హెచ్చుతగ్గుల మార్కెట్, ముగింపులో లాభాలు | Sensex, Nifty gain 1% led by financials ahead of Fed meet | Sakshi
Sakshi News home page

హెచ్చుతగ్గుల మార్కెట్, ముగింపులో లాభాలు

Published Wed, Mar 18 2015 12:41 AM | Last Updated on Tue, Oct 2 2018 4:19 PM

హెచ్చుతగ్గుల మార్కెట్, ముగింపులో లాభాలు - Sakshi

హెచ్చుతగ్గుల మార్కెట్, ముగింపులో లాభాలు

 ముంబై: సానుకూలమైన అంతర్జాతీయ పరిణామాలతో స్టాక్ మార్కెట్లు ఈ వారంలో మొదటి సారి లాభాల బాట పట్టాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ పెరగడం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కరంట్ అకౌంట్ లోటు జీడీపీలో 1 శాతానికే పరిమితమవ్వచ్చన్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆశాభావం తదితర అంశాలు  ప్రభావం చూపాయి.  చాలా షేర్లు కనిష్ట స్థాయిల్లో లభ్యమవుతుండటంతో కొనుగోళ్లు జరిగి స్టాక్ మార్కెట్ ముగింపులో పెరిగిందని విశ్లేషకులంటున్నారు. అయితే ఆద్యంతం ట్రేడింగ్ ఒడిదుడుకులమయంగా సాగింది.  చివరకు బీఎస్‌ఈ సెన్సెక్స్ 299 పాయింట్ల, నిఫ్టీ 90 పాయింట్లు చొప్పున పెరిగాయి.
 
 ఫెడ్ రిలీఫ్...
 సోమవారం ముగింపు(28,438 పాయింట్లు)తో పోల్చితే లాభాల్లోనే బీఎస్‌ఈ సెన్సెక్స్ ప్రారంభమైంది. గత వారం భయపడినట్లుగా కాక ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను అనుకున్న విధంగానే జూన్ నుంచి పెంచుతుందన్న అంచనాలు స్టాక్ మార్కెట్ ప్రారంభ లాభాలకు తోడ్పడ్డాయి.  సెన్సెక్స్ 345 పాయింట్లు లాభపడింది. అయితేమధ్యాహ్నాం కల్లా  ఆ లాభాలన్నింటినీ కోల్పోయింది. 28,435 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది.  చివరల్లో కోలుకొని 297 పాయింట్ల లాభంతో  28,736 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 90 పాయింట్లు(1.04 శాతం) లాభంతో 8,723కు చేరింది. ఫార్మా, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్‌ఎంసీజీ, కన్సూమర్ డ్యూరబుల్స్, రిఫైనరీ, లోహ, బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. కొన్ని ఐటీ, టెక్నాలజీ షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. పన్నెండు బీఎస్‌ఈ రంగాల వారీ సూచీల్లో పది లాభాల్లోనే ముగిశాయి. 30 సెన్సెక్స్ షేర్లలో 23 షేర్లు లాభపడ్డాయి. 1,432 షేర్లు నష్టాల్లో, 1,381 షేర్లు లాభాల్లో ముగిశాయి. టర్నోవర్ ఎన్‌ఎస్‌ఈలో రూ.19,139 కోట్లుగా, డెరివేటివ్స్ విభాగంలో రూ.2,99,037 కోట్లుగా నమోదైంది.
 
 క్యాపిటల్ మార్కెట్‌లో లావాదేవీలు
 బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ, ఎంసీఎక్స్-ఎస్‌ఎక్స్ ట్రేడింగ్
 విభాగం    తేదీ         కొనుగోలు    అమ్మకం    నికర విలువ
 డీఐఐ :    17-03    1,371    1,614    - 244    
     16-03    1,469    1,311    159    
 ఎఫ్‌ఐఐ:    17-03    5,123    4,858    266    
     16-03    4,583    5,345    - 763
         (విలువలు రూ.కోట్లలో)
 
 2018 నాటికి 54,000కు సెన్సెక్స్  బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ అంచనా
 ప్రస్తుతం 28,736 పాయింట్లుగా ఉన్న బీఎస్‌ఈ సెన్సెక్స్ మూడేళ్లలో 2018 నాటికి 54,000 పాయింట్లకు చేరుతుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ అంచనా వేస్తోంది. అయితే సమీప భవిష్యత్తులో అంతర్జాతీయ పరిణామాలకనుగుణంగా మార్కెట్ సూచీలు కొంత కరెక్షన్‌కు గురువుతాయని పేర్కొంది. రోడ్లు, రైల్వేలు, రక్షణ రంగాల్లో పెట్టుబడి వ్యయం పెరుతుందని, ఇది స్టాక్ మార్కెట్‌కు అది పెద్ద సానుకూల చర్య అని  వివరించింది. దీంతో సెన్సెక్స్  మూడేళ్లలో మరో 25 వేల పాయింట్లు లాభపడి 54,000 పాయింట్లకు చేరుతుందని మెరిల్ లించ్ తన  నివేదికలో పేర్కొంది. వాహన, బ్యాంక్, సిమెంట్, చమురు, ఫార్మా షేర్లు రాణిస్తాయని వివరించింది.
 
 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆస్తుల విలువ రెట్టింపు...
 న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆస్తుల విలువ ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి రెట్టింపై రూ.3 లక్షల కోట్లకు పెరిగింది. స్టాక్ మార్కెట్ మంచి రాబడులను ఇస్తున్న నేపథ్యంలో రిటైల్ ఇన్వెస్టర్లు ఈక్విటీ స్కీమ్‌ల్లో భారీగా ఇన్వెస్ట్ చేస్తుండడమే దీనికి కారణం. 2014, ఫిబ్రవరి నాటికి రూ.1.57 లక్షల కోట్లుగా ఉన్న ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌ల నిర్వహణ ఆస్తుల విలువ ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి రూ.3.07 కోట్లకు పెరిగిందని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఏఎంఎఫ్‌ఐ)  పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఫిబ్రవరి కాలానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 31 శాతం వృద్ధిని సాధించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement