ముంబై: నీరవ్ మోదీ స్కామ్.. వజ్రాభరణాల రంగంపై గణనీయంగానే ప్రభావం చూపుతోంది. కుంభకోణం దెబ్బతో ఈ రంగం రుణాలపరమైన సమస్యలు ఎదుర్కొంటోంది. బ్యాంకుల నుంచి లభించే రుణాలు దాదాపు పది శాతం మేర తగ్గిపోయాయి. దీంతో ఎగుమతులపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని ఆభరణాల సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. వజ్రాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి జీజేఈపీసీ ఒక నివేదికలో ఈ విషయాలు తెలియజేసింది.
‘ఈ పరిశ్రమకు బ్యాంకు రుణాలే ప్రధాన ఆధారం. ఇవి తగ్గిపోతే వజ్రాభరణాల ఎగుమతులు కూడా తగ్గే అవకాశం ఉంది‘ అని జీజేఈపీసీ వైస్ చైర్మన్ కొలిన్ షా తెలిపారు. నిఖార్సయిన సంస్థలు కూడా ఎంతో కష్టపడితే గానీ రుణాలు రావడం లేదని .. ఒకవేళ వచ్చినా ఇన్‌వాయిస్‌లన్నీ తమ దగ్గరే డిస్కౌంటింగ్ చేయాలంటూ బ్యాంకులు షరతులు పెడుతుండటంతో క్లయింట్స్‌తో సంబంధాలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు.
బ్యాంకులు ఇప్పటిదాకా అందిస్తూ వచ్చిన పలు ప్రయోజనాలను కూడా ఉపసంహరించడంతో వడ్డీ వ్యయాలు కూడా పెరిగిపోయాయని షా చెప్పారు. వజ్రాభరణాల ట్రేడర్లు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ.. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను దాదాపు రూ. 13,500 కోట్ల మేర మోసం చేసిన సంగతి తెలిసిందే. దీని మీద వారిపై ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తదితర దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయి.
స్వయం నియంత్రణపై దృష్టి ..
పరిశ్రమలో వివిధ సంస్కరణల ద్వారా స్వయం నియంత్రణను అమలు చేసేందుకు, వ్యాపార సంబంధ వర్గాల్లో విశ్వాసాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు జీజేఈపీసీ చైర్మన్ ప్రమోద్ అగర్వాల్ తెలిపారు. అయితే, బ్యాంకులు రుణాలను తగ్గించేయడం, మరింతగా హామీలు అడుగుతుండటం, డాక్యుమెంటేషన్‌ను పెంచేయడం వంటి అంశాలు ట్రేడర్లకు సమస్యాత్మకంగా ఉంటున్నాయని ఆయన చెప్పారు.
ఈ పరిస్థితుల నేపథ్యంలో 41 బిలియన్ డాలర్ల వజ్రాభరణాల రంగం.. ఈ ఆర్థిక సంవత్సరంలోనే గణనీయంగా క్షీణించే అవకాశాలు ఉన్నా యని అగర్వాల్ పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని కొంత తోడ్పాటు చర్యలు ప్రకటించాలని కోరారు. జీజేఈపీసీ గణాంకాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్‌లో 11.1 బిలియన్ డాలర్లుగా ఉన్న వజ్రాభరణాల ఎగుమతులు ఈసారి జూన్ త్రైమాసికంలో 8.8 శాతం క్షీణించి 10.1 బిలియన్ డాలర్లకు తగ్గాయి.
Comments
Please login to add a commentAdd a comment