ముంబై: మొండిబాకీలకు కేటాయింపులు రెట్టింపు కావడంతో ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) నష్టాలు మూడో త్రైమాసికంలో ఏకంగా రూ. 4,738 కోట్లకు ఎగిశాయి. 40 భారీ మొండి పద్దులపై దివాలా చట్టం కింద విచారణ జరుగుతుండటం, కొత్తగా ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభం రూపంలో మొండిబాకీలు మరింతగా పెరగడం ఇందుకు కారణం. భారీ మొండిబాకీల కారణంగా ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ నిర్దేశిత సత్వర దిద్దుబాటు చర్యల (పీసీఏ)పరమైన ఆంక్షలు ఎదుర్కొంటున్న బీవోఐ.. 2017 డిసెంబర్ క్వార్టర్‌లో రూ. 2,341 కోట్ల నష్టాలు నమోదు చేసింది. తాజాగా ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్‌నకు ఇచ్చిన రూ. 3,400 కోట్ల మేర రుణాలు మొండిబాకీల కింద వర్గీకరించాల్సి వచ్చింది.
ముందుజాగ్రత్తగా కొన్ని మొండిపద్దులకు పూర్తి స్థాయిలో ప్రొవిజనింగ్ చేయడంతో కేటాయింపులు రూ. 4,373 కోట్ల నుంచి రూ. 9,179 కోట్లకు ఎగిశాయని బీవోఐ ఎండీ దీనబంధు మహాపాత్ర తెలిపారు. మరోవైపు, క్యూ3లో వడ్డీ ఆదాయం 33.23 శాతం పెరిగి రూ. 3,332 కోట్లకు చేరిందని చెప్పారు. స్థూల నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏ) పరిమాణం 16.93 శాతం నుంచి 16.31 శాతానికి, నికర ఎన్‌పీఏలు 10.29 శాతం నుంచి 5.87 శాతానికి తగ్గాయి. సోమవారం బీఎస్‌ఈలో బ్యాంక్ షేరు 4 శాతం క్షీణించి రూ. 90.60 వద్ద క్లోజయ్యింది.
బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ప్రొవిజనింగ్ సెగ
Published Tue, Jan 29 2019 1:15 AM | Last Updated on Tue, Jan 29 2019 1:15 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment