8% పెరిగిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా లాభం  | Bank of India June-quarter profit rises 8.4% on tax write-back | Sakshi
Sakshi News home page

8% పెరిగిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా లాభం 

Published Wed, Aug 1 2018 12:37 AM | Last Updated on Wed, Aug 1 2018 12:37 AM

Bank of India June-quarter profit rises 8.4% on tax write-back - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.95 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం (రూ.88 కోట్లు)తో పోల్చితే 8% వృద్ధి సాధించామని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. అంతకు ముందటి క్వార్టర్‌(గత ఆర్థిక సంవత్సరం క్యూ4)లో రూ.3,969 కోట్ల నికర నష్టాలు వచ్చాయని వివరించింది.  క్యూ1లో ఈ బ్యాంక్‌కు రూ.1,000 కోట్ల మేర నష్టాలు వస్తాయని విశ్లేషకులు అంచనా వేశారు.  నికర వడ్డీ ఆదాయం రూ.2,533 కోట్ల నుంచి 32% వృద్ధితో రూ.3,354 కోట్లకు పెరిగిందని తెలిపింది.  

తగ్గిన మొత్తం ఆదాయం  
గత క్యూ1లో రూ.11,107 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో 2 శాతం తగ్గి రూ.10,843 కోట్లకు చేరిందని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది.
తగ్గిన రుణనాణ్యత..: బ్యాంక్‌ రుణ నాణ్యత మరింతగా క్షీణించింది. గత క్యూ1లో రూ.51,019 కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ1లో రూ.60,604 కోట్లకు ఎగిశాయని బ్యాంక్‌ తెలిపింది. నికర మొండి బకాయిలు రూ.24,407 కోట్ల నుంచి రూ.27,932 కోట్లకు పెరిగాయని పేర్కొంది. శాతం పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు 13.05% నుంచి 16.66%కి, నికర మొండి బకాయిలు 6.70% నుంచి 8.45 శాతానికి పెరిగాయని వివరించింది. మొండి పద్దులు పెరగడంతో కేటాయింపులు పెరిగాయని పేర్కొంది. గత క్యూ1లో రూ.2,156 కోట్లుగా ఉన్న మొండి బకాయిలకు కేటాయింపులు ఈ క్యూ1లో రూ.2,260 కోట్లకు పెరిగాయని తెలిపింది.  ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో బ్యాంక్‌ షేర్‌ 9% పతనమై రూ.94 వద్ద ముగిసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement