జోడు కుదిరింది..! | attracting sun glasses | Sakshi
Sakshi News home page

జోడు కుదిరింది..!

Published Wed, Feb 26 2014 1:19 AM | Last Updated on Sat, Sep 2 2017 4:05 AM

జోడు కుదిరింది..!

జోడు కుదిరింది..!

     ఏటా కళ్లజోళ్ల వ్యాపారం రూ. 21 వేల కోట్లు
     లైఫ్ స్టైల్‌లో భాగమైన కళ్లద్దాలు
     యువత, చిన్నారుల భాగస్వామ్యమే ఎక్కువ
 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గతంలో కళ్లజోడు అంటే 60 ఏళ్లపైబడిన వారికి మాత్రమే అవసరమైన వస్తువు. కానీ, నేడది ఆరేళ్ల పిల్లాడి నుంచి అరవై ఏళ్ల పైబడిన వారికి కూడా నిత్యావసర వస్తువుగా మారింది. ఇంకా చెప్పాలంటే మనిషి జీవితంలో కళ్లద్దాలు భాగమై పోయాయి కూడా. ఎంతలా మారిందంటే ఏటా అక్షరాలా రూ.21 వేల కోట్ల వ్యాపారం జరిగేంతలా. కాంటాక్ట్ లెన్సులు, ఇంట్రాక్యులర్ లెన్సులు, లెన్స్ క్లీనింగ్ సొల్యూషన్స్, ఫ్రేములు, సన్ గ్లాసులు.. వంటి కళ్లజోళ్ల మార్కెట్ దేశవ్యాప్తంగా ఎంతుందనే అంశంపై ఇటీవల అసోచామ్ ఓ సర్వే నిర్వహించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రూ.21 వేల కోట్ల వ్యాపారం జరుగుతుందని సర్వేలో తేలింది. 2015 చివరినాటికి ఇది రూ.43 వేల కోట్లకు చేరుకుంటుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
 
 సెల్‌ఫోన్, ఏటీఎం, క్రెడిట్ కార్డుల్లాగే కళ్లద్దాలు కూడా నగరవాసుల జేబుల్లో తప్పనిసరిగా ఉండాల్సిన వస్తువుగా మారింది. నిజం చెప్పాలంటే కాలుష్యం విపరీతంగా ఉండే మెట్రో నగరాల్లో అయితే కళ్లద్దాలు నిత్యావసర వస్తువే. దుమ్ము, ధూళి, గాలి వంటి వాటి నుంచి కళ్లకు రక్షణ  కవచంలా ఉంటుండడంతో చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ కళ్లద్దాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ‘‘గతంలో కంటి సమస్యలు తీవ్రమైతే తప్ప ఆసుపత్రులకు వచ్చే వారు కాదు. కానీ ఈ మధ్య కాలంలో కళ్ల రక్షణ, నేత్రదానం వంటి వాటిపై ప్రజల్లో విస్తృతమైన అవగాహన కలిగింది. దీంతో ఏ చిన్నపాటి కంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుల్ని సంప్రదిస్తున్నార ని’’ సరోజిని దేవీ కంటి ఆసుపత్రి కంటి వైద్యుడు రవీందర్ గౌడ్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు చెప్పారు. మా ఆసుపత్రికి వచ్చే వారిలో చిన్నపిల్లలు 10-20% ఉండగా, యువత 50% ఉంటారని చెప్పారాయన.
 
 మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలితో 40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ కంటి చూపు మందగిస్తుందన్నారు. అందుకే 40 ఏళ్లు దాటి కంటి సమస్యతో ఆసుపత్రికి వచ్చిన ప్రతి ఒక్కరికీ కళ్లద్దాలను వినియోగించాలని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో ఏటా కళ్లద్దాల వినియోగం గణనీయంగా పెరుగుతుంది. ‘‘ఏటా రూ.2.40 లక్షల వ్యాపారం జరుగుతుండగా.. ఇందులో 40% యువత, 20% చిన్నపిల్లల కళ్లద్దాలను విక్రయిస్తున్నామని’ భైరవ్ ఆప్టికల్స్ ఎండీ కేతన్ చెప్పారు. గతం లో కళ్లద్దాల గ్లాసులను వాటి జీవితకాలంలో రెండు సార్లకు మించి మార్చేవారు కాదు. కానీ ఇప్పుడు ఏడాదికోమారు మారుస్తున్నారు. ఇందులో యువత  అయితే ఏడాదికోసారి, వృద్ధులైతే రెండు మూడేళ్లకోసారి మారుస్తున్నారని చెప్పారు.
 
 యువత, పిల్లలే ఎక్కువ..: కళ్లద్దాల వినియోగంలో యువత, చిన్నపిల్లలే ఎక్కువగా ఉంటున్నారు. కంప్యూటర్లు, టీవీల ప్రభావంతో రోజురోజుకూ కళ్లద్దాల వినియోగం పెరుగుతోంది. దీనికి తోడు మెట్రో నగరాల్లో దుమ్ము, ధూళి వంటి కాలుష్యమూ కారణమవుతోంది. హైదరాబాద్‌లో 2,500లకు పైగానే కళ్లద్దాల దుకాణాలున్నాయి. ఇందులో 30 వేల మందికి పైగానే పనిచేస్తున్నారు. నగరంలో మొత్తం కళ్లద్దాల వ్యాపారంలో 70 శాతం కళ్లద్దాలు అమ్ముడవుతుండగా 30 శాతం కాంటాక్ట్ లెన్స్‌ల వ్యాపారముంటోంది. కాంటాక్ట్ లెన్స్‌ల వినియోగంలో 10-20% యువత ఉంటుందని కేతన్ చెప్పారు. కళ్లజోడుతో పనిలేకుండా కనుగుడ్డుపై సులువుగా అమర్చుకునేవి కాంటాక్ట్ లెన్స్‌లు. వీటిలో రోజుకు, నెలకు, ఏడాదికోమారు మార్చుకునేవీ ఉంటాయి. యువత వీటిపై మక్కువ చూపుతున్నారు. 100 మంది కస్టమర్లలో 15 మంది వీటిని కోరుతున్నారన్నారు. వీటిని వాడుతున్న కస్టమర్ సగటు వయసు 15 ఏళ్లంటే అతిశయోక్తి కాదు. జత రూ.80కే లభిస్తుండటం విశేషం. కళ్లజోళ్ల మార్కెట్‌ను విభాగాల వారీగా చూస్తే సన్‌గ్లాసులు 13%, కాంటాక్ట్ లెన్స్‌లు 4%, ఇంప్లాంటెబుల్ కాంటాక్ట్ లెన్స్ 16%, లసిక్ 5%, ఫ్రేములు 11%,  కళ్లద్దాల లెన్స్‌లు 51%గా ఉంటుందన్నారాయన. లెగసీ, రెబాన్, వాక్, పోలిస్, యునెటైడ్ కలర్ బెనటన్, ఐడీ, ఫాస్ట్‌ట్రాక్ వంటి దేశ, విదేశీ బ్రాండ్లు యువతను ఎక్కువగా ఆక ర్షిస్తున్నాయి.
 
 ఊరిస్తున్న మార్కెట్...

     దేశంలో ఏటా కళ్లద్దాల మార్కెట్ 30%, కాంటాక్ట్ లెన్స్ మార్కెట్ 25% వృద్ధి చెందుతోందని అసోచామ్ నివేదిక పేర్కొంది.
 
     ఏటా కళ్లద్దాల వ్యాపారం రూ.8,500 కోట్లు, కాం టాక్ట్ లెన్స్‌లు రూ.700 కోట్లు, కళ్లద్దాల లెన్స్‌లు రూ.45 కోట్లు, సన్‌గ్లాసులు రూ. 2,200 కోట్లు, కళ్లద్దాల ఫ్రేములు రూ.5,200 కోట్ల మార్కెట్ జరుగుతుందని అంచనా.
 
 రేటెంతైనా ఓకే..
 కళ్లద్దాల ఎంపికలో రేటెంతైనా నగరవాసులు లెక్కచేయట్లేదు. కళ్లజోడులో వాడే అద్దాన్ని రెసిలియెన్స్, పాలీకొర్బొనేట్, ట్రైవిక్స్, ప్లాస్టిక్‌తో పాటు గాజుతో తయారుచేస్తారు. వీటి ధర రూ.100 నుంచి లక్షకు పైగానే ఉం టుంది. ఇక ఫ్రేముల్లో హాఫ్, రిమ్‌లెస్, షెల్ వంటివి ఉన్నాయి. ఆసియా బ్రాండ్లయితే రూ. 500 నుంచి రూ. 10 వేలకు పైన, అంతర్జాతీయ బ్రాండ్లయితే రూ.4 వేల నుంచి రూ.5 లక్షల వరకు పలుకుతున్నాయి. స్పోర్టీ, ఏవియేటర్, వేవ్ ఫై వెరైటీలతో సన్‌గ్లాసులు రూ.2 లక్షల వరకు లభిస్తున్నాయి. ఇందులో యూవీ ప్రొటెక్టివ్ పోలరైజ్డ్, డే అండ్ నైట్, పవర్ సన్‌గ్లాసెస్ వంటి వెరైటీలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement