Bajaj Auto Limited
-
పల్సర్ బైకా? మజాకా..రూ.35 వేల కోట్ల ఆస్తి..ఎవరా హీరో?
యూత్ డ్రీమ్ బైక్ ఏదీ అంటే పల్సర్ బైక్ ఒకటి అని కచ్చితంగా చెప్పవచ్చు. అలాంటి ఐకానిక్ పల్సర్ బైక్‌ను భారత దేశంలో పరిచయం చేసిన బిలియనీర్, రాహుల్ బజాజ్ కుమారుడు రాజీవ్ బజాజ్. కుటుంబ వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చిన రాజీవ్ బజాజ్ పల్సర్ లైన్ మోటార్ బైక్‌లను లాంచ్ చేసిన ఘనతను సొంతం చేసుకున్నారు. యువతరం అభిరుచులకు అనుగుణంగా ఇవి రావడంతో బజాజ్ కష్టతరమైన వ్యాపారాన్ని మలుపు తిప్పింది. బజాజ్ ఆటో సీఎండీ రాజీవ్ నికర విలువ తదితర విశేషాలు తెలుసుకుందాం! (తండ్రికే షాకిస్తున్న ఇషా: మురిసిపోతున్న అంబానీ) ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ పెద్ద కుమారుడు. 90వ దశకం చివరలో తన కుటుంబ వ్యాపారంలో చేరినప్పుడు, దేశీయ తిరుగులేని ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ కష్టాల్లో ఉంది. అంతర్జాతీయ జాయింట్ వెంచర్ కంపెనీలచే తయారైన మోటార్‌సైకిళ్లను నెమ్మదిగా కోల్పోతోంది. ఈ సమయంలో రాజీవ్ తన సొంత మోటార్‌సైకిళ్లను తయారీపై ఫోకస్ పెట్టారు. అలా బజాజ్ పల్సర్ మార్కెట్లోకి వచ్చింది. ఇక అప్పటినుంచి టూ వీలర్ మార్కెట్లో దూసుకుపోతున్నారు. (కొత్త సేఫ్టీ ఫీచర్లు, షాకింగ్ ధర: 2023 టయోటా వెల్ఫైర్) ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ బజాజ్ ఆటో. మహాత్మా గాంధీ ఆరాధకుడైన జమ్నాలాల్ బజాజ్ (రాజీవ్ ముత్తాత) 1926లో ఈ సంస్థను స్థాపించారు. ఆతరువాత దివంగత రాహుల్ బజాజ్( రాజీవ్ తండ్రి) ఫిబ్రవరి 2022లో మరణించే వరకు ప్రముఖ బజాజ్ గ్రూప్‌కు ఎమెరిటస్ ఛైర్మన్‌గా పనిచేశారు. 2001లో భారత ఆర్థిక వ్యవస్థ తిరోగమనం, స్టాక్ మార్కెట్ పతనం ఇది కంపెనీపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. ఒకదశలో బజాజ్ ఆటో త్వరలో మూసివేయబడుతుందని అంచనాలుకూడా వచ్చాయి. ప్రస్తుతం సీఎండీగా రాజీవ్ కంపెనీని విజయ పథంలో నడిపిస్తున్నారు. కంపెనీ కొత్త లాంచింగ్స్, టెక్నాలజీని అందిపుచ్చుకుని కంపెనీని అభివృద్ధిలో నడిపిస్తున్నారు. ద్విచక్ర వాహనం, బజాజ్‌ఫిన్ సర్వ్(ఆర్థిక సేవలు), ఎలక్ట్రికల్ ఉపకరణాల పరిశ్రమలతో సహా 40 వ్యాపారాలు ఈ రోజు బజాజ్ గ్రూప్‌లో ఉన్నాయి. రాజీవ్ బజాజ్ ఎవరు? 1966 డిసెంబర్ 21న రాజీవ్ బజాజ్ జన్మించారు. 2005లో బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కష్టాల్లో ఉన్న వ్యాపారాన్ని మలుపు తిప్పిన ఘనతను సాధించిన పల్సర్ లైన్ మోటార్‌బైక్‌లతో పాటు తాజాగా ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు) సహా కొత్త ఉత్పత్తులతో ప్రతిభను చాటు కుంటున్నారు. పూణేలోని అకుర్డిలో, రాజీవ్ బజాజ్ సెయింట్ ఉర్సులా ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. ఆ తరువాత 1988లో పూణే విశ్వవిద్యాలయం మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీని, 1990లో వార్విక్ విశ్వవిద్యాలయం నుండి మాన్యుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు బజాజ్ ఆటోకు తయారీ, సరఫరా గొలుసు (1990-95), R&D,ఇంజనీరింగ్ (1995-2000), మార్కెటింగ్ అండ్ సేల్స్ (2000-2005) విభాగాల్లో సేవలందించారు. ఏప్రిల్ 2005 నుండి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఫోర్బ్స్ ప్రకారం 2022లో రాజీవ్ బజాజ్ నికర విలువ రూ. 35,600 కోట్లు (4.3 బిలియన్లు డాలర్లు). రాజీవ్‌కు యోగా అన్నా హోమియోపతీ వైద్య విధానం అన్నా చాలా ఇష్టమట. రాజీవ్ బజాజ్‌కి ఇష్టమైన సినిమా సన్నివేశాలలో ఒకటి చాలా ఆసక్తి కరం. 2004 నాటి హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ట్రాయ్ మూవీ ప్రారంభ సన్నివేశం అంటే ఇష్టం. ఈ దృశ్యాన్ని తన సహోద్యోగులకు చూపించి మరీ కంపెనీని ముందుకు తీసుకుపోయేలా ప్రోత్సహిస్తారట. గొప్ప యోధునిగా గుర్తుంచుకోవడానికి గ్రీకు యోధుడు ఎచిల్లీస్ (బ్రాడ్‌పిట్ హీరో) పడిన తపనను గుర్తు చేసేవారట. బజాజ్ ఫిన్సర్వ్ లిమిటెడ్ ఛైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్, రాజీవ్ సోదరుడు సంజీవ్ కూడా బిలియనీరే. రాహుల్ బజాజ్ చిన్న కుమారుడు సంజీవ్ బజాజ్దక్షిణ ముంబైలోని అత్యంత విలాసవంతమైన రూ.104 కోట్ల విలువైనఅపార్ట్మెంట్లను కొనుగోలు చేయడం విశేషం. భారతదేశంలోని అత్యంత సంపన్న కుటుంబాలలో బజాజ్ కుటుంబం ఒకటి. ఆ బ్యాంకును దోచుకోక తప్పదు రాయల్ ఎన్ఫీల్డ్ ఆధిపత్య సెగ్మెంట్లో పోటీపై స్పందించిన రాజీవ్ ప్రముఖ అమెరికన్ దొంగ విలియం సుట్టన్ ఉదాహరణతో తన కంపెనీ ఎత్తుగడలను సమర్థించుకోవడం గమనార్హం. అమెరికాలో విలియం ఫ్రాన్సిస్ సుట్టన్ అనే ప్రసిద్ధ బ్యాంకు దోపిడీదారుడున్నాడు. మీరు బ్యాంకును ఎందుకు దోచుకుంటున్నారు అని అడిగినప్పుడు డబ్బు అక్కడే ఉంది కాబట్టి అని చెబుతాడు.. అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ డబ్బు ఎక్కడ ఉంటే ఆ బ్యాంకును దోచుకోవడం తప్ప తమకు వేరే మార్గం లేదని చెప్పుకొచ్చారు రాజీవ్ బజాజ్. (విలియం ఫ్రాన్సిస్ సుట్టన్ నలభై సంవత్సరాలలో రెండు మిలియన్ డాలర్లకు పైగా దోచుకున్నాడు) రాహుల్ బజాజ్ 1965లో రాహుల్ బజాజ్ బజాజ్ గ్రూప్ పగ్గాలు చేపట్టిన సంవత్సరానికి కొత్త శిఖరాలకు చేర్చారు. బజాజ్ ఆటో ఆదాయం రూ.72 మిలియన్ల నుండి రూ.46.16 బిలియన్లకు పెరిగింది. భారతదేశంలోని అత్యుత్తమ సంస్థల్లో ఒకదానిగా తీర్చిదిద్దడంలో ఆయనకృషి చాలా ఉంది. ఫోర్బ్స్ ఇండియా ప్రకారం దేశంలోని 20వ అత్యంత సంపన్నుడిగా నిలిచారు. రాహుల్‌బజాజ్ 2002లో, దేశీయ మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్‌ను అందుకున్నారు. 83 ఏళ్ల వయసులో 2022 లో ఆయన కన్నుమూశారు. -
ఎలక్ట్రిక్ వెహికల్స్‌పై బజాజ్ ఫోకస్
ముంబై: ద్విచక్ర వాహన దేశీ దిగ్గజం బజాజ్ ఆటో ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి పుణేలోని ఆక్రుడి వద్ద కొత్త ప్లాంటును నెలకొల్పనుంది. ఇందుకు రూ. 300 కోట్ల పెట్టుబడులను వెచ్చించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ప్లాంటు నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలియజేసింది. వార్షికంగా 5 లక్షల వాహన తయారీ సామర్థ్యంతో యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. దేశ, విదేశీ మార్కెట్లలో వాహనాలను విక్రయించనున్నట్లు తెలియజేసింది. 50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంగల ఈ ప్లాంటు నుంచి తొలి వాహనం 2022 జూన్‌కల్లా వెలువడవచ్చని వివరించింది. కంపెనీ గత సుప్రసిద్ధ బ్రాండ్ చేతక్ స్కూటర్ తయారీ ప్రాంతమిది. తాజా ప్లాంటులో 800 మందికి ఉపాధిని కల్పిస్తున్నట్లు బజాజ్ ఆటో వెల్లడించింది. 2001లో పల్సర్ బ్రాండుతో బైకును ప్రవేశపెట్టి విజయవంతమైన విషయం విదితమే. ఒక ఐసీఈ ప్లాట్‌ఫామ్‌ను మినహాయిస్తే.. మిగిలిన ఆర్అండ్డీ ప్రస్తుతం భవిష్యత్‌కు తగిన ఈవీ సొల్యూషన్ల అభివృద్ధిపై దృష్టిపెట్టినట్లు కంపెనీ పేర్కొంది. పట్టణ ప్రయాణాలలో తేలికపాటి ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండు కొనసాగుతుందన్న తమ విశ్వాసానికి అనుగుణంగా ప్రస్తుత కార్యకలాపాలు ప్రారంభమైనట్లు కంపెనీ ఎండీ రాజీవ్ బజాజ్ వివరించారు. కాగా.. తాజా ప్లాంటుకు మద్దతుగా ఆటో విడిభాగాల సరఫరాదారులు సైతం మరో రూ.250 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలియజేశారు. కొత్త ప్లాంటును ఆధునిక రోబోటిక్, ఆటోమేటెడ్ తయారీ వ్యవస్థలతో ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. ఈవీ ప్లాంటు వార్తల నేపథ్యలో బజాజ్ ఆటో షేరు బీఎస్ఈలో దాదాపు 3 శాతం జంప్‌చేసి రూ. 3,262 వద్ద ముగిసింది. -
ఎలక్ట్రిక్ వాహన రంగంలో బజాజ్ ఆటో లిమిటెడ్ భారీగా పెట్టుబడులు!
పూణే: ఎలక్ట్రిక్ వాహన రంగంలో తన సత్తా ఏంటో చూపించేందుకు బజాజ్ ఆటో లిమిటెడ్ సిద్దం అవుతుంది. పూణేలో సరికొత్త ఎలక్ట్రిక్ వాహన ప్లాంట్ ఏర్పాటు కోసం ₹300 కోట్ల(40 మిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు బజాజ్ ఆటో లిమిటెడ్ ప్రకటించింది. ఈ ప్లాంట్ సంవత్సరానికి 5,00,000 ఎలక్ట్రిక్ వాహనలను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని సంస్థ పేర్కొంది. ఈ ప్రదేశం(అకుర్ది, పూణే)లోనే బజాజ్ అసలు చేతక్ స్కూటర్ తయారు చేశారు. పూణేలోని తన రాబోయే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కర్మాగారంలో 'అత్యాధునిక రోబోటిక్, ఆటోమేటెడ్' తయారీ వ్యవస్థలను మోహరించనున్నట్లు బజాజ్ ఆటో తెలిపింది. లాజిస్టిక్స్, మెటీరియల్ హ్యాండ్లింగ్, ఫ్యాబ్రికేషన్ & పెయింటింగ్, అసెంబ్లీ & క్వాలిటీ అస్యూరెన్స్ నుంచి ప్రతిదీ ఆటోమేటెడ్ అని తెలిపింది. ఈ తయారీ కర్మాగారం అర మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహన తయారీ కోసం సుమారు 800 మంది సిబ్బందిని నియమించుకుంటున్నట్లు తెలిపింది. ఈ పెట్టుబడికి అదనంగా రూ.250 కోట్ల పెట్టుబడిని పెట్టడానికి ఇన్వెస్టర్లు వస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ యూనిట్ నుంచి మొదటి వాహనం జూన్ 2022 నాటికి బయటకు వస్తుందని సంస్థ భావిస్తుంది. ఇతర సంస్థలకు పోటీగా మరిన్ని వాహనాలను లాంచ్ చేసేందుకు సంస్థ సిద్దం అవుతుంది. (చదవండి: పెట్రోల్‌పై ఏకంగా రూ. 25 రాయితీ..!) -
చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్, హైదరాబాద్‌లో అమ్మకాలు ఎప్పుడంటే ?
హైదరాబాద్ : హైదరాబాద్‌లో తన ఎలక్ట్రిక్ స్కూటర్ని ప్రవేశ పెట్టేందుకు బజాజ్ ఆటో లిమిటెడ్ సిద్ధమైంది. ఇప్పటికే నాగ్‌పూర్‌లో చేతక్ ఈవీ షోరూమ్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. నాగ్‌పూర్ తర్వాత చెన్నై, హైదరాబాద్‌లలో తమ స్కూటర్ తెచ్చేలా బజాజ్ ప్లాన్ చేస్తోంది. రెండు వేరియంట్లు ప్రస్తుతం బజాజ్ చేతక్ అర్బన్, ప్రీమియం వేరియంట్లలో లభిస్తోంది. షోరూమ్ ప్రకారం అర్బన్ ధర రూ. 1.42,620 ఉండగా ప్రీమియం ధర రూ. 1,44,620గా ఉంది. ఇందులో 2 కిలోవీట్ బ్యాటరీలు అమర్చారు.బ్యాటరీలకు 3 ఏళ్లు లేదా 50,000 కి,మీ వారంటీ అందిస్తున్నారు.ఒకసారి ఛార్జింగ్ చేస్తే మోడ్‌ను బట్టి 85 నుంచి 95 కి.మీ వరకు ప్రయాణం చేయవచ్చు. సోల్డ్ అవుట్ బజాజ్ ఎలక్ట్రిక్ వాహనాలకు మార్కెట్లో మంచి స్పందన వస్తోంది. మార్కెట్లోకి రాకముందే ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌లోనే బైకులన్నీ అమ్ముడై పోతున్నాయి. తాజాగా నాగ్‌పూర్‌కి సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మొదలైంది. 90వ దశకంలో 90వ దశకంలో స్కూటర్ విభాగంలో చేతక్ ఒక ప్రభంజనం సృష్టించింది. ఆ తర్వాత బైకుల అమ్మకాలు పెరగగా చేతక్ స్కూటర్ అమ్మకాలు పడిపోయాయి. అయితే ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు క్రమంగా ఊపందుకోవడంతో చేతక్ ఈవీని మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమైంది బజాజ్. 2021 మార్చిలో ఒకేసారి 30 నగరాల్లో చేతక్ అమ్మకాలు ప్రారంభించాలని నిర్ణయించినా... తర్వాత ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. క్రమంగా ఒక్కో సిటీలో బజాజ్ షోరూమ్స్ ప్రారంభిస్తూ పోతుంది. ఇక్కడే ప్రస్తుతం పూనే, బెంగళూరు, మైసూరు, మంగళూరు, ఔరంగాబాద్ నగరాల్లో చేతక్ ఎలక్ట్రిక్ వాహనాలు అమ్మకాలు సాగుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో నాగ్‌పూర్ చేరనుంది. మరికొద్ది రోజుల్లోనే హైదరాబాద్‌లో కూడా పరుగులు పెట్టనుంది చేతక్. -
బజాజ్ డొమినర్పై బంపర్ ఆఫర్
ముంబై: బైక్ లవర్లకు శుభవార్త. స్పోర్ట్స్ బైక్స్‌లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న బజాన్ డొమినర్ ధరలు తగ్గాయి. బజాజ్ ఆటో తన డొమినర్ 250 మోడళ్ల ధరలపై రూ.16,800 తగ్గిస్తున్నట్లు తెలిపింది. ధర తగ్గింపుతో ఈ మోడల్ ధర రూ.1.54 లక్షలకు దిగిరానుంది. ‘‘ఆటో కంపెలన్నీ వాహన ధరలను పెంచుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో డొమినార్ మోడళ్ల ధరలను తగ్గిస్తున్నాము. కస్టమర్లకు స్పోర్ట్స్, టూరింగ్ సదుపాయాలను మరింత చేరువ చేసేందుకు సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది’’ అని బజాజ్ ఆటో ప్రెసిడెంట్ సారంగ్ కనడే తెలిపారు. గతేడాది మార్చిలో విడుదలైన డొమినర్ 248.8 సీసీ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. స్పోర్ట్స్ బైక్ కేటగిరిలో డోమినర్ ఇతర కంపెనీలకు గట్టి పోటీ ఇస్తోంది. ధర తగ్గింపుతో డొమినర్ అమ్మకాలు పుంజుకునే అవకాశం ఉంది. -
బజాజ్ నుంచి మరో ఎలక్ట్రిక్ వెహికల్
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో పోటీ పెరిగిపోతుంది. రోజుకో కంపెనీ సరికొత్త మోడల్ని ప్రవేశపెడుతూ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే ఈవీ సెగ్మెంట్లో హీరో, ఈథర్, ఒకినావాలు సందండి చేస్తుండగా తాజాగా ఈ జాబితాలో బజాజ్ కూడా చేరనుంది. ఫ్రీ రైడర్ పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ట్రేడ్‌మార్క్ రిజిస్టర్ చేయించింది. బజాజ్నుంచి.. ఇండియా టూ వీలర్ మార్కెట్లో బజాజ్‌ది ప్రత్యేక స్థానం. ఒకప్పుడు దేశం మొత్తాన్ని చేతక్ స్కూటర్ ఒక ఊపు ఊపింది. ఆ తర్వాత యూత్‌లో మంచి క్రేజ్‌ని పల్సర్ సాధించింది. ఇప్పటికే యూత్‌లో ఎక్కువ డిమాండ్ ఉన్న బైక్‌గా పల్సర్‌కి పేరుంది. మిగిలిన బజాజ్ మోడల్స్‌కి రూరల్ ఇండియాలో మంచి కస్టమర్ బేస్ ఉంది. తాజాగా ఈవీ సెగ్మెంట్‌పైనా బజాజ్ దృష్టి సారించింది. ఇప్పటికే బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో ఉండగా మరో కొత్త మోడల్‌ను తీసుకు వస్తుంది. ఫ్రీ రైడర్ పేరుతో కొత్త స్కూటర్ని తేనుంది. దీనికి సంబంధించిన ట్రేడ్ మార్క్ కోసం మార్చి 1న అప్లయ్ చేస్తే.. జూన్ 1న ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. చదవండి: తగ్గిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ధరలు..మోడల్ని బట్టి డిస్కౌంట్ -
కేటీఎం,హుస్కవర్ణ బైకులు మరింత ప్రియం
బజాజ్‌కు చెందిన ప్రీమియం బైకుల విక్రయ సంస్థ కేటీఎం తన వాహన ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ముడి పదార్ధాల ధరలు పెరుగడంతో ధరలను పెంచాల్సి వచ్చినట్లు సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో కేటీఎం, హుస్కావర్ణ బైకులు రూ.10 వేల వరకు ప్రియం కానున్నాయి. వివిధ మోడళ్ళను బట్టి ధరల పెరుగుదలలో మార్పులు ఉంటాయి. దీంట్లో కేటీఎం బైకులు రూ.8,812, హుస్కవర్ణ బైకులు రూ.9,730 వరకు పెరగనున్నాయి. కేటీఎం, హుస్కావర్ణ బైక్ ధరలు: కేటీఎం 125 డ్యూక్: రూ.1,60,319 కేటీఎం 200 డ్యూక్: రూ.1,83,328 కేటీఎం 390 డ్యూక్: రూ.2,75,925 కేటీఎం ఆర్సీ 125 : రూ.1,70,214 కేటీఎం ఆర్సీ 390: రూ.2,65,897 కేటీఎం 250 ఏడివి: రూ.2,54,483 కేటీఎం 390 ఏడివి: రూ.3,16,601 హుస్కవర్ణ స్వర్ట్ పిలెన్: రూ.1,99,296 హుస్కవర్ణ విట్ పిలెన్: రూ.1,98,669 -
ప్రపంచంలోనే తొలి కంపెనీగా బజాజ్ ఆటో రికార్డ్
ముంబై, సాక్షి: దేశీ ఆటో రంగ దిగ్గజం బజాజ్ ఆటో సరికొత్త రికార్డును అందుకుంది. తాజాగా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ. ట్రిలియన్ మార్క్‌ను దాటింది. తద్వారా ప్రపంచంలోనే రూ. లక్ష కోట్ల మార్కెట్ విలువను సాధించిన తొలి ద్విచక్ర వాహన కంపెనీగా రికార్డు సాధించింది. ఎన్ఎస్ఈలో శుక్రవారం బజాజ్ ఆటో షేరు 1 శాతం బలపడి రూ. 3,479 వద్ద ముగిసింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ. 1,00,670 కోట్లను అధిగమించింది. మార్చి నుంచి జోరు కోవిడ్-19 ప్రభావంతో మార్చి చివర్లో దేశీ స్టాక్ మార్కెట్లు కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఫలితంగా బజాజ్ ఆటో షేరు సైతం పతనమైంది. తిరిగి మార్కెట్లతోపాటు జోరందుకుంది. వెరసి మార్చి కనిష్టం నుంచి 79 శాతం దూసుకెళ్లింది. ఏడాది కాలాన్ని పరిగణిస్తే 11 శాతం లాభపడింది. మార్చి 24న షేరు ధర రూ. 1,789 దిగువన ఏడాది కనిష్టాన్ని తాకింది. కాగా.. దేశీ ద్విచక్ర వాహన రంగంలో మరో దిగ్గజ కంపెనీ హీరోమోటో కార్ప్ మార్కెట్ విలువ దాదాపు రూ. 62,028 కోట్లు మాత్రమే. ఈ విలువతో పోలిస్తే బజాజ్ ఆటో మార్కెట్ క్యాప్ 63 శాతం అధికంకాగా.. రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీ ఐషర్ మోటార్స్ విలువకంటే 43 శాతం ఎక్కువకావడం గమనార్హం! ప్రస్తుతం ఐషర్ మోటార్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 69,730 కోట్లుగా నమోదైంది. (మార్కెట్లు భళా- ఈ మూడు కంపెనీలూ స్పీడ్) మూడో పెద్ద కంపెనీ బజాజ్ ఆటో చకన్(పుణే), వలుజ్(ఔరంగాబాద్), పంత్నగర్(ఉత్తరాఖండ్)లో ప్లాంట్లను కలిగి ఉంది. ప్రస్తుతం ప్రపంచ ద్విచక్ర వాహన రంగంలో మూడో పెద్ద కంపెనీగా బజాజ్ ఆటో ఆవిర్భవించింది. త్రిచక్ర వాహన తయారీకి టాప్ ర్యాంకులో నిలుస్తోంది. చకన్లో నాలుగో ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ ఇటీవలే ప్రకటించింది. ఇందుకు రూ. 650 కోట్లను వెచ్చించనుంది. ఈ ప్లాంటులో ప్రీమియం బైకులు, ఎలక్ట్రిక్ వాహనాలను రూపొందించనున్నట్లు తెలియజేసింది. (కార్ల మార్కెట్లో ఆ 5 కంపెనీలదే హవా) మోటార్ సైకిళ్ల స్పీడ్ మోటార్ సైకిళ్లపై ప్రత్యేక దృష్టి, అంతర్జాతీయ మార్కెట్లలో విస్తరించడం వంటి అంశాల నేపథ్యంలో అత్యంత విలువైన కంపెనీగా రికార్డును సాధించగలిగినట్లు బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కొంతకాలంగా ఆటో రంగం నీరసించినప్పటికీ ఎగుమతులు పుంజుకోవడం ద్వారా కంపెనీ వృద్ధి బాటలో సాగినట్లు తెలియజేశారు. పల్సర్, బాక్సర్, ప్లాటినా తదితర బ్రాండ్లతో 70 దేశాలలో కంపెనీ మోటార్ సైకిళ్లను విక్రయిస్తోంది. ఈ బాటలో ప్రస్తుత ఏడాది థాయ్‌లాండ్‌లో, తదుపరి బ్రెజిల్లో అడుగుపెట్టాలని ప్రణాళికలు వేసింది. ద్విచక్ర వాహనాలతోపాటు.. త్రిచక్ర వాహన విక్రయాలలోనూ దేశ, విదేశీ మార్కెట్లలో అమ్మకాలు పెంచుకోవడంపై కంపెనీ తొలి నుంచీ దృష్టిపెట్టి సాగుతున్నట్లు రాజీవ్ తెలియజేశారు. -
బజాజ్ ఆటో నికర లాభం 53 శాతం డౌన్
ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. క్యూ1లో స్టాండెలోన్ నికర లాభం 53 శాతం క్షీణించి రూ. 528 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన సైతం నికర లాభం రూ. 1012 కోట్ల నుంచి రూ. 396 కోట్లకు పడిపోయింది. ఇక మొత్తం ఆదాయం 60 శాతం వెనకడుగుతో రూ. 3079 కోట్లను తాకింది. పన్నుకు ముందు లాభం 60 శాతం తక్కువగా రూ. 682 కోట్లకు చేరింది. కరోనా వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డవున్‌లను అమలు చేయడంతో కంపెనీ వాహన విక్రయాలు మందగించినట్లు ఫలితాల విడుదల సందర్భంగా కంపెనీ యాజమాన్యం తెలియజేసింది. క్యూ1లో బజాజ్ ఆటో 4.43 లక్షల వాహనాలను మాత్రమే విక్రయించింది. గతేడాది(2019-20) క్యూ1లో 12.47 లక్షల వాహనాలను అమ్మగలిగింది. ఇబిటా మార్జిన్లు 14.3 శాతంగా నమోదయ్యాయి. రూ. 14,232 కోట్లు జూన్‌కల్లా కంపెనీ చేతిలో నగదు, తత్సమాన నిల్వలు రూ. 14,232 కోట్లుగా నమోదయ్యాయి. ద్విచక్ర వాహన విక్రయాలు 6.11 లక్షల నుంచి రూ. 1.86 లక్షల వాహనాలకు తగ్గినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ విభాగంలో ఎగుమతులు సైతం 4.72 లక్షల వాహనాల నుంచి 2.14 లక్షలకు నీరసించినట్లు తెలియజేసింది. ఇక వాణిజ్య విభాగంలో వాహన విక్రయాలు 86,000 నుంచి 5,300కు తగ్గాయి. ఎగుమతులు సైతం 78,000 నుంచి తగ్గి 38,000 వాహనాలకు పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బజాజ్ ఆటో షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 2 శాతం నష్టంతో రూ. 2955 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 2907 దిగువకూ పతనమైంది. -
జూన్‌కల్లా 50% డిమాండ్: బజాజ్ ఆటో
దేశవ్యాప్తంగా లాక్‌డవున్ కొనసాగుతున్నప్పటికీ ప్రస్తుతం వాహనాలకు 20-25 శాతం డిమాండ్ కనిపిస్తున్నట్లు ఆటో రంగ దేశీ దిగ్గజం బజాజ్ ఆటో తాజాగా పేర్కొంది. సాధారణ పరిస్థితులతో పోలిస్తే వచ్చే నెలకల్లా డిమాండ్ 50 శాతానికి చేరుకోవచ్చని అంచనా వేసింది. 50-60 శాతం డీలర్షిప్స్ గ్రీన్జోన్లలోనే ఉన్నట్లు వెల్లడించింది. దీంతో ఇక్కడ 50-60 శాతం వాహన విక్రయాలకు వీలున్నట్లు తెలియజేసింది. ఇక సర్వీస్ ఆదాయం సైతం సాధారణ పరిస్థితులతో పోలిస్తే 60-70 శాతంగా నమోదవుతున్నట్లు వివరించింది. అయితే సమీప భవిష్యత్‌లో దేశ, విదేశీ మార్కెట్లలో ఆటో రంగానికి పలు సవాళ్లు ఎదురయ్యే అవకాశమున్నట్లు కొటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ అభిప్రాయపడింది. ఈ అనిశ్చితుల్లోనూ బజాజ్ ఆటో మార్జిన్లను నిలుపుకోగలదని భావిస్తున్నట్లు తెలియజేసింది. ఆటో రంగంలో 2022లో మాత్రమే పూర్తిస్థాయిలో డిమాండ్ నెలకొనే వీలున్నట్లు అంచనా వేసింది. కాగా.. బజాజ్ ఆటో షేరు కొనుగోలుకి సిఫారసు చేస్తూ రూ. 3,000 టార్గెట్ ధరను కొటక్ ఈక్విటీస్ ప్రకటించింది. లాభం రూ. 1310 కోట్లు గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో బజాజ్ ఆటో నామమాత్ర వృద్ధితో రూ. 1310 కోట్ల నికర లాభం ఆర్జించింది. అయితే అమ్మకాలు 8 శాతం క్షీణించి రూ. 6816 కోట్లకు పరిమితమయ్యాయి. రిటైల్ ఫైనాన్సింగ్ అందుబాటు కారణంగా ద్విచక్ర వాహన విక్రయ విభాగం పటిష్ట పనితీరు చూపుతున్నప్పటికీ త్రిచక్ర వాహన అమ్మకాలు నీరసిస్తున్నట్లు బజాజ్ ఆటో పేర్కొంది. ఈ నేపథ్యంలో బజాజ్ ఆటో కౌంటర్‌కు డిమాండ్ కనిపిస్తోంది. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం బజాజ్ ఆటో షేరు 4 శాతం జంప్‌చేసి రూ. 2661 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 2724ను అధిగమించింది. -
సరికొత్తగా హమారా బజాజ్ స్కూటర్ చేతక్
సాక్షి, ముంబై: ప్రముఖ వాహన తయారీ కంపెనీ బజాజ్ ఆటో లిమిటెడ్ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది. తన పాపులర్మోడల్ చేతక్ స్కూటర్‌ను సరికొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ గా మార్కెట్లో బుధవారం లాంచ్ చేసింది. బజాజ్ ట్యాగ్‌లైన్ 'హుమారా బజాజ్' గా 'హుమారా కల్' అనే కొత్త నినాదంతో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అర్బనైట్ ఈవీ బ్రాండ్ కింద తీసుకొచ్చింది. కంపెనీ చాకన్ ప్లాంట్‌లో ఈ స్కూటర్‌ను రూపొందిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త చేతక్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అయితే దీని ధరను మాత్రం ఇంకా ప్రకటించలేదు. దాదాపు ఒక దశాబ్దం తర్వాత రెండవ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. మోటారు సైకిళ్లపై దృష్టి పెట్టడానికి బజాజ్ 2009లో సాంప్రదాయ స్కూటర్ల తయారీని నిలిపివేసింది బజాజ్. ఎలక్ట్రిక్ స్పేస్‌లో స్కూటర్లు, త్రీ వీలర్లకు అపారమైన అవకాశం ఉందని బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ తెలిపారు. ఈరంగంలోకి మొదటగా రావడం, మార్కెట్లో మొదటి స్థానంలో ఉండటం చాలా ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు. -
బజాజ్ ‘క్యూటీ’ కమింగ్ : చిన్నకార్లకు దెబ్బే
సాక్షి, ముంబై: ఎంట్రీ లెవల్ కారుకోసం ఎదురు చూస్తున్న భారత వినియోగదారులకు శుభవార్త. వాణిజ్య అవసరాలకే వాడుతున్న క్వాడ్రిక్ సైకిళ్లను ఇకపై వ్యక్తిగత అవసరాలకు కూడా వినియోగించుకో వచ్చని నవంబరు 20న కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల సంస్థ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే కొన్ని నిబంధనలను కూడా విధించింది. ఈ నేపథ్యంలో టాటా నానో కారు తరహాలో ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో తన చిన్నకారును ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెటేందుకు సిద్ధమవుతోంది. ‘క్యూటీ’ పేరుతో క్వాడ్రిక్ సైకిల్‌ను ఫిబ్రవరి 2019లో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తోందని సమాచారం. బజాజ్ క్యూటీ ధర సుమారు రూ.2.60లక్షల నుంచి రూ.3లక్షల వరకూ ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతేకాదు అధిక మైలేజీని ఇవ్వడంతో పాటు, కాలుష్య ఉద్గారాలను తక్కువ వెలువరిస్తుందట. లీటరు కు 30కి.మీ. పైనే మేలేజీ, గంటకు 70కి.మీ. వేగంతో ప్రయాణించగలదని అంచనా. భారత ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం నగరాలకు ఈ క్యూటీ అనువుగా ఉండనుంది. ప్రస్తుతం క్యూటీని కేవలం వాణిజ్య అవసరాలకు మాత్రమే విక్రయిస్తున్నారు. కాగా, ఇటీవల ప్రభుత్వం వ్యక్తిగత అవకాశాలకు కూడా దీన్ని వినియోగించుకోవచ్చంటూ నిబంధనలను సడలించింది. ఈ నేపథ్యంలో వ్యక్తిగత ప్రయాణ వాహన రంగంలో పెను మార్పు చోటు చేసుకునే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ క్రమంలో టాటా మోటార్స్, ఎం అండ్ ఎండ్ మరో రెండు సంవత్సరాల్లో తమ సరికొత్త వాహనాలను లాంచ్ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి. అలాగే మారుతి, హ్యుందాయ్ తమ వ్యూహాలను మార్చుకొని అతి తక్కువ ధరలో ఎంట్రీ లెవల్ కార్లను లాంచ్ చేస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ మాట్లాడుతూ.. పట్టణాల్లో ప్రయాణాలకు క్యూటీ చక్కగా సరిపోతుంది. ద్విచక్రవాహనంతో పోలిస్తే, భద్రత విషయంలోనూ మంచి ప్రమాణాలను పాటించాం. టూ-వీలర్‌కు ఎంతైతే నిర్వహణ ఖర్చు అవుతుందో దీనికి కూడా అదే స్థాయిలో ఉంటుంది. అంతేకాదు, అధిక మైలేజీని ఇవ్వడంతో పాటు, కాలుష్య ఉద్గారాలను సైతం తక్కువగా వెలువరిస్తుందని వెల్లవడించారు. కాగా యూరప్, లాటిన్ అమెరికా, ఆసియా దేశాల్లో క్వాడ్రిక్ సైకిల్ విక్రయిస్తున్న బజాజ్ ఆటోక్యూటీని తొలిసారి 2012లో ఆవిష్కరించింది. భద్రతా ప్రమాణాల దృష్ట్యా రోడ్డువాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నుంచి భారత్‌లో అనుమతి లభించలేదు. -
మూడేళ్లకే బైక్ మార్చేస్తున్నారు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘వ్యూహం అంటూ లేకుండా వాహన రంగంలో నిలదొక్కుకోలేం. బజాజ్ ఆటో భారతీయ కంపెనీయే. కానీ మేం ఇక్కడితో పరిమితం కాలేదు. 30కి పైగా దేశాలకు వాహనాలను సరఫరా చేస్తున్నాం. మా దృష్టి భారత్‌తోసహా అన్ని మార్కెట్లపైనా ఉంటుంది. ఒక దేశం కోసం అంటూ వాహనాలను తయారు చేయం’ అని అంటున్నారు బజాజ్ ఆటో కంపెనీ, మోటార్ సైకిల్ విభాగపు ప్రెసిడెంట్ కె.శ్రీనివాస్. సరికొత్త డిస్కవర్ 125 బైక్‌ను ఆవిష్కరించేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. కస్టమర్ల అభిరుచులు, కంపెనీ భవిష్యత్ కార్యాచరణ, మార్కెట్ తీరుతెన్నులు ఆయన మాటల్లోనే.. మూడేళ్లయితే చాలు.. దక్షిణాదివారైనా, ఉత్తరాదివారైనా మోటార్ సైకిళ్ల విషయంలో భారతీయ కస్టమర్ల అభిరుచులు దాదాపు ఒకేలా ఉన్నాయి. స్టైల్, మంచి పవర్ ఉన్న బైక్‌లపై మక్కువ పెరుగుతోంది. గతంలో ఒకసారి బైక్ కొంటే ఏడెనిమిదేళ్లు వాడేవారు. ఐదేళ్ల క్రితం వరకు ఈ ట్రెండ్ ఉండేది. ఇప్పుడు మూడు నాలుగేళ్లకే వాహనం మారుస్తున్నారు. రెండేళ్లుగా సెంటిమెంట్ బాగోలేదు. ఉద్యోగం ఉంటుందో లేదో అన్న ఆందోళనలో ఉంటే కొత్త బైక్ కొనలేరుగా. అందుకే ద్విచక్ర వాహన పరిశ్రమ స్తబ్దుగా ఉంది. వచ్చే ఏడాది వృద్ధి ఖాయం. ఎక్సైజ్ డ్యూటీని 12 నుంచి 8 శాతానికి కుదించడం మంచి పరిణామం. కొత్త ప్రభుత్వం ఈ తగ్గింపు సుంకాన్ని కొనసాగిస్తుందని ఆశిస్తున్నాం. మా వాహనాల ధరను రూ.1,500 నుంచి రూ.5 వేల వరకు తగ్గించాం. స్కూటర్ తెచ్చే ఆలోచనే లేదు.. ప్రపంచంలో అమ్ముడవుతున్న ద్విచక్ర వాహనాల్లో 80 శాతం మోటార్ సైకిళ్లే. ప్రపంచ వ్యాప్తంగా మోటార్ సైకిళ్ల విభాగంలో బ జాజ్‌కు 10 శాతం వాటా ఉంది. అందుకే మోటార్ సైకిల్ కంపెనీగా మాత్రమే మేం కొనసాగుతాం. స్కూటర్ తయారు చేసే ఆలోచన ఏ మాత్రం లేదు. ఏటా 48 లక్షల బైక్‌లను తయారు చేసే సామర్థ్యం కంపెనీకి ఉంది. ప్లాంట్ల యుటిలైజేషన్ 85 శాతం. ఇందులో ఎగుమతుల వాటా 33 శాతం. దేశంలో మోటార్ సైకిళ్లలో 22 శాతం వాటా బజాజ్‌కు ఉంది. కొత్త డిస్కవర్ 125 రాకతో ఇది 30 శాతానికి చేరుతుందని అంచనా వేస్తున్నాం. ఆ మూడింటిపైనే.. క్రూయిజర్ బైక్ అయిన అవెంజర్ 220 హోట్ కేక్‌లా అమ్ముడుపోతోంది. ప్రస్తుతానికి అవెంజర్ బ్రాండ్‌లో ఈ ఒక్క మోడల్‌నే కొనసాగిస్తాం. కొత్త వేరియంట్లు ఏవైనా పల్సర్, ప్లాటినా, డిస్కవర్.. ఈ మూడు బ్రాండ్లలో మాత్రమే విడుదల చేస్తాం. ఏపీలో ఎక్కువ కాబట్టే.. దేశంలో నెలకు 1.6 లక్షల బైక్‌లు 125 సీసీ సామర్థ్యం గలవి అమ్ముడవుతున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా అత్యధికంగా 17 శాతముంది. ఈ కారణంగానే భారత్‌లో తొలిసారిగా కొత్త డిస్కవర్ 125ని హైదరాబాద్ వేదికగా ఆవిష్కరించాం. 100 సీసీ బైక్‌లు కేవలం మైలేజీకే పరిమితం. 7.5-8 హార్స్‌పవర్‌ను ఇవి మించడం లేదు. మైలేజీ మినహా మరే ఇతర ప్రయోజనం లేదు. 20 ఏళ్లుగా ఈ విభాగంలో పెద్దగా సాంకేతిక అభివృద్ధి జరగలేదు. అధిక సామర్థ్యం గల బైక్ కొనాలని ఉన్నా ఖర్చు ఎక్కువని, మైలేజీ రాదని కస్టమర్లు మిన్నకుండి పోతారు. వీరికోసమే స్టైల్, పవర్, మైలేజీ కలిగిన కొత్త డిస్కవర్ 125ను పరిచయం చేశాం. 11.5 పీఎస్ పవర్, మైలేజీ 76 కిలోమీటర్లు. టాప్ స్పీడ్ 100 కిలోమీటర్లు. డ్రమ్ బ్రేక్ మోడల్ ధర హైదరాబాద్ ఎక్స్ షోరూంలో రూ.49,075. డిస్క్ బ్రేక్ వేరియంట్ కూడా ఉంది. ఆరు రకాల ఆకర్షణీయ రంగుల్లో ఇది లభిస్తుంది.