లక్ష్యాలు దాటిన ‘ముద్రా’ రుణాలు
2016–17లో రూ.1.80 లక్షల కోట్లకుపైగా మంజూరీలు
న్యూఢిల్లీ: స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించడానికి కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ముద్రా (మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ అండ్ రీఫైన్స్ ఏజెన్సీ లిమిటెడ్– ఎంయూడీఆర్‌ఏ) పథకం కింద బ్యాంకులు లక్ష్యాలను మించి రుణాలను అందజేశాయి. గడచిన ఆర్థిక సంవత్సరం అసంఘటిత రంగానికి బ్యాంకులు ఈ పథకం కింద రూ.1.80 లక్షల కోట్లకుపైగా రుణాలను అందజేశాయి. 2016–17లో నిజానికి రుణ పంపిణీ లక్ష్యం రూ.1.80 లక్షల కోట్లు. అయితే ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం, మార్చి నాటికి రూ.1,80,087 కోట్లుగా నమోదయినట్లు ఆర్థికమంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇంకా కొన్ని చిన్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల నుంచి సమాచారం రావాల్సి ఉందని కూడా ఈ ప్రకటన వివరించింది. ఈ సమాచారం కూడా అందితే గత ఆర్థిక సంవత్సరం రుణ మంజూరీల పరిమాణం మరింత పెరిగే వీలుంది. ఇప్పటి వరకూ అందిన సమాచారం చూస్తే, ఈ పథకం కింద బ్యాంకులు మంజూరు చేసిన మ్తొతం రూ. 1,23,000 కోట్లయితే, నాన్–బ్యాంకింగ్ సంస్థలు రూ. 57,000 కోట్ల రుణ మంజూరీలు చేశాయి. 2015 ఏప్రిల్‌లో ‘ఫండ్ ది అన్‌ఫండెడ్’ పేరుతో ప్రధాని నరేంద్రమోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. చిన్న పరిశ్రమలు రూ.50,000 నుంచి రూ.10 లక్షల వరకూ ఈ పథకం పరిధిలోని శిశు, కిషోర్, తరుణ్ విభాగాల కింద రుణం పొందే సౌలభ్యం ఉంది.