
ముషీరాబాద్: క్యారీ బ్యాగ్ కోసం వసూలు చేసిన మూడు రూపాయలను కొనుగోలు తేదీ నుంచి పిటిషనర్‌కు తిరిగి చెల్లించే వరకు 9శాతం వడ్డీతో కలిపి ఇవ్వాలని స్పెన్సర్స్ రిటైల్ లిమిటెడ్‌ను హైదరాబాద్ రెండవ వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. ఫిర్యాదు దారుడికి రూ.10వేల నష్టపరిహారం, ఖర్చుల నిమిత్తం రూ.6వేలు చెల్లించాలని కమిషన్ అధ్యక్షుడు వక్కంటి నర్సింహారావు, సభ్యులు పారుపల్లి జవహర్‌బాబు తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళ్తే... 2019 జూన్ 2వ తేదీన ఫిర్యాదుదారుడు వడ్డె ఆనంద్‌రావు వస్తువుల కొనుగోలుకు అమీర్‌పేట స్పెన్సర్స్ సూపర్‌మార్కెట్‌కు వెళ్లారు.
రూ.101 బిల్లుకు అదనంగా కవర్ కోసం రూ.3 వసూలు చేసి లోగో ఉన్న కవర్ అందించారు. ఫిర్యాదుదారుడు అభ్యంతరం తెలిపినా ఫలితం లేకపోవడంతో ఆయన వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. తరువాత ఆ మాల్‌ను మూసేసినా, పట్టువదలలేదు. కమిషన్ ఆదేశాలతో పత్రికలో ప్రకటన ఇచ్చి, రెండవ ప్రతివాదిగా స్పెన్సర్స్‌ను మళ్లీ కేసులో ఇంప్లీడ్ చేసి విజయం సాధించారు. కాగా.. క్యారీ బ్యాగుల అమ్మకానికి ఉద్దేశించిన ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్ 15ను 2018లో తొలగించారు. ఈ నేపథ్యంలో క్యారీ బ్యాగులకు అదనంగా డబ్బులు వసూలు చేయకుండా లీగల్ మెట్రాలజీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ శాఖలు సూపర్ మార్కెట్స్, షాపింగ్ మాల్స్‌కు తగిన ఆదేశాలు జారీ చేయాలని కమిషన్ తీర్పులో పొందుపరిచింది. ఖచ్చితంగా అమలు జరిగేలా చూడాలని ఉత్తర్వుల్లో పేర్కొంటూ తీర్పు కాపీలను ప్రతివాదికి పంపాలని కార్యాలయానికి సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment