
చెన్నై: నీరవ్ మోదీ కుంభకోణం .. ఇతర ఆభరణాల తయారీదారులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. స్కామ్ నేపథ్యంలో బ్యాంకులు రుణాలివ్వడానికి వెనుకాడుతుండటంతో జ్యుయలర్లు నిధులపరమైన సవాళ్లు ఎదుర్కొంటున్నారు. ‘వజ్రాభరణాల పరిశ్రమకు ప్రస్తుతం రూ. 15,000 కోట్ల మేర నిధులు అవసరం.
కానీ రుణాలు లభించడం లేదు. కొన్నాళ్ల క్రితం ఒక ఆభరణాల సంస్థ మూతబడింది. ఇక నీరవ్ మోదీ ఉదంతం తర్వాత దేశవ్యాప్తంగా పరిస్థితి మరింత సమస్యాత్మకంగా మారింది‘ అని వజ్రాభరణాల కౌన్సిల్ వైస్ చైర్మన్ ఆనంద పద్మనాభన్ వ్యాఖ్యానించారు. ఇటీవలి పరిణామాల కారణంగా ట్రేడర్లకు బ్యాంకులు రుణాలివ్వడం ఆపేశాయని, దీంతో కార్యకలాపాల విస్తరణ ప్రణాళికలు మందగించాయని ఆయన తెలియజేశారు.
రుణాలను పునరుద్ధరించేందుకు బ్యాంకులు ముందుకు రావడం లేదని, ఇప్పటికే తీసుకున్న లోన్లను సాధ్యమైనంత త్వరగా తీర్చేయాలంటున్నాయని పద్మనాభన్ చెప్పారు. రుణాల మంజూరు విషయంలో నిబంధనలను సడలించాలంటూ ఓవైపు తాము అభ్యర్థిస్తుంటే మరోవైపు దానికి విరుద్ధంగా ఆర్థిక సంస్థలు మొత్తానికే రుణాలివ్వడాన్ని నిలిపివేశాయన్నారు.