నోట్ల రద్దు ప్రభావాన్ని కొండంతలుగా చెప్పారు..!
⇒ అదంతా తప్పని తాజా జీడీపీ గణాంకాలు తేల్చాయ్
⇒ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ...
న్యూఢిల్లీ: నోట్ల రద్దు ప్రతికూల ప్రభావం గోరంతను కొండంతగా చెప్పారని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. వీటిల్లో ఎంతమాత్రం నిజం లేదని మంగళవారంనాడు విడుదలైన మూడవ త్రైమాసిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలు స్పష్టం చేశాయన్నారు. 3వ త్రైమాసికంలో 7 శాతం జీడీపీ వృద్ధి నమోదయిన సంగతి తెలిసిందే. ద్వైమాసిక వాణిజ్యం పురోగతి లక్ష్యంగా ఐదు రోజులపాటు బ్రిటన్‌లో పర్యటించిన జైట్లీ బుధవారం భారత్‌కు తిరిగి వచ్చారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, నోట్ల రద్దు వల్ల వృద్ధి స్వల్పకాలంలో మందగించినా... ‘వీ’ షేప్ (వేగవంతమైన రికవరీ) తథ్యమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. వ్యవస్థలో నోట్ల సరఫరా మెరుగుపడుతున్న కొలదీ... అదే రీతిలో వృద్ధీ ఊపును అందుకుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఆయన పేర్కొన్న అంశాల్లో ముఖ్యమైనవి చూస్తే...
⇒ రెవెన్యూ (పన్ను వసూళ్లు) గణాంకాలు వృద్ధికి వాస్తవిక సూచికలని నేను తరచూ పేర్కొంటూనే ఉన్నా. డీమోనిటైజేషన్ వల్ల అప్పటికప్పుడు నగదు ఆధారిత రంగాలకు కొంత ఇబ్బంది వచ్చినా... వేగవంతంగా రికవరీ అవుతూ బాట పట్టాయి.
⇒ సంఘటిత ఆర్థిక రంగంతో అసంఘటిత ఆర్థిక రంగం చేరువకావడానికీ పెద్ద నోట్ల రద్దు దోహదపడింది.
⇒ తయారీ, వ్యవసాయ రంగాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధికి దోహదపడే అంశాలు. ఇక వ్యవస్థలో ఒక పక్క ద్రవ్య సరఫరా మెరుగుపడుతుంటే, మరోపక్క ఆర్థిక క్రియాశీలత, డిమాండ్ క్రమంగా పుంజుకుంటున్నాయి.
⇒ బ్రిటన్‌లో నేను విభిన్న పారిశ్రామిక బృందాలతో సమావేశమయ్యాను. నేను సమావేశం అయిన పారిశ్రామిక వేత్తలు అందరూ భారత్ వృద్ధి తీరుపట్ల పూర్తి సానుకూలంగా ఉన్నారు. ప్రపంచ అనిశ్చిత ఆర్థిక పరిస్థితిలోనూ వృద్ధి విషయంలో భారత్ ప్రత్యేక పాత్రను పోషిస్తున్నట్లు బ్రిటన్ పారిశ్రామిక వర్గాలు విశ్వసిస్తున్నాయి. భారత్‌తో వాణిజ్య సంబంధాల పురోగతికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు వారు తెలిపారు.