డిసెంబర్‌లో మౌలికం 5.6% అప్
న్యూఢిల్లీ: ఎనిమిది కీలక పరిశ్రమలతో కూడిన మౌలిక రంగం డిసెంబర్‌లో 5.6 శాతం వృద్ధి నమోదు చేసింది. బొగ్గు, ముడి చమురు, సహజవాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంటు, విద్యుత్ పరిశ్రమల మేళవింపైన కీలక మౌలిక రంగ సంస్థల వృద్ధి డిసెంబర్ 2015లో 2.6 శాతం. కాగా గతేడాది నవంబర్‌లో ఇది 4.9 శాతంగా ఉంది. మొత్తం పారిశ్రామికోత్పత్తిలో ఇన్‌ఫ్రా వాటా 38 శాతంగా ఉంటుంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2016 ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో ఇది 5 శాతంగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే వ్యవధిలో వృద్ధి 2.6 శాతం.
జీడీపీ అంచనాలను సవరించిన సీఎస్‌ఓ
న్యూఢిల్లీ:ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరం జీడీపీ అంచనాలను సవరించింది. 2015–16 ఆర్థిక సంవత్సరంలో 7.6 శాతం వృద్ధి ఉండగలదన్న అంచనాలను కేంద్ర గణాంక సంస్థ(సీఎస్‌ఓ) 7.9 శాతానికి సవరించింది. వ్యవసాయం, పారిశ్రామికోత్పత్తిలకు సంబంధించిన తాజా గణాంకాలను పరిగణనలోకి తీసుకొని వృద్ధి అంచనాలను సవరించామని సీఎస్‌ఓ తెలిపింది. నిలకడ (2011–12) ధరల్లో గత ఆర్థిక సంవత్సరం జీడీపీ రూ.113.58 లక్షల కోట్లని(7.9 శాతం), అలాగే 2014–15 ఆర్థిక సంవత్సరం జీడీపీ రూ.105.23 లక్షల కోట్లని(7.2 శాతం) పేర్కొంది.