికల్లా 1.1 ట్రిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా. ఇంతలా ఊరిస్తున్న ఈ భారీ మార్కెట్‌ను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ల ద్వారా కొల్లగొట్టడమే లక్ష్యంగా ఇప్పుడు అంతర్జాతీయ రిటైల్‌ దిగ్గజాలు భారత్‌పై గురిపెట్టాయి. ఇదిలా ఉండగా.. ప్రధాన ప్రత్యర్థి ఫ్లిప్‌కార్ట్‌ను అమెరికా రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ దక్కించుకోవడం కూడా ఆమెజాన్‌ దూకుడు పెంచేందుకు ప్రధాన కారణ మని భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే బలమైన ఆఫ్‌లైన్‌ నెట్‌వర్క్‌ ఉన్న వాల్‌మార్ట్‌తో పోటీపడాలంటే అమెజాన్‌కు ఈ పెట్టుబడులు తప్పనిసరి. దీనికి అనుగుణంగానే అమెరికాలో కూడా అమెజాన్‌ హోల్‌ ఫుడ్స్‌ను దాదాపు 14.5 బిలియన్‌ డాలర్లతో చేజిక్కించుకోవడం గమనార్హం.

స్పెన్సర్‌పైనా గురి...
ఆర్‌పీ సంజీవ్‌ గోయెంకా గ్రూప్‌ కంపెనీ అయిన స్పెన్సర్‌ రిటైల్‌పైనా ఆన్‌లైన్‌ కంపెనీల కన్ను పడింది. దీనిలో వాటా కొనుగోలుపై అమెజాన్‌తో పాటు ఆలీబాబా (పేటీఎం మాల్‌ ద్వారా) కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పేటీఎం మాల్‌ బిగ్‌బాస్కెట్‌లో వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టింది. ఈ మేరకు స్పెన్సర్‌ యాజమాన్యంతో అమెజాన్‌ ఇప్పటికే చర్చలు కూడా జరిపినట్లు సం బంధిత వర్గాలు వెల్లడించాయి.

1996లో రిటైల్‌ రంగంలోకి అడుగుపెట్టిన స్పెన్సర్స్‌కు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 35 నగరాల్లో 120 సూపర్‌ మార్కెట్‌ స్టోర్లు, 37 హైపర్‌ స్టోర్లు ఉన్నాయి. మరోపక్క, రిలయన్స్‌ రిటైల్‌లో వా టా కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో... ఇప్పుడు ఆలీబాబా స్పెన్సర్‌పై దృష్టి పెట్టునట్లు తెలుస్తోంది. పేటీఎం మాల్‌లో ఆలీబాబా కీలక వాటాదారు కావడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement