బయోకాన్ ఛైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా (ఫైల్ ఫోటో)
సాక్షి, ముంబై : కోవిడ్-19 మహమ్మారి సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన చర్యలు కేవలం ఆర్థిక మనుగుడకు సరిపోతాయని బయోకాన్ ఛైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా వ్యాఖ్యానించారు. ఈ సమయంలో డిమాండ్‌ను సృష్టించే పెద్ద అవకాశాన్నికోల్పోయామంటూ తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు కొనుగోళ్లు పెరగాలంటే జీఎస్‌టీ తగ్గింపులు అవసరమని షా చెప్పారు. కొనుగోలును ప్రోత్సహించడానికి స్వల్ప కాలిక ఉపశమనం లభించాలనీ, కనీసం మూడు-ఆరునెలలు పాటు జీఎస్‌టీ భారాన్ని తగ్గించాలన్నారు. (మనమే మాయం చేశాం..సిగ్గుతో తలదించుకోవాలి!)
సరఫరా కోసం ద్రవ్యత లభ్యతను సృష్టించుకున్నాం..కానీ ఆర్థిక పునరుజ్జీవనంలో చాలా ముఖ్యమైన భాగం డిమాండ్ పరిస్థితి ఏంటి అని ఆమె ప్రశ్నించారు. డిమాండ్ పుంజుకోకపోతే ఆర్థిక పునరుజ్జీవనం సాధ్యం కాదనే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో మనం పెద్ద అవకాశాన్ని కోల్పోయామని షా అభిప్రాయపడ్డారు. అంతేకాదు ఉద్యోగుల వేతనాలన్నింటినీ చెల్లించమని అన్ని పరిశ్రమలను కోరడం అన్యాయమన్నారు. డిమాండ్ లేక కుదేలైన సంస‍్థలకు ఇది కష్టమన్నారు. పరిశ్రమలు పూర్తి కార్యకలాపాలను తిరిగి ప్రారంభించకపోతే..తాము మరిన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వుంటుందన్నారు. (కరోనా : ఉద్యోగులపై వేటు, క్లౌడ్ కిచెన్స్‌కు బ్రేక్)
మరోవైపు కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్ కాలంలో వలస కార్మికుల దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంక్షోభ సమయంలో వారి మానాన వారిని వదిలివేయడం అవమానకరమని, దీనికి అందరమూ సిగ్గు పడాలన్నారు. అభివృద్ధి చెందాలని భావిస్తున్న దేశ సౌభాగ్యానికి ఇది మంచిది కాదన్నారు. పేదలకు సామాజిక భద్రత ప్రాముఖ్యాన్ని గురించి నొక్కిచెప్పిన షా, కనీస ప్రాతిపదిక ఆదాయాన్ని ప్రకటించాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. (వలస వెతలు: కంటతడి పెట్టించే వీడియోలు)
ఉద్దీపన ప్యాకేజీ సానుకూలతల గురించి మాట్లాడుతూ సంస్కరణల పరంగా వ్యవసాయం మంచి ప్రోత్సాహం లభించిందని కిరణ్ మజుందార్ షా భావించారు. అయినప్పటికీ, ఆధునికీకరణ పరంగా వారికి ఇంకా ఎక్కువ ప్రోత్సాహకాలు లభించాలన్నారు. అలాగే గ్రామీణాభివృద్ధికి ఎంఎస్‌ఎంఈ రంగానికి ప్రోత్సాహకాలు లభించాయని షా తెలిపారు. దీంతోపాటు కరోనా వైరస్ కేసుల సంఖ్య కంటే మరణాల రేటుపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. తాను ఎప్పుడూ చెబుతున్నట్టుగానే, పెరుగుతున్న కేసుల గురించి భయపడకుండా మెరుగైన చికిత్సలు, ఔషధాలు, రోగుల నిర్వహణతో వైరస్‌ను మ్యానేజ్ చేయాలని ఆమె సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment