
ఇషా అంబానీ (ఫైల్ ఫోటో)
ముంబై : బిలీనియర్ ముఖేష్ అంబానీ, నీతా అంబానీల ఏకైక కుమార్తె ఇషా అంబానీ త్వరలోనే బిజినెస్ టైకూన్ అజయ్ పిరమల్ కొడుకు ఆనంద్ పిరమల్‌ను మనువాడబోతున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితమే ఈ వార్త బయటికి వెల్లడించారు ఇరు కుటుంబ వర్గాలు. ఈ శుభ సమయాన్ని ఇరు కుటుంబాలు ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశాయి. ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్‌ల ఎంగేజ్‌మెంట్ పార్టీని ముఖేష్ అంబానీ ఫ్యామిలీ అధికారికంగా సోమవారం నిర్వహించింది. ఈ వేడుకకు బాలీవుడ్ ప్రముఖులు, క్రికెట్ దిగ్గజాలు హాజరయ్యారు. వేడుకలో హాజరైన వారిలో సచిన్ టెండూల్కర్, కరణ్ జోహార్, అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, రణబీర్ కపూర్‌లు ఉన్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, భార్య నీతా అంబానీలు దగ్గరుండి మరీ అతిథులను స్వాగతించారు. ఈ డిసెంబర్‌లో ఇషా, ఆనంద్‌ల వివాహం చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇషా సోదరుడు ఆకాశ్ అంబానీ పెళ్లి కూడా ఇటీవలే రసెల్ మెహతా కూతురు శ్లోకా మెహతతో నిశ్చయమైన సంగతి తెలిసిందే. కుదిరితే ఈ ఇరు జంటల వివాహం ఒకేసారి అంబానీ కుటుంబం నిర్వహించనుంది. కవలలైన ఇషా, అంబానీల పెళ్లిళ్లు నిశ్చయమవడంతో, అంబానీ ఇంట పెళ్లి సందడి నెలకొంది. కాగా, ఇషాకు ఎంతో కాలంగా స్నేహితుడైన ఆనంద్, మహాబలేశ్వరం ఆలయంలో ఆమెకు ప్రపోజ్ చేయగా, ఇషా అంగీకరించడం... వెంటనే ఇరు కుటుంబాలు ఓ విందు కార్యక్రమం ఏర్పాటుచేయడం జరిగింది. ఈ విందు కార్యక్రమంలో ముకేశ్ అంబానీ ఆయన భార్య నీతా అంబానీ, ఆనంద్ తల్లిదండ్రులు అజయ్, స్వాతిలతోపాటు ఇషా నానమ్మ, అమ్మమ్మలు కోకిలాబెన్ అంబానీ, పూర్ణిమాబెన్ దలాల్, సోదరులు ఆకాశ్, అనంత్‌లు పాల్గొన్నారు. ఆనంద్ సోదరి నందిని ఇతర కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరైనట్టు తెలిసింది. కుటుంబ సభ్యుల విందు అనంతరం ముఖేష్ అంబానీ గ్రాండ్‌గా ముంబైలో ఈ ఎంగేజ్‌మెంట్ పార్టీ నిర్వహించారు.









Comments
Please login to add a commentAdd a comment