ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, పట్నా : దేశంలో పెట్రోల్ ధరలు భగ్గుమంటుంటే బిహార్‌లోని నేపాల్ సరిహద్దు ప్రాంతాల ప్రజలు పెట్రో సెగలను తప్పించుకునేందుకు సరికొత్త దారులు వెతికారు. రక్సల్, సీతామర్హి ప్రాంతాల్లోని ప్రజలు తమ వాహనాల్లో పెట్రోల్ నింపుకునేందుకు పక్కనే ఉన్న పొరుగు దేశం వెళతున్నారు. భారత్‌తో పోలిస్తే నేపాల్‌లో పెట్రోల్ రూ 15, డీజిల్ రూ 18 తక్కువ కావడం గమనార్హం. మరోవైపు మన కరెన్సీ రూ 100 నేపాలీ రూపీ 160.15తో సమానం. దీంతో నేపాల్‌లో పెట్రో ఉత్పత్తుల ధరలు అందుబాటులో ఉండటంతో సరిహద్దు ప్రాంత ప్రజలు పెట్రోల్ కోసం సరిహద్దులు దాటుతున్నారు.
నేపాల్ సరిహద్దుకు సీతామర్హి కేవలం 30-40 కిమీ దూరంలో ఉంది. మరోవైపు కొందరు వ్యాపారులు నేపాల్‌లో తక్కువ ధరకు పెట్రోల్, డీజిల్ కొని వాటిని భారత్‌లో విక్రయిస్తున్నారు. భారత్ సరిహద్దుల్లో గత కొద్దిరోజులుగా పెట్రోల్ విక్రయాలు 15 నుంచి 20 శాతం పెరిగాయని నేపాల్ ఆయిల్ కార్పొరేషన్ అధికారి పేర్కొన్నారు.
నేపాల్‌లో పెట్రో విక్రయాలు పెరగడంతో నేపాల్ ఆయిల్ కార్పొరేషన్ సంబరపడుతుంటే బిహార్ సరిహద్దుల్లోని పెట్రో పంపులు వినియోగదారులు లేక కళతప్పాయి.ఇక నేపాల్‌కు సైతం పెట్రోలియం ఉత్పత్తులను భారత్ సరఫరా చేస్తోంది. పొరుగు దేశానికి భారత్ నుంచి రోజూ 250 ట్యాంకర్ల ఆయిల్ నేపాల్ సరఫరా అవుతోంది. భారత్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులతో పెట్రోల్ ధరలు భారమవుతుండగా, నేపాల్‌లో ఏకపన్ను వ్యవస్థ అమల్లో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment