అతి తక్కువ గృహ రుణ రేటు!
బీఓబీ ఆఫర్ ∙ 8.35 శాతానికి తగ్గింపు
ముంబై: ప్రభుత్వరంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) బ్యాంకింగ్‌లోనే అతితక్కువ గృహ రుణ రేటును ఆఫర్ చేసింది. ఏకంగా 70 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గించినట్లు ప్రకటించింది. దీనితో ఈ రేటు 8.35 శాతానికి తగ్గింది. ఇది గృహ రుణ విభాగానికి సంబంధించి పరిశ్రమలోనే అతి తక్కువ రేటని బ్యాంక్ పేర్కొంది. ఎస్‌బీఐ గృహ రుణ రేటు 8.50%గా ఉంది.
సిబిల్ స్కోర్ ఉండాల్సిందే...
తక్కువ గృహ రుణ రేటు ఆఫర్ అందుకోవాలంటే పటిష్ట సిబిల్ స్కోర్ అవసరమని బ్యాంక్ పేర్కొంది. ‘‘ఈ గృహ రుణ రేటు సిబిల్ స్కోర్‌కు అనుసంధానమై ఉంటుంది. కస్టమర్ తప్పనిసరిగా 760 ఆపైన సిబిల్ స్కోర్ పొంది ఉండాలి’’ అని బ్యాంక్ స్పష్టం చేసింది. రూ.50 లక్షల గృహ రుణంపై 70 బేసిస్ పాయింట్ల తగ్గింపు కస్టమర్‌కు నెలకు రూ.2,496 పొదుపు చేస్తుందని, 30 సంవత్సరాల్లో చూసుకుంటే ఇది దాదాపు రూ.9 లక్షల మిగులని బ్యాంక్ పేర్కొంది. కొత్త రేటు జనవరి 7 నుంచీ మంజూరయిన అన్ని రుణాలకూ వర్తిస్తుందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కారు రుణాలపై బీఓబీ వడ్డీరేటు 8.85 శాతం ఉంది. తనఖాల విషయంలో ఈ రేటు 10.35 శాతం.
ఎంసీఎల్‌ఆర్‌కు మారితే చార్జీలు లేవు...
బేస్ రేటు (9.60 శాతం) ప్రాతిపదికగా ఉన్న బ్యాంక్ కస్టమర్లు ఎటువంటి అదనపు చార్జీలూ లేకుండా కొత్త ఎంసీఎల్‌ఆర్‌లోకి మారే వెసులుబాటును బీఓబీ ఉంది. ఇలాంటి సందర్భాల్లో ఎస్‌బీఐసహా మిగిలిన బ్యాంకుల్లోనైతే మొత్తం చెల్లించాల్సిన రుణంలో కనీసం రూ.10,000 లేదా 0.5% ‘స్విచ్‌ఓవర్’ ఫీజుగా చెల్లించాల్సి వస్తుంది.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రేటు కోత..: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా జనవరి 7వ తేదీతో వర్తించేలా ఎంసీఎల్‌ఆర్‌ను 30 బేసిస్ పాయింట్లు తగ్గించింది. వార్షిక ఎంసీఎల్‌ఆర్ 8.95%గా ఉంటుంది.