Spencer
-
రూ.3 కోసం మూడేళ్ల పోరాటం..ఎట్టకేలకు
ముషీరాబాద్: క్యారీ బ్యాగ్ కోసం వసూలు చేసిన మూడు రూపాయలను కొనుగోలు తేదీ నుంచి పిటిషనర్‌కు తిరిగి చెల్లించే వరకు 9శాతం వడ్డీతో కలిపి ఇవ్వాలని స్పెన్సర్స్ రిటైల్ లిమిటెడ్‌ను హైదరాబాద్ రెండవ వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. ఫిర్యాదు దారుడికి రూ.10వేల నష్టపరిహారం, ఖర్చుల నిమిత్తం రూ.6వేలు చెల్లించాలని కమిషన్ అధ్యక్షుడు వక్కంటి నర్సింహారావు, సభ్యులు పారుపల్లి జవహర్‌బాబు తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళ్తే... 2019 జూన్ 2వ తేదీన ఫిర్యాదుదారుడు వడ్డె ఆనంద్‌రావు వస్తువుల కొనుగోలుకు అమీర్‌పేట స్పెన్సర్స్ సూపర్‌మార్కెట్‌కు వెళ్లారు. రూ.101 బిల్లుకు అదనంగా కవర్ కోసం రూ.3 వసూలు చేసి లోగో ఉన్న కవర్ అందించారు. ఫిర్యాదుదారుడు అభ్యంతరం తెలిపినా ఫలితం లేకపోవడంతో ఆయన వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. తరువాత ఆ మాల్‌ను మూసేసినా, పట్టువదలలేదు. కమిషన్ ఆదేశాలతో పత్రికలో ప్రకటన ఇచ్చి, రెండవ ప్రతివాదిగా స్పెన్సర్స్ను మళ్లీ కేసులో ఇంప్లీడ్ చేసి విజయం సాధించారు. కాగా.. క్యారీ బ్యాగుల అమ్మకానికి ఉద్దేశించిన ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్ 15ను 2018లో తొలగించారు. ఈ నేపథ్యంలో క్యారీ బ్యాగులకు అదనంగా డబ్బులు వసూలు చేయకుండా లీగల్ మెట్రాలజీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ శాఖలు సూపర్ మార్కెట్స్, షాపింగ్ మాల్స్‌కు తగిన ఆదేశాలు జారీ చేయాలని కమిషన్ తీర్పులో పొందుపరిచింది. ఖచ్చితంగా అమలు జరిగేలా చూడాలని ఉత్తర్వుల్లో పేర్కొంటూ తీర్పు కాపీలను ప్రతివాదికి పంపాలని కార్యాలయానికి సూచించింది. -
నష్టాల్లో స్పెన్సర్స్.. ఈ ఏడాది ఎంతంటే?
న్యూఢిల్లీ: ఆర్పీ సంజీవ్ గోయెంకా గ్రూపు సంస్థ స్పెన్సర్స్ రిటైల్ నష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. మార్చితో ముగిసిన త్రైమాసికానికి రూ.42 కోట్ల నష్టాన్ని ఈ సంస్థ మూటగట్టుకుంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నష్టం రూ.34.53 కోట్లతో పోలిస్తే మరింత పెరిగినట్టు తెలుస్తోంది. ఇక 2021–22 ఆర్థిక సంవత్సరానికి స్పెన్సర్స్ రిటైల్ కన్సాలిడేటెడ్ నష్టం రూ.121 కోట్లకు తగ్గింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో నష్టం రూ.164 కోట్లుగా ఉండడం గమనించాలి. ఆదాయం 5 శాతం తగ్గి రూ.2,300 కోట్లకు పరిమితమైంది. విక్రయాల్లో వృద్ధి, వ్యయాల నియంత్రణ, నెట్వర్క్ విస్తరణపై తమ దృష్టి కొనసాగుతుందని సంస్థ ప్రకటించింది. చదవండి: మెప్పించని ఎల్అండ్టీ.... -
యాంబర్ - స్పెన్సర్స్.. జూమ్
హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు మరింత జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 347 పాయింట్లు జంప్‌చేసి 40,330ను తాకింది. నిఫ్టీ 86 పాయింట్లు ఎగసి 11,848 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో డీమార్ట్ స్టోర్ల ప్రమోటర్ రాధాకిషన్ దమానీ కంపెనీలో వాటా కొనుగోలు చేసినట్లు వెల్లడికావడంతో రిటైల్ రంగ కంపెనీ స్పెన్సర్స్ రిటైల్ వెలుగులోకి వచ్చింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఏసీ దిగుమతులపై నిషేధాన్ని ప్రకటించడంతో కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ దిగ్గజం యాంబర్ ఎంటర్ప్రైజెస్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు షేర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. యాంబర్ ఎంటర్ప్రైజెస్ రిఫ్రిజిరేంట్స్సహా ఎయిర్ కండిషనర్ల(ఏసీ) దిగుమతులపై విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్(డీజీఎఫ్టీ) నిషేధం విధించిన వార్తలతో రెండు రోజులుగా యాంబర్ ఎంటర్ప్రైజెస్ కౌంటర్ వెలుగులో నిలుస్తోంది. తాజాగా ఎన్ఎస్ఈలో ఈ షేరు 10 శాతం దూసుకెళ్లింది. రూ. 2,410 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం 7.3 శాతం లాభంతో రూ. 2,340 వద్ద ట్రేడవుతోంది. గత రెండు రోజుల్లో ఈ కౌంటర్ 18 శాతం జంప్‌చేసింది. స్పెన్సర్స్ రిటైల్ డీమార్ట్ స్టోర్ల మాతృ సంస్థ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ ప్రమోటర్ రాధాకిషన్ దమానీ క్యూ2లో (జులై-సెప్టెంబర్) స్పెన్సర్స్ రిటైల్‌లో అదనపు వాటాను కొనుగోలు చేశారు. ఈ ఏడాది జూన్ చివరికల్లా స్పెన్సర్స్ రిటైల్‌లో రాధాకిషన్ దమానీ 2.09 శాతం వాటాను కలిగి ఉన్నారు. స్పెన్సర్స్ రిటైల్ బీఎస్ఈకి అందించిన వివరాల ప్రకారం సెప్టెంబర్‌కల్లా దమానీ వాటా 2.20 శాతానికి పెరిగింది. వెరసి 3.25 లక్షల స్పెన్సర్స్ షేర్లను దమానీ క్యూ2లో కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో స్పెన్సర్స్ రిటైల్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 7 శాతం వరకూ ఎగసింది. రూ. 78 సమీపంలో ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం 3 శాతం బలపడి రూ. 75 వద్ద ట్రేడవుతోంది. -
స్పెన్సర్స్ గూటికి గోద్రెజ్ నేచర్స్ బాస్కెట్
న్యూఢిల్లీ: సంజీవ్ గోయంకా గ్రూపులో భాగమైన స్పెన్సర్స్ రిటైల్, గోద్రెజ్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిటైల్ గ్రోసరీ సంస్థ నేచర్స్ బాస్కెట్‌ను కొనుగోలు చేయనుంది. ఈ డీల్ విలువ రూ.300 కోట్లు. ఈ కొనుగోలు ద్వారా స్పెన్సర్స్ రిటైల్ దేశవ్యాప్త కార్యకలాపాలు కలిగిన సంస్థగా మారుతుంది. ముంబై, పుణే, బెంగళూరులోని ప్రధాన ప్రాంతాల్లో 36 స్టోర్లతోపాటు పశ్చిమాదిన స్పెన్సర్స్‌కు నెట్వర్క్ లభిస్తుంది. గోద్రెజ్ ఇండస్ట్రీస్ సబ్సిడరీ గోద్రెజ్ నేచర్స్ బాస్కెట్లో నూరు శాతం వాటాను (44,58,30,000 షేర్లు) కొనుగోలు చేసే ప్రతిపాదనకు స్పెన్సర్స్ రిటైల్ బోర్డు శుక్రవారం ఆమోదం తెలిపింది. వాటాదారులు, నియంత్రణ సంస్థల ఆమోదంపై ఇది ఆధారపడి ఉంటుందని స్పెన్సర్స్ రిటైల్ తెలిపింది. నేచర్స్ బాస్కెట్ 2018–19 సంవత్సరంలో రూ.338 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఆహార, పానీయాలు, గ్రోసరీ వస్తువులను విక్రయిస్తుంటుంది. -
అమెజాన్ ‘ఫ్యూచర్’ షాపింగ్!
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ‘షాపింగ్’లో దూకుడు పెంచుతోంది. ఆన్లైన్ గ్రోసరీ (కిరాణా, ఆహారోత్పత్తులు ఇతరత్రా) మార్కెట్లో మరింత మార్కెట్‌ను చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. బిగ్‌బజార్, నీల్గిరీస్ బ్రాండ్లతో సూపర్మార్కెట్లను నిర్వహిస్తున్న ఫ్యూచర్ రిటైల్‌లో అమెజాన్ పాగా వేసేందుకు సిద్ధమైంది. 9.5 శాతం మైనారిటీ వాటాను అమెజాన్ కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. ఫ్యూచర్ రిటైల్ ఇప్పటికే స్టాక్ మార్కెట్లో లిస్టయింది. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఫ్యూచర్ రిటైల్ విలువ దాదాపు రూ.25వేల కోట్లు. 9.5 శాతం వాటా కోసం అమెజాన్ కొంచెం అటూఇటుగా రూ.2,500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు తెలియవచ్చింది. ఫ్యూచర్ రిటైల్‌కు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,100కు పైగా స్టోర్లు ఉన్నాయి. చర్చలు పూర్తయ్యాయని, కొద్ది రోజుల్లోనే ఒప్పందం కుదురుతుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ‘విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ (ఎఫ్‌పీఐ) మార్గంలో అమెజాన్ ఈ 9.5 శాతం వాటా కొనుగోలు చేయనుంది. ఫ్యూచర్ రిటైల్ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తర్వాత బహుశా ఈ నెల 14న డీల్‌ను ప్రకటించే అవకాశాలున్నాయి’ అని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఇటు ఫ్యూచర్ రిటైల్, అటు అమెజాన్ ఈ వార్తలపై నేరుగా స్పందించలేదు. జనవరిలో బీజం... కిశోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూప్‌లో ఫ్యూచర్ రిటైల్ ప్రధానమైన కంపెనీ. ఇది రెండేళ్ల కిందట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చెందిన హెరిటేజ్ ఫుడ్స్‌ను కొనుగోలు చేసింది. ప్రస్తుతం హెరిటేజ్‌కు ఫ్యూచర్ రిటైల్‌లో 3.65 శాతం వాటా కూడా ఉంది. ఈ ఏడాది జనవరిలోనే ఫ్యూచర్ రిటైల్‌లో వాటా తీసుకోవాలని అమెజాన్ భావించింది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను కిశోర్ బియానీ స్వయంగా సీటెల్‌లోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో కలిశారు కూడా. తర్వాత ఇరు కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు పలుమార్లు సమావేశమై చర్చలు జరిపారు. ప్రస్తుతం మల్టీబ్రాండ్ రిటైల్‌లో 49 శాతం వరకూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) భారత్ అనుమతిస్తోంది. దీంతో అమెజాన్ ఎఫ్‌పీఐ మార్గంలో దేశీ కంపెనీల భాగస్వామ్యంతో పెట్టుబడులకు మొగ్గుచూపుతోంది. ఇప్పటికే షాపర్స్ స్టాప్‌లో 5 శాతం వాటాను అమెజాన్‌కు చెందిన విదేశీ ఇన్వెస్ట్మెంట్ అనుబంధ సంస్థ ఎఫ్‌పీఐ మార్గంలోనే కొనుగోలు చేసింది. ఏదైనా భారతీయ కంపెనీలో విదేశీ సంస్థలు సింగిల్ కంపెనీ ద్వారా 10 శాతం వాటాను ఎఫ్‌పీఐ రూట్లో కొనుగోలు చేయొచ్చు. అదేవిధంగా భారతీయ కంపెనీలు 49 శాతం వరకూ వాటాను బహుళ ఎఫ్‌పీఐలకు విక్రయించుకునే అవకాశం ఉంది. ఇటీవలే ఆదిత్య బిర్లా రిటైల్ నుంచి మోర్ సూపర్ మార్కెట్లను సమారా క్యాపిటల్‌తో కలిసి అమెజాన్ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ వాటా కూడా అమెజాన్ ఎఫ్‌పీఐ రూట్లోనే కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ దాదాపు రూ.4,200 కోట్లు. ఇక్కడ సమారా క్యాపిటల్ 51 శాతం, అమెజాన్ 49 శాతం వాటాను దక్కించుకున్నప్పటికీ... సాంకేతికంగా చూస్తే మోర్‌పై పూర్తి నియంత్రణ అమెజాన్ చేతికి వచ్చింది. ఆన్‌లైన్‌కు ఆఫ్‌లైన్ దన్ను... మోర్ కొనుగోలు ద్వారా అమెజాన్‌కు దాదాపు 500కు పైగా సూపర్ మార్కెట్ స్టోర్లు అందుబాటులోకి వచ్చాయి. ఆన్లైన్లో దూసుకెళ్తున్న అమెజాన్... ఆఫ్‌లైన్‌ను ఉపయోగించుకోవటానికి దీనిద్వారా మార్గం సుగమమయింది. ఫ్యూచర్ రిటైల్‌లో పెట్టుబడి కూడా ఇలాంటిదేనని రిటైల్ కన్సల్టెన్సీ సంస్థ వాజిర్ అడ్వయిజర్స్ వ్యవస్థాపకుడు హర్మిందర్ సాహ్ని వ్యాఖ్యానించారు. ఈ వాటా కొనుగోలు ద్వారా అమెజాన్‌కు ఫ్యూచర్ గ్రూప్ భారీ ఆఫ్‌లైన్ నెట్వర్క్, గిడ్డంగులు, సరఫరా వ్యవస్థ ఇతరత్రా సదుపాయాలన్నీ అందుబాటులోకి వస్తాయని.. దీంతో ఆన్లైన్ బిజినెస్‌లో మరింత దూసుకెళ్లేందుకు వీలవుతుందని ఆయన విశ్లేషించారు. అత్యంత భారీ మార్కెట్ ఉన్న భారత గ్రోసరీ, ఆహారోత్పత్తుల మార్కెట్లో దూసుకెళ్లాలంటే ఆఫ్‌లైన్ కూడా కీలకం కావడంవల్లే అమెజాన్ ఈ దిశగా అడుగులు వేస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటికే అమెజాన్ ప్యాంట్రీ, అమెజాన్ నౌ ద్వారా ఆన్లైన్ ఫుడ్, గ్రోసరీల్లో అమెజాన్ ప్రవేశించింది. భారత్‌లో 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించిన అమెజాన్ తాజాగా ఆహార రంగంలో 50 కోట్ల డాలర్ల పెట్టుబడి ప్రతిపాదనకు ప్రభుత్వ ఆమోదాన్ని కూడా పొందింది. ఊరిస్తున్న మార్కెట్.. దేశంలో 95 శాతం రిటైల్ అమ్మకాలన్నీ ఇప్పటికీ సూపర్ మార్కెట్లు, కిరాణా స్టోర్ల ద్వారానే జరుగుతున్నాయి. ఇక కిశోర్ బియానీ ఫ్యూచర్ రిటైల్‌కు దేశవ్యాప్తంగా బలమైన నెట్‌వర్క్‌తో పాటు బిగ్‌బజార్ వంటి ప్రధానమైన బ్రాండ్ ఉంది. ఆహార, ఆహారేతర ఉత్పత్తులను విక్రయిస్తూ లాభాల్లో ఉన్న ఈ సంస్థలో పెట్టుబడి తమ ‘ఫ్యూచర్’కు కీలమని అమెజాన్ బలంగా విశ్వసిస్తోంది. ప్రధానంగా ఫ్యూచర్ రిటైల్‌కు దుస్తులు, జనరల్ వస్తువులు, లగేజ్, ఫుట్‌వేర్ విభాగాల్లో చాలా పట్టుంది. 340 నగరాల్లో మొత్తం 14.8 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో రిటైల్ స్టోర్లను ఫ్యూచర్ రిటైల్ నిర్వహిస్తోంది. దీనికితోడు 50 కోట్ల మేర కస్టమర్ల డేటా కూడా ఫ్యూచర్ గ్రూప్ వద్ద ఉండటం అమెజాన్‌కు కలిసొచ్చే అంశమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. భారత్ ఆన్లైన్ రిటైల్ రంగంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న విభాగాలు ఫుడ్, గ్రోసరీలేనని మోర్గాన్ స్టాన్లీ ఇటీవలే పేర్కొంది. 2020 నాటికి ఈ విభాగం వార్షికంగా 141 శాతం చక్రీయ వృద్ధిని నమోదు చేస్తుందని.. మార్కెట్ విలువ 15 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది. మొత్తం ఆన్లైన్ రిటైల్ అమ్మకాల్లో ఇది 12.5 శాతమని కూడా లెక్కగట్టింది. కాగా, మన రిటైల్ మార్కెట్ ప్రస్తుతం 672 బిలియన్ డాలర్లుగా ఉండగా.. 2020 నాటికల్లా 1.1 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. ఇంతలా ఊరిస్తున్న ఈ భారీ మార్కెట్‌ను ఆన్లైన్, ఆఫ్లైన్ల ద్వారా కొల్లగొట్టడమే లక్ష్యంగా ఇప్పుడు అంతర్జాతీయ రిటైల్ దిగ్గజాలు భారత్‌పై గురిపెట్టాయి. ఇదిలా ఉండగా.. ప్రధాన ప్రత్యర్థి ఫ్లిప్‌కార్ట్‌ను అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ దక్కించుకోవడం కూడా ఆమెజాన్ దూకుడు పెంచేందుకు ప్రధాన కారణ మని భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే బలమైన ఆఫ్‌లైన్ నెట్వర్క్ ఉన్న వాల్‌మార్ట్‌తో పోటీపడాలంటే అమెజాన్‌కు ఈ పెట్టుబడులు తప్పనిసరి. దీనికి అనుగుణంగానే అమెరికాలో కూడా అమెజాన్ హోల్ ఫుడ్స్‌ను దాదాపు 14.5 బిలియన్ డాలర్లతో చేజిక్కించుకోవడం గమనార్హం. స్పెన్సర్పైనా గురి... ఆర్పీ సంజీవ్ గోయెంకా గ్రూప్ కంపెనీ అయిన స్పెన్సర్ రిటైల్‌పైనా ఆన్లైన్ కంపెనీల కన్ను పడింది. దీనిలో వాటా కొనుగోలుపై అమెజాన్‌తో పాటు ఆలీబాబా (పేటీఎం మాల్ ద్వారా) కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పేటీఎం మాల్ బిగ్‌బాస్కెట్‌లో వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టింది. ఈ మేరకు స్పెన్సర్ యాజమాన్యంతో అమెజాన్ ఇప్పటికే చర్చలు కూడా జరిపినట్లు సం బంధిత వర్గాలు వెల్లడించాయి. 1996లో రిటైల్ రంగంలోకి అడుగుపెట్టిన స్పెన్సర్స్‌కు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 35 నగరాల్లో 120 సూపర్ మార్కెట్ స్టోర్లు, 37 హైపర్ స్టోర్లు ఉన్నాయి. మరోపక్క, రిలయన్స్ రిటైల్‌లో వా టా కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో... ఇప్పుడు ఆలీబాబా స్పెన్సర్‌పై దృష్టి పెట్టునట్లు తెలుస్తోంది. పేటీఎం మాల్లో ఆలీబాబా కీలక వాటాదారు కావడం గమనార్హం. -
కార్డు చెల్లింపులు 75 శాతానికి...
స్పెన్సర్స్ ఈడీ రాహుల్ నాయక్.. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెద్ద నోట్ల రద్దు తర్వాత కార్డుతో చెల్లింపులు పెరిగాయని స్పెన్సర్స్ రిటైల్ తెలిపింది. రద్దుకు ముందు వరకు మెట్రో నగరాల్లోని తమ ఔట్లెట్లలో 60% ఉన్న కార్డు పేమెంట్లు ప్రస్తుతం 75%కి చేరాయని కంపెనీ ఈడీ రాహుల్ నాయక్ ఆదివారం చెప్పారు. ఇక్కడి బోరుునపల్లిలో స్పెన్సర్స్ హైపర్ మార్కెట్ ప్రారంభోత్సవం సందర్భంగా కోస్టల్ ఏపీ, హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ ఎస్.ఎం.రామనాథన్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. డిజి టల్ పేమెంట్ సౌకర్యం ఉన్న కారణంగా పెద్ద ఔట్లెట్లలో కస్టమర్ల తాకిడి గణనీయంగా పెరిగిందన్నారు. ఇక దేశవ్యాప్తంగా 122 స్టోర్లకుగాను హైపర్ మార్కెట్ల సంఖ్య 38కి చేరుకుందని వివరించారు. హైదరాబాద్‌లో 18 ఔట్లెట్లలో 5 హైపర్ స్టోర్లున్నాయని అన్నారు. హైదరాబాద్‌లో ఏటా 2-3 కేంద్రాలు నెలకొల్పుతున్నట్టు తెలిపారు. -
ఆన్‌లైన్‌లోకి స్పెన్సర్స్ రిటైల్!
తెలంగాణ, ఏపీలో మరో 3 హైపర్ స్టోర్లు కంపెనీ వైస్ ప్రెసిడెంట్ రామనాథన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిటైల్ రంగ సంస్థ స్పెన్సర్స్ ఆన్లైన్ విక్రయాల్లోకి అడుగు పెట్టాలని భావిస్తోంది. ఆఫ్‌లైన్‌తోపాటు ఆన్‌లైన్‌లోకి కూడా విస్తరించాలన్నది ఆలోచన అని స్పెన్సర్స్ రిటైల్ వైస్ ప్రెసిడెంట్ ఎస్.ఎమ్.రామనాథన్ తెలిపారు. ఎప్పుడు కొత్త వేదికలోకి ప్రవేశించేదీ ఇప్పుడే చెప్పలేనని అన్నారు. హైదరాబాద్ మల్కాజిగిరిలో 30,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన హైపర్ స్టోర్‌ను శుక్రవారం ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆగస్టుకల్లా హైదరాబాద్‌లో మరో రెండు, డిసెంబర్‌కల్లా విజయవాడలో మరొక హైపర్ స్టోర్ రానుందని చెప్పారు. అన్ని జిల్లా కేంద్రాల్లో భవిష్యత్తులో ఔట్లెట్లు నెలకొల్పుతామన్నారు. స్టోర్‌ను ఎక్కడ, ఎంత సామర్థ్యంతో నెలకొల్పేదీ సమగ్ర అధ్యయనం తర్వాతే నిర్ణయం తీసుకుంటున్నామన్నారు.ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ విచ్చేశారు. 10 శాతం పెరిగిన వ్యయం..: గతేడాదితో పోలిస్తే స్పెన్సర్స్ కస్టమర్ సగటు కొనుగోలు వ్యయం హైదరాబాద్‌లో 10% పెరిగింది. వినియోగం గణనీయంగా అధికమైందని, ధరలు కూడా హెచ్చడం ఇందుకు కారణమని రామనాథన్ తెలిపారు. ‘వ్యవస్థీకృత రంగ స్టోర్లలో ఆఫర్లకుతోడు ఉత్పత్తులు అందుబాటు ధరలో ఉంటాయన్న భావన కస్టమర్లలో పెరిగింది. సంఘటిత రంగంలో రిటైల్ స్టోర్ల విస్తృతి ఏడాదిలో 3 నుంచి సుమారు 7 శాతానికి ఎగసింది’ అని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం స్పెన్సర్స్ 36 హైపర్, సూపర్ స్టోర్లను నిర్వహిస్తోంది.