వినియోగదారులకు సరైన సేవలు అందివ్వడంలో విఫలమైన ఇన్సురెన్సు కంపెనీపై కన్సుమర్ ఫోరమ్ కన్నెర్ర చేసింది. పాలసీదారుడు నష్టపోయిన సొమ్మును వడ్డీతో చెల్లించడంతో పాటు సకాలంలో సేవలు అందించకుండా మానసిక క్షోభకు గురి చేసిందుకు నష్టపరిహారం చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
2018లో పాలసీ
హైదరాబాద్ నగరానికి చెందిన హితేశ్ కుమార్ కేడియా అనే వ్యాపారి స్పాంజ్ ఐరన్ వ్యాపారంలో ఉన్నాడు. తన స్పాంజ్ ఐరన్ స్టాక్‌కి సంబంధించిన విషయంలో న్యూ ఇండియా అశ్యురెన్స్ కంపెనీలో బీమా పాలసీ 2018 ఫిబ్రవరి 25న తీసుకున్నాడు. పాలసీ సమయంలోనే అకస్మాత్తుగా మంటలు సంభవించినప్పుడు నష్టపరిహారం పొందే హక్కు కలిగి ఉండే విధంగా పాలసీ చేశాడు.
అగ్నిప్రమాదం
హితేశ్ కుమార్ గోదాములో సుమారు రూ. 20 కోట్ల రూపాయల విలువైన స్పాంజ్ ఐరన్ స్టాకు నిల్వ చేసిన సమయంలో 2018 అక్టోబరు 5వ తేదిన అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటల కారణంగా సుమారు రూ.79 లక్షల రూపాయల విలువైన స్టాకు కాలిపోయింది. అయితే ఈ ప్రమాద ఘటనకు సంబంధించి నష్ట పరిహారం చెల్లించేందుకు బీమా కంపెనీ నిరాకరించింది.
కన్సుమర్ ఫోరం
ఇన్సురెన్సు కంపెనీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హితేశ్ కుమార్ కేడియా హైదరాబాద్ కన్సుమర్ ఫోరమ్ -1లో కేసు ఫైలు చేశాడు. ఇరు పక్షాల వాదనలు విన్న కన్సుమర్ ఫోరం ఇన్సురెన్సు కంపెనీని తప్పు పట్టింది. సకాలంలో సేవలు అందివ్వడంలో విఫలం చెందారంటూ మొట్టికాయులు వేసింది.
45 రోజుల్లోగా
కన్సుమర్ ఫోరం ఆదేశాల ప్రకారం ప్రమాదంలో హితేశ్ కుమార్ నష్టపోయిన స్టాకు విలువ రూ.79 లక్షలను వడ్డీ సహా చెల్లించాలని ఆదేశించింది. అంతేకాదు ఇంత కాలం సేవల్లో లోపం చేస్తూ వినియోగదారుడిని ఇబ్బంది పెట్టినందుకు రూ. 3 లక్షలు జరిమాన విధించింది. కోర్టు ఖర్చులకు సంబంధించిన రూ.20 వేలు కూడా ఇవ్వాలంది. ఈ మొత్తాలను తీర్పు వెలువడినప్పటి నుంచి 45 రోజుల్లోగా చెల్లింపులు పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment