సాక్షి, న్యూఢిల్లీ : ఆటోమేషన్‌తో భారత్‌లో 9 శాతం మంది ఉద్యోగులు తమ కొలువులు కోల్పోతారని ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డేవిడ్ లిప్టన్ అంచనా వేశారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనమిక్ రీసెర్చ్ (ఎన్‌సీఏఈఆర్) నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆటోమేషన్ ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 14 శాతం మంది అంటే దాదాపు 37.5 కోట్ల మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోతారని అన్నారు. తక్కువ వేతనాలు, అధిక కార్మికులు అవసరమైన పరిశ్రమల్లో ఆటోమేషన్ కారణంగా ఉద్యోగాలు పోయే పరిస్థితి అధికంగా ఉంటుందని లిప్టన్ హెచ్చరించారు.
బడ్జెట్‌లో భారత్ పలు ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని పెంచడం ద్వారా పోటీతత్వంపై ప్రభావం ఉంటుందని, సమ్మిళిత ఆర్థిక వ్యవస్థకు ఇది విఘాతం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. స్వల్పకాలంలో పోటీతత్వం కొంత ఇబ్బందికరమే అయినా దీర్ఘకాలంలో కంపెనీలు స్వతంత్రంగా ఎదిగేందుకు ఇది దోహదపడుతుందని అన్నారు. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ వృద్ధి రేటు మందగించిందని, దీని ప్రభావం ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే భారత్‌పై పరిమితంగానే ఉంటుందని అంచనా వేశారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు న్యాయ, రెగ్యులేటరీ పరమైన చిక్కులను తొలగించాలని అన్నారు. గ్రామీణ వినిమయం తగ్గడం, ఎగుమతుల వృద్ధి పతనమవడం, నిరుద్యోగం దేశ ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులుగా మారాయని చెప్పుకొచ్చారు. కరెంట్ ఖాతా లోటుపై భారత్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దాన్ని పూడ్చుకునేందుకు మూలధన నిధులను ఆకర్షించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment