ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. క్యూ1లో స్టాండెలోన్ నికర లాభం 53 శాతం క్షీణించి రూ. 528 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన సైతం నికర లాభం రూ. 1012 కోట్ల నుంచి రూ. 396 కోట్లకు పడిపోయింది. ఇక మొత్తం ఆదాయం 60 శాతం వెనకడుగుతో రూ. 3079 కోట్లను తాకింది. పన్నుకు ముందు లాభం 60 శాతం తక్కువగా రూ. 682 కోట్లకు చేరింది. కరోనా వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డవున్‌లను అమలు చేయడంతో కంపెనీ వాహన విక్రయాలు మందగించినట్లు ఫలితాల విడుదల సందర్భంగా కంపెనీ యాజమాన్యం తెలియజేసింది. క్యూ1లో బజాజ్ ఆటో 4.43 లక్షల వాహనాలను మాత్రమే విక్రయించింది. గతేడాది(2019-20) క్యూ1లో 12.47 లక్షల వాహనాలను అమ్మగలిగింది. ఇబిటా మార్జిన్లు 14.3 శాతంగా నమోదయ్యాయి.
రూ. 14,232 కోట్లు
జూన్‌కల్లా కంపెనీ చేతిలో నగదు, తత్సమాన నిల్వలు రూ. 14,232 కోట్లుగా నమోదయ్యాయి. ద్విచక్ర వాహన విక్రయాలు 6.11 లక్షల నుంచి రూ. 1.86 లక్షల వాహనాలకు తగ్గినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ విభాగంలో ఎగుమతులు సైతం 4.72 లక్షల వాహనాల నుంచి 2.14 లక్షలకు నీరసించినట్లు తెలియజేసింది. ఇక వాణిజ్య విభాగంలో వాహన విక్రయాలు 86,000 నుంచి 5,300కు తగ్గాయి. ఎగుమతులు సైతం 78,000 నుంచి తగ్గి 38,000 వాహనాలకు పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బజాజ్ ఆటో షేరు ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 2 శాతం నష్టంతో రూ. 2955 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 2907 దిగువకూ పతనమైంది.
Comments
Please login to add a commentAdd a comment