ఎస్‌ఎంఈలతో సమావేశం సందర్భంగా అమెజాన్ ఇండియా హెడ్ అమిత్ అగర్వాల్‌తో సెల్ఫీ దిగుతున్న బెజోస్
న్యూఢిల్లీ: అటు ప్రభుత్వ వర్గాలు, ఇటు చిన్న వ్యాపారుల నుంచి విమర్శలు ఎదురవుతున్నప్పటికీ.. అమెరికాకు చెందిన ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ భారత్‌లో కార్యకలాపాలను గణనీయంగా విస్తరించే యోచనలోనే ఉంది. ఇందులో భాగంగా భారత పర్యటనకు వచ్చిన సంస్థ సీఈవో జెఫ్ బెజోస్ భారీ ప్రణాళికలను ప్రకటించారు. వచ్చే అయిదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. ఐటీ, నైపుణ్యాల అభివృద్ధి, కంటెంట్ క్రియేషన్, రిటైల్, లాజిస్టిక్స్, తయారీ తదితర రంగాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ కొత్త కొలువులు రానున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో ఆయన వివరించారు. గత ఆరేళ్లుగా భారత్‌లో పెట్టుబడులతో కల్పించిన ఏడు లక్షల ఉద్యోగాలకు ఇవి అదనమని బెజోస్ పేర్కొన్నారు.
ఉద్యోగ కల్పన, నైపుణ్యాల్లో శిక్షణకు భారత ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న క్రమంలో తమ వంతు తోడ్పాటు అందించాలని భావిస్తున్నట్లు అమెజాన్ పేర్కొంది. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీరింగ్ మొదలు కస్టమర్ సపోర్ట్ దాకా అన్నివిభాగాల్లోకి అవసరమైన నిపుణులను రిక్రూట్ చేసుకోవడానికి కొత్త పెట్టుబడులు ఉపయోగపడగలవని వివరించింది. చిన్న, మధ్య తరహా సంస్థ(ఎస్‌ఎంఈ) లు ఆన్‌లైన్ బాట పట్టేలా తోడ్పాటు అందించేందుకు సుమారు రూ. 7,000 కోట్ల మేర ఇన్వెస్ట్ చేయనున్నట్లు, 2025 నాటికి 10 బిలియన్ డాలర్ల విలువ చేసే మేడిన్ ఇండియా ఉత్పత్తులను ఎగుమతి చేయనున్నట్లు బెజోస్ ఇప్పటికే ప్రకటించారు.
వ్యాపారులకు వృద్ధి అవకాశాలు ..
2014 నుంచి భారత్‌లో అమెజాన్ తమ ఉద్యోగుల సంఖ్యను నాలుగు రెట్లు పెంచుకుంది. గతేడాది హైదరాబాద్‌లో భారీ క్యాంపస్‌ను ఏర్పాటు చేసింది. అమెరికా తర్వాత అమెజాన్ క్యాంపస్‌లో ఇదే అత్యంత పెద్ద క్యాంపస్. తాజాగా పెట్టబోయే పెట్టుబడులు.. 5.5 లక్షల పైచిలుకు చిన్న, మధ్య స్థాయి వ్యాపారులకు మరిన్ని వృద్ధి అవకాశాలు తెచ్చిపెట్టగలవని అమెజాన్‌డాట్‌ఇన్ వెబ్‌సైట్‌లో రాసిన ఒక పోస్ట్‌లో బెజోస్ పేర్కొన్నారు. ‘ఇక్కడికి వచ్చిన ప్రతిసారీ భారత్‌పై నాకున్న ఇష్టం మరింత రెట్టింపవుతూ ఉంటుంది. అపరిమితమైన ఉత్సాహం, కొత్త ఆవిష్కరణలు, భారతీయుల మొక్కవోని దీక్ష నాకు స్ఫూర్తినిస్తుంటాయి‘ అని ఆయన రాశారు. అనుచిత వ్యాపార విధానాలు పాటిస్తున్నాయంటూ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లపై కాంపిటీషన్ కమిషన్ విచారణకు ఆదేశించిన తరుణంలో బెజోస్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
పరిశ్రమ వర్గాలతో బెజోస్ భేటీ..
శుక్రవారంతో ముగిసిన 3 రోజుల భారత పర్యటనలో బెజోస్ పలువురు వ్యాపార దిగ్గజాలతో భేటీ అయ్యారు. వీరిలో రిలయన్స్ అధిపతి ముకేశ్ అంబానీ, గోద్రెజ్ గ్రూప్ చైర్మన్ ఆది గోద్రెజ్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణమూర్తి, ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్, భారతీ ఎయిర్‌టెల్ చీఫ్ సునీల్ మిట్టల్, ఫ్యూచర్ గ్రూప్ అధినేత కిశోర్ బియానీ తదితరులు ఉన్నారు.
చట్టాలకు లోబడే విదేశీ పెట్టుబడులు ఉండాలి: మంత్రి గోయల్
చట్టాలకు లోబడే అన్ని రకాల విదేశీ పెట్టుబడులను స్వాగతిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ‘అహ్మదాబాద్ డిజైన్ వీక్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. మరోవైపు, భారీ పెట్టుబడులు పెట్టడం ద్వారా భారత్‌కు అమెజాన్ గొప్ప ఉపకారమేమీ చేయడం లేదంటూ తానుచేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను అమెజాన్‌కు వ్యతిరేకంగా మాట్లాడానంటూ కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని.. నిబంధనల మేరకే పెట్టుబడులు ఉండాలని చెప్పాలన్నది తన ఉద్దేశమని గోయల్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment