
నా ప్రతిష్టను దెబ్బతీసేందుకు యత్నాలు
న్యూఢిల్లీ: నిరాధార ఆరోపణలతో తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వక ప్రయత్నాలు జరిగాయని టాటా గ్రూప్ తాత్కాలిక చైర్మన్ రతన్ టాటా వ్యాఖ్యానించారు. చెప్పే నీతులను ఆచరించే అలవాటు లేని కొందరు వ్యక్తులు.. తమ గ్రూప్ విలువలను, నైతికతను సవాల్ చేస్తున్నారని పేర్కొన్నారు. గ్రూప్ సంస్థల ఉద్యోగులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ రాసిన లేఖలో .. ఆయన ఎవరి పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించకుండా, పరోక్ష విమర్శలు చేశారు.
గడిచిన మూడు నెలలుగా సంక్షోభ సమయంగా గడించింద ని, టాటా గ్రూప్‌తో పాటు కొందరి వ్యక్తిగత ప్రతిష్టను మసకబార్చేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు జరిగాయని టాటా తెలిపారు. టాటా గ్రూప్ 150వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో గడచిన పరిణామాలన్నింటినీ పక్కన పెట్టి.. వివిధ రంగాల్లో టాటా గ్రూప్ ఆధిపత్యం కొనసాగించేందుకు ఉద్యోగులు కృషి చేయాలని టాటా సూచించారు.