పన్ను ఆదాకు ఉపకరించే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్‌ఎస్‌ఎస్) పథకాల్లో యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ మంచి పనితీరును కనబరుస్తోంది. ఈ పథకంలో చేసే పెట్టుబడులు మూడేళ్ల పాటు లాకిన్ అయి ఉంటాయి. మూడేళ్ల తర్వాతే ఉపసంహరణకు అనుమతిస్తారు. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు ఈఎల్‌ఎస్‌ఎస్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసి పన్ను మినహాయింపు పొందొచ్చు.
ముఖ్యంగా ఈఎల్‌ఎస్‌ఎస్ విభాగంలో ఈ పథకం పనితీరు టాప్ క్వార్టయిల్‌లో ఉంటోంది. ఇది ప్రధానంగా లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది. చక్కని పనితీరు చూపించడం వల్లే ఈ పథకం నిర్వహణలోని ఇన్వెస్టర్ల నిధులు రూ.17,000 కోట్లకు చేరాయి. ఇంకో విషయం ఏమిటంటే ఈఎల్‌ఎస్‌ఎస్ పథకాల్లో అతి తక్కువ ఎక్స్‌పెన్స్ రేషియో కలిగిన పథకం ఇది. డైరెక్ట్ ప్లాన్‌లో ఎక్స్‌పెన్స్ రేషియో కేవలం 1.07 శాతమే కావడం గమనార్హం.
పనితీరు, పెట్టుబడుల విధానం
2009 చివర్లో ఈ పథకం ప్రారంభమైంది. అప్పటి నుంచి చూసుకుంటే ప్రామాణిక సూచీ బీఎస్‌ఈ 200 ఇచ్చిన రాబడుల కంటే ఈ పథకం రాబడులే ఎక్కువగా ఉన్నాయి. ఏడాది కాలంలో ఈ పథకం రాబడులు 18.2 శాతం. ప్రామాణిక సూచీ రాబడులు 13.5 శాతమే. మూడేళ్ల కాలంలో 14.3 శాతం, ఐదేళ్ల కాలంలో వార్షికంగా 24.2 శాతం చొప్పున రాబడులను అందించింది. కానీ, మూడేళ్ల కాలంలో బీఎస్‌ఈ 200 రాబడులు 13.3 శాతం, ఐదేళ్ల కాలంలో 16.5 శాతంగానే ఉన్నాయి.
2011 బేర్ మార్కెట్లో, 2013, 2015 ఆటుపోట్ల సమయంలో లేదా 2012, 2014, 2017 ర్యాలీ సమయాల్లో ఈ పథకం పనితీరు మెరుగ్గా ఉంది. 2011 మార్కెట్ల పతనంలో సురక్షితమైన కన్జూమర్ నాన్ డ్యురబుల్స్‌లో ఎక్కువ ఇన్వెస్ట్ చేసింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వెంటనే సైక్లికల్ రంగాల స్టాక్స్‌ను కొనుగోలు చేయడంతో 2012 ర్యాలీలోనూ పాల్గొనగలిగింది. బుల్ మార్కెట్ల సమయంలో మిడ్‌క్యాప్ స్టాక్స్‌లో 20 శాతం పెట్టుబడులు పెట్టింది.
ఒక్క 2016లోనే ఈ పథకం పనితీరు కాస్త తడబడింది. ఈక్విటీల్లో 98 శాతం వరకు ఇన్వెస్ట్ చేయడమే కారణం. అలాగే, ఫార్మా రంగం ప్రతికూలతలు ఎదుర్కొంటుంటే ఆ స్టాక్స్‌లో పెట్టుబడులను 11–12 శాతం స్థాయిలో కొనసాగించడంతో పనితీరుపై ప్రభావం పడింది. ఈ అనుభవంతో ఇటీవలి మార్కెట్ కరెక్షన్ నేపథ్యంలో ఈక్విటీలో ఎక్స్‌పోజర్‌ను 93–95 శాతానికి పరిమితం చేసింది.
రంగాలకు ప్రాధాన్యం...
వృద్ధి ఆధారిత పెట్టుబడుల విధానాన్ని ఈ పథకం అనుసరిస్తుంది. దాదాపుగా బ్లూచిప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో కరెక్షన్ నేపథ్యంలో వీటిలో పెట్టుబడులను 10 శాతానికే పరిమితం చేసింది. బ్యాంకులు, ఫైనాన్స్ రంగాల స్టాక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగానే రంగాలకు ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment