ఆపిల్ కు చైనాలో మరో షాక్
టెక్ దిగ్గజం యాపిల్ కు రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనాలో షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఏప్రిల్ లో ఐ బుక్స్, ఐ ట్యూన్స్ మూవీస్ సర్వీసులపై నిషేధం, మేలో ఐఫోన్ 6, 6 ప్లస్ అమ్మకాలు చేపట్టొదంటూ కోర్టు ఆర్డర్ ఇవన్నీ కోలుకోలేని దెబ్బలుగా పరిణమించాయి. తాజాగా మరో కేసు యాపిల్ కు వ్యతిరేకంగా నమోదైంది. 20 ఏళ్ల క్రితం చిత్రీకరించిన చారిత్రాత్మక వీడియోను యాపిల్ యాప్ స్టోర్లలో అందుబాటులో ఉంచినందుకు చైనా బ్రాడ్ కాస్టింగ్ రెగ్యులేటరీ సబ్సిడరీ, యాపిల్ పై దావా వేసింది. ఈ ఫిల్మ్ ను బ్రాడ్ కాస్ట్ చేయడానికి ఎక్స్ క్లూజివ్ ఆన్ లైన్ రైట్లను యాపిల్ అతిక్రమించిందని ప్రొడక్షన్ సెంటర్ ఆరోపిస్తూ కేసు దావా వేసినట్టు బీజింగ్ కోర్టు పేర్కొంది.
1930 లో ఉత్తర చైనాలో జపనీస్ సైనికులకు వ్యతిరేకంగా జరిగిన చైనా యుద్ధాన్ని "బ్లడీ ఫైట్ విత్ ది ఫియర్స్ ఎనిమీ" పేరుతో చిత్రీకరించారు. ఈ ఫిల్మ్ ను మొదటిసారి 1994లో బ్రాడ్ కాస్ట్ చేశారు. అయితే ఈ ఫిల్మ్ ను బ్రాడ్ కాస్ట్ చేయడంలో ఆన్ లైన్ ఎక్స్ క్లూజివ్ రైట్లను అతిక్రమించి, యాపిల్ యాప్ స్టోర్లలో అందుబాటులో ఉన్న "యూకు హెచ్ డీ యాప్" ద్వారా అందుబాటులో ఉంచింది. ఈ ఫిల్మ్ బ్రాడ్ కాస్ట్ చేయడం భారీ ఆర్థిక నష్టాలకు కారణమవుతుందని ఆరోపిస్తూ యాపిల్ పై మూవీ శాటిలైట్ చానెల్ ప్రొగ్రామ్ ప్రొడక్షన్ సెంటర్ కోర్టులో దావా వేసింది. అదేవిధంగా "యూకు హెచ్ డీ యాప్" ను డెవలప్ చేసి, ఆపరేట్ చేస్తున్న హాయి ఇన్ ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ లిమిటెడ్ పై కూడా ఈ దావా నమోదుచేసింది.
ఈ రెండు కంపెనీలు వెంటనే ఆ ఫిల్మ్ ను బ్రాడ్ కాస్ట్ చేయడం ఆపాలని, నష్టపరిహారంగా 7,500 డాలర్లు(రూ.5,03,920), సహేతుక వ్యయం కింద 3,000 డాలర్లు(రూ.2,01,568) చెల్లించాలని ప్రొడక్షన్ సెంటర్ కోరింది. ఎక్స్ క్లూజివ్ రైట్లను అతిక్రమించడం వెంటనే బంద్ చేసే ఆదేశాలు జారీచేయాలని ప్రొడక్షన్ సెంటర్ కోరినట్టు కోర్టు వెల్లడించింది. దీంతో యాపిల్ కు చైనాలో ఒక కేసు తర్వాత ఒక కేసు చిక్కులు తెచ్చి పెడుతోంది.