న్యూఢిల్లీ: హైదరాబాద్ నగరానికి మరోసారి గుర్తింపు లభించింది. స్వల్ప కాలంలో వృద్ధి పరంగా అంతర్జాతీయంగా టాప్ 30 నగరాల్లో మొదటి స్థానంలో నిలిచింది. బెంగళూరు రెండో స్థానంలో ఉండగా, పుణె 4, కోల్‌కతా 5, ఢిల్లీ 8, చెన్నై 14, ముంబై 20వ స్థానంలో ఉన్నట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ జేఎల్‌ఎల్ (జోన్స్ లాంగ్ లాసల్లే) తెలిపింది. భారత నగరాలు స్వల్పకాలంలో వృద్ధిని సూచించే జేఎల్‌ఎల్ సిటీ ‘మూమెంటమ్ ఇండెక్స్ 2018’లో ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి.
ఈ సూచీ పట్టణాల ఆర్థిక వృద్ధి, రియల్టీ మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ర్యాంకులను కేటాయిస్తుంది. చాలా వేగంగా వృద్ధి చెందుతున్న 30 పట్టణాలను ఈ సూచీలోకి చేర్చింది. మానవ వనరులు, అనుసంధానత, రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్రాపర్టీ ధరలు, ఆర్థిక ఉత్పాదకత, కార్పొరేట్ కార్యకలాపాలు, నిర్మాణం, రిటైల్ విక్రయాల్లో భారత నగరాలు మెరుగైన పనితీరు ప్రదర్శించాయి. ‘‘షార్ట్ టర్మ్ మూమెంటమ్ ర్యాంకుల్లో భారత్ తన పూర్వ వైభవాన్ని కొనసాగించింది.
అంతర్జాతీయంగా జనాభా, ఆర్థిక వృద్ధి పరంగా భారత నగరాలు అధిక రేటును నమోదు చేశాయి. మౌలిక రంగంలో పెట్టుబడులు, సులభతర వ్యాపార నిర్వహణ కోసం ప్రభుత్వం చేస్తున్న యత్నాలు ఈ విషయంలో తోడ్పడ్డాయి’’ అని జేఎల్‌ఎల్ నివేదిక పేర్కొంది. దీర్ఘకాలం పాటు తమ వృద్ధిని కొసాగించేందుకు గాను ఈ నగరాలు భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా మార్కెట్లను తీర్చిదిద్దాలని, నివాసయోగ్యత, అందుబాటు ధరలు, నియంత్రణల్లో పారదర్శకతపై దృష్టి పెట్టాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment