
సాక్షి, న్యూఢిల్లీ: ఇప్పటికే కస్టమర్లను తీవ్ర ఇక్కట్ల పాలు చేస్తున్న బ్యాంకులు ఇపుడు వారినెత్తిన మరో బాంబు వేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. అతి త్వరలో ఏటీఎం లావాదేవీలు, చెక్కుల జారీ, డెబిట్ కార్డుల లావాదేవీలు తదితర లావాదేవీల పై సర్వీస్ ఛార్జి విధించాలనే సంచలన నిర్ణయం దిశగా కదులుతున్నాయి. ప్రధానంగా ఇకపై ఉచిత సేవలపైన కూడా పన్నులు కట్టాలన్న జీఎస్‌టీ నోటీసుల నేపథ్యంలో ఇకపై ఉచిత సేవలకు శుభం కార్డు వేయనున్నాయని తెలుస్తోంది. మే నెలలో దీనికి సంబంధించిన పూర్తి ఆదేశాలు రానున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి.
ఆయా బ్యాంకులు ఉచితంగా అందించిన సేవలకు కూడా.. సర్వీస్ ఛార్జీ వసూలు చేసినట్లు పరిగణించిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ ఇంటెలిజెన్స్ (డీజీజీఎస్‌టీ) ఈ నోటీసులు అందించటం విశేషం. బ్యాంకులు ఉచితంగా అందించే సేవలపై.. సర్వీస్ ఛార్జీ విధిస్తున్నట్లుగా భావించి ఈ పన్నులు చెల్లించాలని జీఎస్‌టీ ఇంటలిజెన్స్ కోరింది. ఈ మేరకు ప్రధాన బ్యాంకులకు నోటీసులు అందాయి. అంతేకాదు ఈ సంవత్సరానికే కాకుండా.. గత ఐదేళ్లుగా ఖాతాదారులకు బ్యాంకులు అందించిన అన్ని ఉచిత సేవలపైనా ట్యాక్స్ కట్టాలని ఈ నోటీసుల్లో తెలిపింది. ఈ పన్నుల భారం మొత్తం విలువ సుమారు రూ.6వేల కోట్లు ఉండొచ్చని అంచనా. ఇదే జరిగితే ఉచిత సేవలకు బదులు బ్యాంకులు ఇక సర్వీస్ చార్జీ బాదుడుకు తెర తీస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఏటీఎం లావాదేవీలు, చెక్ బుక్కుల జారీ, లావాదేవీలు, కార్డుల ద్వారా జరిగే అన్ని లావాదేవీలపై సర్వీస్ ఛార్జీ భారం తప్పదంటున్నారు. ఇప్పటివరకు ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ ఐసీఐసీఐ, యాక్సిస్, కొటక్ మహీంద్ర బ్యాంకులకు నోటీసులు అందాయి. త్వరలోనే ఇతర బ్యాంకులకు నోటీసులు అందే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment